పోలవరం పనుల్లో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని వారంలోగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆదేశించిన రెండు రోజులకే ఈ రీటెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్నది. శనివారం రీటెండర్ల నోటిఫికేషన్ వస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఈ టెండర్లను మళ్లీ నవయుగ సంస్థ దక్కించుకోవడానికి కూడా సమాన అవకాశాలు ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టులో దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల మేర అంచనాలు పెంచి.. కొత్తగా టెండర్లు పిలవడానికి గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. చంద్రబాబు స్వయంగా నాగపూర్ వెళ్లి ఆ మేరకు మంత్రి గడ్కరీని ఒప్పించే ప్రయత్నం చేశారు. పాత ధరలకు చేయడానికి ముందుకొస్తేనే కొత్త కాంట్రాక్టర్లను తీసుకుంటాం తప్ప.. ధర పెంచి, మళ్లీ టెండరు పిలిచేది అసాధ్యం అని గడ్కరీ తిరస్కరించారు.
ఆ రకంగా.. రెండున్నర వేల కోట్ల రూపాయలు అప్పనంగా స్వాహా చేయడానికి చంద్రబాబు వేసిన స్కెచ్ ఫెయిలయిందనే పుకార్లు అప్పట్లో బాగా వినిపించాయి. తీరా పాతధరకే పని చేయడానికి నవయుగ సంస్థ ముందుకు వచ్చింది. చంద్రబాబు స్కెచ్ పారలేదు. వారికి పనులు నామినేషన్ పద్ధతిపై అప్పగించారు. తీరా జగన్ ప్రభుత్వంలోకి రాగానే వారి కాంట్రాక్టును రద్దు చేసేశారు. ఇప్పుడు రీటెండర్లు పిలవడానికి శనివారం నోటిఫికేషన్ తెస్తున్నారు.
ఈ టెండర్లలో కావలిస్తే నవయుగ సంస్థ కూడా పాల్గొనవచ్చునని మంత్రి అనిల్ కుమార్ చెబుతున్నారు. వారు పాల్గొంటారు కూడా. అయితే ప్రభుత్వం కోట్ చేస్తే ధరకంటె తక్కువకు పనిచేయడానికి ఇతర కొత్త కాంట్రాక్టర్ల కంటె నవయుగ వారికి కొంత ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు.. అందుకు అవసరమైన మెషినరీ, సాంకేతిక నిపుణులను సమగ్రంగా సమకూర్చుకోవడం పెద్ద పని.
కొత్తగా ఈ కాంట్రాక్టులోకి ఎంటరయ్యేవారు ఆ భారాన్నంతా ప్లాన్ చేసుకుని టెండరు వేయాల్సి ఉంటుంది. అదే నవయుగ సంస్థ.. ఇప్పటికే ప్రాజెక్టు స్థలంలోనే తమ సకల వనరులతో సమృద్ధంగా ఉన్నది గనుక… వారికి కాగల వ్యయం కొంత తగ్గుతుంది. ఆ మేరకు తగ్గించుకుని వారు కాంట్రాక్టుకు ఒప్పుకున్నా.. ప్రభుత్వానికి ఎంతోకొంత లాభం జరుగుతుంది. పనులు ఎవరు దక్కించుకున్నారనేది కాదు గానీ.. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పనులు జరగడం అనేది ముఖ్యమనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రీటెండరుతో వ్యయం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి కూడా చెప్పడం విశేషం.