కొన్ని రోజులుగా పాకిస్తాన్ భారత్‌ను కవ్వించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. వాణిజ్యం, రైళ్ల రాకపోకలను బంద్ చేసింది. మన రాయబారిని వెనక్కు పంపుతోంది. సరిహద్దు వెంబడి.. కవ్వింపు కాల్పులకు తెగిస్తోంది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లిస్తోంది. ఇలాంటి సునిశితమైన సమయంలో.. ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు కూడా పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. అందుకే భారత నాయకులు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా వాజపేయికి నివాళి అర్పించిన ఒక కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చెప్పిన మాటలు మాత్రం పాకిస్తాన్ కు వణుకు పుట్టించేవే అనడంలో సందేహంలేదు.
పాకిస్తాన్‌తో యుద్ధం అంటూ వస్తే గనుక.. భారత్ వైపునుంచి అణ్వస్త్ర ప్రయోగాన్ని చేయగల అవకాశాన్ని కొట్టిపారేయలేం అన్నట్లుగా రాజ్‌నాధ్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆయన చాలా లౌక్యంగా, ఏమాత్రం నోరుజారకుండా వెల్లడించడం విశేషం. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దిన ఘనత వాజపేయికి దక్కుతుంది. ఆయన ప్రధాని అయిన తొలిరోజుల్లోనే పోఖ్రాన్ లో భూగర్భ అణ్వస్త్ర పరీక్షలు జరిగాయి. ఆయన వర్ధంతి సందర్భంగా రాజ్‌నాధ్ పోఖ్రాన్ లోని ఒక కార్యక్రమంలో నివాళి అర్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మొదటగా ప్రయోగించకూడదు’ అనేదే ప్రస్తుతానికి తమ దేశ విధానంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. ఆ మేరకు భారత్ నియమానికి కట్టుబడి ఉన్నదని.. ఆ తరహా దాడులతో ప్రత్యర్థులు కవ్విస్తే తప్ప.. తమంతగా తాము తొలిసారిగా అణ్వస్త్రాన్ని వేయబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో.. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం’ అని మరో కీలకవ్యాఖ్య చేశారు. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన చెప్పారు.
భారత రక్షణమంత్రి రాజ్‌నాధ్ మాటలు పాకిస్తాన్ కు స్పష్టమైన హెచ్చరికలే అనడంలో ఎలాంటి సందేహంలేదు. సరిహద్దు వెంబడి కవ్వింపు కాల్పులకు పాల్పడుతున్న పాక్ బలగాలు.. తాము అతిచేస్తే.. ఎంతటి దారుణమైన మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో… అర్థం చేసుకోవాలి. భారత్ ఒక విధానానికి కట్టుబడి, శాంతిని అభిలషిస్తోందని.. పరిణామాలను తెగేదాకా లాగితే.. నష్టం తమకే అని ఆ దేశం తెలుసుకుంటే మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.