త్వరలో విశాఖ మెట్రో రైలు కూత

విశాఖ మెట్రో సిటీగా ఉంది. అటువంటి సిటీలో అద్భుతమైన అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖలో అతి త్వరలో మెట్రో రైలు కూత పెట్టేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డీపీయార్ ని సిద్ధం…

విశాఖ మెట్రో సిటీగా ఉంది. అటువంటి సిటీలో అద్భుతమైన అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖలో అతి త్వరలో మెట్రో రైలు కూత పెట్టేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డీపీయార్ ని సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న నెలలలో మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.

మొత్తం విశాఖ నుంచి అటు భోగాపురం ఎయిర్ పోర్టుని కలుపుతూ నాలుగు కారిడార్లతో 140 కిలోమీటర్ల దూరంతో 28 స్టేషన్లతో మెట్రో రైలు రానున్న కాలంలో పరుగులు తీయనుంది. తనతో పాటు విశాఖ ప్రగతిని పరుగులు పెట్టించనుంది.

మెట్రో రైలు మొదటి కారిడార్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ ఉంటుంది. రెండవ కారిడార్. విశాఖ సిటీలోని గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ దాకా, మూడవ కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి విశాఖ బీచ్ దాకా. నాలుగవ కారిడార్ కొమ్మాది నుంచి తగరపువలస, భోగాపురం విమానాశ్రయం దాకా ఉంటుంది.
 
ఈ నాలుగు కారిడార్లు కలిపి మొత్తం నాలుగు వేల 873 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం చేపడతారు. ఇక విశాఖ జనభా ఈ రోజుకు ముప్పయి లక్షలుగా ఉంది. చుట్టుపక్కన జనాభాతో కలుపుకుంటే నలభై లక్షలు అవుతుంది. 2050 నాటికి విశాఖ జనాభా మరో ఇరవై లక్షలు అదనంగా పెరిగే అవకాశం ఉందని భావించి భవిష్యత్తు అవసరాలను గుర్తించి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిర్మాణం చేపడుతోంది.

విశాఖ శివారు ప్రాంతాలలో విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే విమానాశ్రయం నుంచి విశాఖ రావడానికి పోవడానికి ఈ మెట్రో రైలు ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నిమిత్తం ప్రతీ రోజూ వేలాది మంది విశాఖ సిటీతో రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ నూరు శాతం సక్సెస్ ఫుల్ అవుతుంది అని అంటున్నారు.

విశాఖ ఈ రోజుకు ఆర్ధిక రాజధానిగా ఉంది. రానున్న రోజులలో పాలనా రాజధానిగా మారితే మెట్రో రైలు అత్యవసరం అని అంటున్నారు. తూర్పు కోస్తా సాగర తీరంలో చెన్నై,  కోల్ క‌త్తలతో పాటు సరిసాటిగా ఎదిగే వీలున్న కెపాసిటీ పొటెన్షియాలిటీ ఉన్న నగరం విశాఖ అని అంటున్నారు. మెట్రో రైలు కూత పెడితే విశాఖ స్వరూప స్వభావమే మారిపోతుంది అని అంటున్నారు.