24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్లు ఈ చారిత్రాత్మకమైన ఎన్నికల పోటీలో తలపడుతుండగా గాంధీయేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపిక చేయనుంది.
సోమవారం దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో పార్టీలోని సుమారు 9 వేల మంది పీసీసీ డెలిగేట్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరలకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయ్యక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ కు తరలించి, ఈ నెల 19న కౌటింగ్ చేపట్టి, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు.
సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేస్తే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర క్యాంప్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ వేయనున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ బరిలో లేకపోవడం వల్ల 24 ఏండ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.