సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అంటే ఏకధ్రువ వ్యవస్థలు, సంస్థలుగానే ఉంటాయి. ఒకే నాయకుడు కేంద్రబిందువుగా ఉంటారు. వ్యతిరేకులు కుటుంబ పార్టీలు అనే విమర్శలు చేయగల అవకాశం కూడా ఉంటుంది. కావచ్చు గాక.. కానీ.. ఈ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఒక వ్యక్తి రెక్కల కష్టం మీద నిర్మాణం అయినవే. ఒకడే నాయకుడు.. ఒకటే మాట! ఎవ్వరూ ఎదురుచెప్పడానికి లేదు. నాయకుడి మనోగతానికి భిన్నంగా ముఠాలు కట్టడానికి కూడా వీల్లేదు. అది పార్టీకి చేటు!
వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ఆర్ అనే మహానేత ఆశీఃబలంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో ఆవిర్భవించిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ! ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన నీడన ఉన్న అందరూ లబ్ధి పొందుతారు. కానీ, వాళ్లలో వాళ్లు ముఠాలు కట్టి, ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటే.. నెమ్మదిగా పార్టీ పరువు పోతుంది. ఆ నీడ పలచన అవుతుంది. నష్టం మాత్రం జగన్ పరం అవుతుంది. ముఠాలు కట్టే నాయకులు.. కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కునే మూర్ఖులు! వారిని చూస్తూ ఉపేక్షిస్తే.. జగన్ అంతటి అమాయకుడు మరొకరు ఉండరు!
వైసీపీలో ముఠా కుమ్ములాటలు– పర్యవసానాలపై గ్రేటాంధ్ర సమగ్ర కథనం!
పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. పళ్లేకాయని చెట్టుమీదకు రాళ్లెవరు విసురుతారు? ఎందుకు విసరుతారు? అదే తరహాలో.. అధికారంలో ఉన్న పార్టీ మీదనే అందరికీ ఆశలు ఉంటాయి! ఆ పార్టీలోని కార్యకర్తలకే కోరికలు ఉంటాయి! వారి నడుమనే లుకలుకలు కూడా ఉంటాయి! అధికారమే లేని పార్టీలో తగాదాపడేంత శ్రద్ధ కూడా ఎవ్వరికీ ఉండదు. కాబట్టి లుకలుకలైనా.. వర్గతగాదాలైనా అన్నీ అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయాలే ఇప్పుడు చర్చనీయాంశం. ఆ ముఠాతగాదాలు రచ్చకెక్కి.. పార్టీ పరువును బజారుకీడుస్తుండడం.. పార్టీకి చేటు చేస్తుండడం ఇంకా పెద్ద చర్చనీయాంశం. పార్టీ అధినేత అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పే అంశం.
విశాఖలో బజార్నపడ్డారు..
ఏదో రెండు గ్రూపులుంటాయి.. వారి మధ్య చికాకులు, తగాదాలు ఉంటాయి అని సర్దుకుపోయే వ్యవహారం కాదు.. విశాఖలో జరిగినది! ఒకరి అక్రమాలను మరొకరు బయటకు చెప్పుకునే తరహాలో.. ఉభయులూ కలిసి పార్టీ పరువు తీయడం తాజా సంగతి. మరోచోట అయితే దాని తీవ్రత ఇంకో రకంగా ఉండేది. కానీ.. ఏదైతే భవిష్యత్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గుర్తింపు పొంది ఉన్నదో.. ఏ నగరాన్నయితే రాష్ట్రంలో తిరుగులేని ప్రధాన నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పిస్తున్నారో.. ఆ నగరంలోనే పార్టీ పరువు బజార్న పడితే.. చేజేతులా తమ పార్టీ వారే ఆ పనికి పాల్పడితే ఎలా అర్థం చేసుకోవాలి.
విశాఖలో దసపల్లా భూముల గురించి పచ్చమీడియా కొన్ని రోజులుగా.. వీరబీభత్సంగా కథనాలు రాస్తోంది. విజయసాయిరెడ్డి కి ముడిపెట్టి అనేక వరుస కథనాలు వస్తున్నాయి. అవన్నీ రెచ్చగొట్టే తరహా వక్ర రాతలే. అవినీతి జరిగితే, నిజంగా భూముల స్వాహా జరిగితే, నిబంధనలకు విరుద్ధంగా కొత్త చట్టాలు, జీవోలు తెచ్చి తమకు అనుచిత లబ్ధి కోసం ప్రయత్నించడం జరిగితే.. పత్రికలు తమ పాత్రను చాలా చక్కగా పోషించవచ్చు.. పోషించాలి కూడా. సాక్ష్యాలు దొరికినప్పుడు మరింత ఘాటుగా జరిగిన తప్పులను ఎత్తిచూపించాలి కూడా. అయితే.. పచ్చమీడియావి మాత్రం వక్రరాతలు అని అనడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఎవరికైతే ఈ సమస్త అవినీతిని ఆపాదిస్తున్నారో.. వారికి నేరుగా లబ్ధి చేకూరడం లేదు! పోనీ, ఇదంతా బుకాయింపు.. అంతిమంగా లబ్ధి పొందేది వారే.. అని కూడా అనవచ్చు. కానీ రాసే పద్ధతి అమర్యాదకరంగా, వెటకారాలు మేళవించి ఉంటే అది జర్నలిజం రాత అనిపించుకోదు.. పచ్చమీడియా రాత అనిపించుకుంటుంది. అయితే.. వారి ట్రాప్ కు విజయసాయిరెడ్డి పడిపోయారు. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఆ వివరణ కాస్తా పార్టీని బజార్లో పెట్టింది. విశాఖ ఎంపీ అవకతవకల గురించి టముకేసి చెప్పారు.
భూయజమానికి తక్కువ వాటా ఇచ్చి.. 71 శాతం వాటా బిల్డర్ కు ఎలా వచ్చింది సారూ అని మీడియా వాళ్లు అడిగితే.. ఒక వైపు ఆ ప్రాజెక్టుతో తనకు సంబంధం లేదని అంటూనే.. నన్నెందుకు అడుగుతారు.. యజమానికి ఒక్కశాతమే ఇచ్చి.. 99 శాతం తీసుకున్న కాంట్రాక్టరును అడగండి.. అంటూ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ బాగోతాన్ని విజయసాయిరెడ్డి స్వయంగా బయటపెట్టారు. అదొక్కటే కాదు.. ‘ఇప్పటికీ నేనే విశాఖపట్నం ఎంపీని’ అంటూ మరో డైలాగు కూడా వేశారు. అప్పటినుంచి నానా రచ్చా అయిపోతోంది. విశాఖలో వైసీపీవాళ్లు రియల్ ఎస్టేట్ దందా చేయడానికే.. రాజధాని చేస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలకు స్వయంగా పార్టీలోని అంతర్గత ముఠా తగాదాలే ఊపిరిపోస్తున్నట్లుగా వాతావరణం తయారైంది. పచ్చమీడియా అప్పటినుంచి ఈ వ్యవహారాలకు ముడిపెట్టి ఓ ఆటాడుకుంటోంది.
ఇప్పుడు భారీగా పరువు తీసిన ఈ తగాదాలు కాదు.. కొన్నేళ్లు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల లెవెల్లో చెలరేగే ముఠాతగాదాలను కూడా.. మరో ఏడాదిన్నరలో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆది నుంచి ముఠాలున్నాయ్..
ముందే చెప్పుకున్నట్టు పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు! వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి.. నాయకులు అప్పటికే ఆవురావురుమని ఉన్నారు. రాష్ట్రంలో లెక్కకు మిక్కిలిగా నాయకులుంటే.. ఎమ్మెల్యే పదవులు 151 మందికి మాత్రమే దక్కాయి. తత్సమానమైన పోస్టులు, నామినేటెడ్ పోస్టులు, చిన్నా చితకా పార్టీ పదవుల సహా ఆశించేవాళ్లు 1:100 ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పదవుల పంపకాలు చేపట్టిన ప్రతిసారీ.. నాయకత్వం చాలా సవాళ్లను ఎదుర్కొంది. గ్రూపుల సమీకరణలను, కుల మత ప్రాంత సమీకరణలను అన్నింటినీ పరిగణిస్తూ నెట్టుకొస్తున్నారు. పర్యవసానంగా ప్రతిచోటా అసంతృప్తులు, అలకలు, పదవులు దక్కిన వారి మీద అసూయతో ముఠాలు ఇవన్నీ కూడా మామూలే అయ్యాయి.
ఇటు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి– రోజా వర్గాల నుంచి అటు శ్రీకాకుళంలో బొత్స సత్యనారాయణ– కోలగట్ల వీరభద్రస్వామి వర్గాల వరకు ప్రతిచోటా ముఠాలున్నాయి. విశాఖ రాజధానిగా ప్రభుత్వం ఫోకస్ పెంచిన తర్వాత అక్కడ కూడా ముఠాలు ఎక్కువయ్యాయి. బహిరంగ వేదికల మీద ఒకరి పరువు మరొరు తీసుకునేలా వ్యహరించిన సంఘటనలు లెక్కలేదు. కానీ.. ఉమ్మడిగా పార్టీ పరువునే బజారుకీడ్చిన సందర్భాలు కొన్నే.
పార్టీ ముఠాల్లోనే హత్యలు కూడానా.. హవ్వ!
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఠా తగాదాలు ఒక ఎత్తు. అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి హత్య ఒక్కటీ మరో ఎత్తు. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక హత్య జరిగితే.. నిజమైనా కాకపోయినా, ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు కురిపిస్తూ ఉభయ పార్టీలూ రాజకీయ లబ్ధికి ప్రయత్నించే పరిస్థితి ఉండేది. అలాంటిదిది.. హిందూపురంలో వైసీపీ నేత హత్యకు గురైతే.. తెలుగుదేశం పాత్ర ఉన్నదని ఎవరూ పల్లెత్తు మాట అనలేదు. సాక్షాత్తూ మృతుడి కుటుంబం వైసీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపణలు చేస్తోంది. చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటోంది. ప్రభుత్వం కూడా కిమ్మనడం లేదు. మరణించిన తమ సొంత పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా చాలా మంది వైసీపీ పెద్దలు ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కాని సంగతి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శకు వెళ్లినప్పుడు.. మృతుడి తరఫు వారు నిలదీస్తే.. వారి ఆగ్రహంలో అర్థముంది.
పార్టీలోని అంతర్గత కుమ్ములాటల్లో.. వీధి కొట్లాటలు కూడా అనేకం ఈ నాలుగేళ్లలో గమనిస్తున్నాం. ఈ మధ్య అంతగా సందడిలేదుగానీ.. చీరాలలో అయితే.. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ముఠాలు వీధిన పడి కొట్టుకోవడం అనేది ఒక రెగ్యులర్ కార్యక్రమం లాగా నిర్వహిస్తుంటాయి. సుదీర్ఘకాలం నియోజకవర్గంలో శాంతి పరిఢవిల్లితే.. తమ వర్గాల మధ్య స్నేహం కుదిరిందని ప్రజలు భ్రమపడుతారేమో అనేది వారి భయం కావచ్చు. అలా వీధి కొట్లాటల స్థాయికి పార్టీని దిగజార్చడం చాలా చోట్ల ఉంది. కానీ.. ఏకంగా సొంత పార్టీలోనే హత్యలు చేసే స్థాయికి వెళ్లడంతో హిందూపురం దుర్ఘటన.. పార్టీకి ప్రమాద సంకేతంగా మారుతోంది.
కాంగ్రెస్ సంస్కృతి అంటే కుదర్దు!
వైఎస్సార్ కాంగ్రెస్ అనేది.. కాంగ్రెస్ నుంచి చీలి పుట్టుకొచ్చిన పార్టీ. చాలామంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే ఈ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ముఠా కుమ్ములాటలకు పేటెంట్ ఉన్న పార్టీ. ప్రతి చోటా ముఠాలను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ అధిష్ఠానం ముందుంటుంది. అలాంటి ముఠా రాజకీయాలను తట్టుకోలేకనే.. నిండైన ప్రజాదరణ ఉన్నప్పటికీ.. ఆ పార్టీలో ఇమడకుండా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి.. తన తండ్రి పేరును చిరస్థాయిగా మారుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ స్థాపించారు. తనకున్న ఆదరణ, తన కష్టంతోనే నడుపుతున్నారు. ముఠాలు కాంగ్రెస్ నుంచి సంస్కృతిగా మనలోకి వచ్చాయని ఇక్కడి నాయకులు సర్ది చెప్పుకుంటే సర్వనాశనం అయ్యేది ఈ పార్టీనే.
ముఠాలను ప్రోత్సహించడం ద్వారా.. అధిష్ఠానం అనే పదం కింద గుర్తింపు పొందుతున్న తమ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా, తమ సీటుకిందకి చెమ్మ రాకుండా కాంగ్రెస్ లో ఒక వ్యూహాత్మక రాజకీయం నడిపిస్తుంటారు. కానీ.. ప్రాంతీయ పార్టీల్లో అలా కుదరదు. ఈ పార్టీలో వ్యక్తిస్వామ్య పార్టీలుగానే ఉంటాయి. ఒక నాయకుడి ఇష్టాయిష్టాల ప్రకారమే అందరూ నడుచుకోవాలి. నడిచేలా.. ఆ నాయకుడు చెక్ చేసుకోవాలి. అలా జరగకపోతే నష్టం నాయకుడికి! అందుకే పేరులో కాంగ్రెస్ అని ఉన్నంత మాత్రాన.. వైసీపీ వారు.. ముఠా తగాదాల్లో కొత్తదనం లేదని అనుకోకుండా.. పార్టీ విజయం అనేది టీమ్ వర్క్ మీదనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి.
జగన్.. ఇంకా మౌనమేనా..
కొందరి తగాదాల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి స్వయంగా వేలుపెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. మిగిలిన ప్రతిచోటా ముఠా తగాదాలని సెకండ్ గ్రేడ్ నాయకులు సెటిల్ చేయడమే ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. అయితే ఇలా తగాదాల మధ్య రాజీకుదిర్చే ప్రయత్నాలు కూడా ఏదో గన్నవరం వంశీ గొడవల్లాంటి కొన్ని చోట్ల తప్ప అన్నీ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నవే. కానీ ఈ ధోరణి పనికి రాదు. జగన్ మోహన్ రెడ్డి ఇంకా మితిమీరిన మౌనం పాటిస్తే.. అది పార్టీకి నష్టమే చేస్తుంది.
కనీసం రాబోయే ఏడాదిన్నర కాలంలో ఎక్కడ పార్టీలో గ్రూపు తగాదాలు బయటకు వచ్చినా.. స్వయంగా పార్టీ అధినేత స్పందిస్తున్నారు.. సీరియస్ అవుతున్నారు.. చర్యలు తీసుకుంటున్నారు.. కఠినంగా వ్యవహరిస్తారు.. అనే సంకేతాలు యావత్ రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు అందాలి. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు కాదు.. స్వయంగా జగన్ పూనుకోవాలి. రాజీ అయినా, మందలించడం అయినా.. ఏదోటి తనే చేయాలి. మొత్తానికి మళ్లీ గ్రూపుల మాటే పార్టీలో వినిపించకుండా చేయాలి. ఎందుకంటే.. సెకండ్ గ్రేడ్ లీడర్ రాజీ చేసినంత కాలమూ.. ఆ పైన మరొకడు ఉన్నాడు.. మన వైపు న్యాయం ఉన్నదని.. ఆయనకు నివేదించుకుంటే సరిపోతుందనే భరోసా.. ముఠా నాయకుల్లో ఉంటుంది.
అదే జగన్ స్వయంగా వారిని పిలిపించి సీరియస్ గా మాట్లాడితే.. ఇక ఆయనకు పైన ఎవరూ ఉండరు గనుక.. పార్టీలో ఉండదలచుకుంటే మాట వింటారు.. వినదలచుకోకపోతే.. బయటకు పోతారు. ఏదోటి తేలిపోతుంది. ఎందుకంటే.. గతానుభవాలను అన్నింటినీ లెక్కవేసుకుంటే.. ఇప్పటిదాకా సెకండ్ గ్రేడ్ నాయకులు రాజీకుదిర్చిన వ్యవహారాలు ఏవీ పూర్తిగా సద్దుమణగలేదు. నివురుగప్పిన నిప్పులా లోకల్ గా పార్టీని కాలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి పనుల వల్ల అంతిమంగా పార్టీకి, జగన్ కు మాత్రమే నష్టం. అందుకే స్వయంగా ఆయనే స్పందించాలి.
జగన్.. తాను కష్టపడి సాధించుకున్న అధికారం ఇది! వేరొకరి ముఠాతగాదాలకు, రాజీల పేరిట మరొకరి పెద్దరికానికి.. పణంగా పెట్టడం ఎలా సబబు! అధినేత ఆలోచించాలి!!
.. ఎల్. విజయలక్ష్మి