మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారబోతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటుకు ముప్ఫయి వేల నుంచి నలభై వేల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒక్క ఓటు వచ్చినా అందుకు డబ్బులు ఖర్చు పెట్టేందుకు రెండు పార్టీలు వెనకాడటం లేదని చెబుతున్నాయి.
ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ అధిక వ్యయం చేయలేక డీలా పడిపోయిందంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో దానిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ, టీఆర్ఎస్ ల మాదిరి ఖర్చు చేయలేని పరిస్థితి. ఇటు అభ్యర్థి నుంచి అటు పార్టీ వరకూ ఎవరూ ధైర్యంగా ఖర్చు చేయలేని పరిస్థితి. పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ శతవిధాలుగా పాకులాడుతోంది.
రెండో స్థానం వచ్చినా కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచినట్లే చెప్పుకోవాలి. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా ఓటు బ్యాంకు తమతో ఉందన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే నోటు కంటే జనాన్ని ఎక్కువగా నమ్ముకుని కాంగ్రెస్ ప్రచారంలోకి దిగుతుంది. కాంగ్రెస్ మాత్రం నామమాత్రంగానే ఖర్చు చేయాలని నిర్ణయించింది.