టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు దూరమై చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తెలంగాణలోనే పుట్టి, ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చి, ఒకప్పుడు వైభవంగా వెలిగిన టీడీపీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కనుమరుగైపోయింది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనబడుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత బాబు ఏపీకి సీఎం కావడం, ఆ బాధ్యతలతో బిజీగా ఉండటం, రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు ప్రయత్నాల్లో ఉండటం, ఏపీలో అనేక సమస్యలను పరిష్కరించే పనిలో తలమునకలుగా ఉండటంతో తెలంగాణపై దృష్టి పెట్టలేకపోయారు. అంతే కాకుండా బాబు, కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి అధికారంలోకి రావడంతో కేసీఆర్ తెలంగాణా సెంటిమెంటు ప్రయోగించి బాబును దారుణంగా దెబ్బతీశారు.
టీడీపీని కనుమరుగు చేసే ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను పూర్తిగా లాగేసుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ అనామకంగా అయిపొయింది. అయితే కేసీఆర్ టీఆరెస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో బాబుకు అవకాశం దొరికినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి బీజేపీ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు హైదరాబాద్ నగరంతో పాటుగా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో తన బలం మరింత పెంచుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల సమయానికి ఏపీ కేంద్రంగా తాను అనుకున్న లక్ష్యాలు – పొత్తులకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ఆలోచన లో ఉన్నట్లుగా సమాచారం.
ఇప్పటి వరకూ తెలంగాణలో టీడీపీని ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. ఈ కారణంగాఆ పార్టీ ముందుకు సాగడం కష్టమైంది. నేతలు పార్టీ వీడిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్గా మారిపోయింది. ఈ తరుణంలో టీడీపీ బలపడటానికి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. అందుకే టీడీపీ జోరు పెంచాలనుకుంటోంది. బీజేపీతో ముందుకు సాగాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధమయిందని.. ఢిల్లీ నుంచి కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ప్రతిగా ఏపీలో సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకారం… ప్రస్తుత పరిణామాలు అనుకూలంగా జరుగుతున్నాయి. నిజానికి కోమటిరెడ్డి సోదరులు టీడీపీకి వ్యతిరేకం.
టీడీపీతో పొత్తు వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెబుతారు. కానీ ఇప్పుడు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారు. ఆయన టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ పెద్దలు కూడా అదే సూచించడంతో ఆయన కూడా చంద్రబాబు మద్దతు అడగాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కల్లా టీడీపీని ఎంతో కొంత బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. బలమైన బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు టీ టీడీపీ పగ్గాలు అప్పగించారని సమాచారం. మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందట తెలంగాణ టీడీపీ నేతలు .. చంద్రబాబును కలిసి మునుగోడులో పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నేతలు రెడీగా ఉన్నారన్నారు.
అయితే చంద్రబాబు మాత్రం ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని.. అసెంబ్లీ ఎన్నికల్లో బలపడేందుకు ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబుతో బీజేపీ నేతలు రాయబారం నడిపినట్లుగా చెబుతున్నారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ అటు జనసేన – ఇటు బీజేపీతోనూ పొత్తుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దీంతో, ఇప్పుడు మనుగోడు లో టీడీపీ శ్రేణులు బీజేపీకి మద్దతుగా పని చేసే అవకాశం అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పైన టీడీపీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
తెలంగాణ బీజేపీ నేతలు కొద్ది రోజుల క్రితం వరకూ టీడీపీతో తమకు పొత్తు ఉండదని స్పష్టంగా వెల్లడించారు. ఇప్పుడు మునుగోడులో పోరు కీలకం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో..ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కొందరు సన్నిహితులు..టీటీడీపీ నేతలతో మద్దతు కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆ సంప్రదింపుల కారణంగానే చివరి రోజు వరకు తమ అభ్యర్ధిని బరిలో దించాలని భావించిన టీడీపీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకొని పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ గతంలో తెలంగాణలో బలంగా ఉండేది.
ఏపీలో కంటే తెలంగాణలో టీడీపీ ఓట్ల శాతం ఎక్కువగా ఉండేది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకీ తెలంగాణలో గడ్డు పరిస్థితులు ఎగురయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీడీపీకి సమస్యలు ఎదురయ్యాయి. సమైక్యాంధ్ర ముద్రతో తెలంగాణ టీడీపీ నేతలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా.. ఆయనపై, టీడీపీపై సమైక్యాంధ్ర ముద్ర పోలేదు. 2014లో ఏపీ ముఖ్యమంత్రి అయ్యాకా తెలంగాణలో పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయలేదు చంద్రబాబు. దీంతో 2014లో 15 అసెంబ్లీ సీట్లు గెలిచిన టీడీపీ.. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా రెండు సీట్లు మాత్రమే గెలిచింది. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తర్వాత కారెక్కారు.
తెలంగాణలో పార్టీ బలహీనం అవుతున్నా పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు. 2024లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టారు. దసరా రోజున పార్టీని ప్రకటించిన కేసీఆర్.. త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి.. ఏపీ, తెలంగాణకు కమిటీలు వేశారు. అయినా తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడంతో అప్రమత్తమైన చంద్రబాబు.. తాను ఏమాత్రం వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. బీసీ నాయకుడు కాసాని చేరికతో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందన్నారు చంద్రబాబు. త్వరలోనే తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో టీడీపీకి నేతలు దూరమైనా కేడ్ బలంగానే ఉంది. బలమైన నేతలు వస్తే కేడర్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. మరి చంద్రబాబు అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.