జనవాణిపై జనసేనాని పవన్‌కల్యాణ్ చేతులెత్తేసి, తన నిస్సహాయతను, అసమర్థతను చాటుకున్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు మరింత పట్టుదలతో నాయకులు ముందుకెళ్లడం చూశాం. అదేంటో గానీ, పవన్‌కల్యాణ్ మాత్రం ప్రభుత్వంపై అలిగి లక్ష్యాన్ని మరిచారు. మూడు నెలల క్రితం నిర్ణయించిన జనవాణిని విశాఖకు వచ్చి మరీ రద్దు చేసుకోవడం విమర్శల పాలవుతోంది. అధికార పార్టీ కోరుకున్నట్టుగానే పవన్‌కల్యాణ్ ప్రవర్తించడం గమనార్హం.
విశాఖలో పవన్‌కల్యాణ్ పర్యటన క్షణక్షణానికి మలుపు తిరుగుతోంది. విశాఖలో పవన్ అడుగు పెట్టిన మొదలుకుని, ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. జనసేన కార్యకర్తల వీరంగంతో విశాఖ ఎయిర్‌పోర్టు ప్రాంగణం రచ్చరచ్చగా మారింది. మంత్రులు, వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడడంతో వారిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు.
విశాఖకు వచ్చిన పవన్‌కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తన మార్క్ ఆరోపణలు చేశారు. అరెస్ట్ అయిన వారిని పవన్ పరామర్శిస్తారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత జనవాణిని నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా జనవాణిని రద్దు చేస్తున్నట్టు పవన్ ప్రకటించారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం… సిల్లీగా వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ వారిని విడుదల చేసిన తర్వాతే జనవాణిని నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.
జనవాణి జరగకూడదనేది వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రత్యర్థుల ఎత్తుగడలు ఎలా ఎదుర్కొవాలో తనకు తెలుసన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంత వరకూ జనవాణి నిర్వహించేది లేదని పవన్ స్పష్టం చేశారు.
అధికార పార్టీ కోరుకున్నట్టుగానే పవన్ నడుచుకోవడంపై సొంతపార్టీ నుంచే నిట్టూర్పులు వ్యక్తమవుతున్నాయి. ఇదేం లాజిక్కో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.