మీడియా సంస్థలు, అందులో ముఖ్యంగా దినపత్రికలు నడపడం అన్నది చాలా కష్టం. ఒక పక్క తగ్గుతున్న అమ్మకాలు..మరో పక్క పెరుగుతున్న ఖర్చులు. అందుకే అంతా ఈ పేపర్ మీద దృష్టి పెడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే ఈ రోజు ఆంధ్ర జ్యోతి పున:ప్రారంభమై 20 ఏళ్లు అయిన సందర్భంగా దాని యజమాని ఆర్కే సుదీర్ఘమైన వ్యాసం రాసారు. అందులో ఓ పాయింట్ కనిపించింది.
‘’…ఈ మూడున్నరేళ్లలో ఏం జరిగిందో, జరుగుతున్నదో చూస్తున్నాం కదా? జగన్‌తో రాజీపడటానికి సిద్ధపడి ఉంటే ఈ మూడున్నరేళ్లలో ‘ఈనాడు’, ‘సాక్షి’ తరహాలోనే ‘ఆంధ్రజ్యోతి’కి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అంత పెద్ద మొత్తం కోల్పోవడానికి సిద్ధపడ్డాం గానీ జర్నలిజాన్ని అమ్ముకోదలచుకోలేదు…’’
నిజమే..ఆర్కే చెప్పింది నిజమే అనుకుందాం. ప్రభుత్వాలతో రాజీ పడ వుంటే ప్రకటనల ఆదాయం ఆయన చెప్పినట్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వుండేది అనుకుందాం. తెలుగుదేశం హయాంలో అలా వచ్చిందనే కదా ఆంధ్ర జ్యోతి మీద వైకాపా విమర్శ కూడా. సరే ఆ సంగతి ఎలా వున్నా, మూడేళ్లు ఆంధ్ర జ్యోతిని విజయవంతంగా నడుపుకుంటూనే వచ్చారు కానీ మూత పెట్టలేదు. జర్నలిస్ట్ లకు జీతాల ఇచ్చారు. ప్రొడక్షన్ ఖర్చులు భరించారు.
ఓ మల్టీ ఎడిషన్స్ వున్న దినపత్రిక ప్రభుత్వ ప్రకటనల ఆదాయం మూడు వందల కోట్లు లేకుండా ఇదంతా చేయడం ఎలా సాధ్యం? పైకా కరోనా. టైమ్ లో ప్రయివేటు ప్రకటనలు కూడా తగ్గిపోయాయి. మరి ఆదాయం తక్కువయినా కూడా పత్రిక ఎలా నడుపుతున్నారు అన్నది కచ్చితంగా తెలుసుకోవాల్సిన విజయ రహస్యం.
ఇలా నడపాలి అంటే
మిగులు నిధులు అయినా వుండాలి. బ్యాంకుల రుణాలు అయినా తీసుకోవాలి. లేదా ప్రయివేటు ప్రకటనల ఆదాయం అయినా బాగా వచ్చి వుండాలి. ఇప్పుడు రెండు విషయాలు.
ఒకటి ఓ పెద్ద పత్రికను ప్రభుత్వం వైపు నుంచి 300 కోట్ల ఆదాయం లేకుండా నడపడం ఎలా? ఇది చెబితే రాష్ట్రాల్లో వున్న అనే చిన్న పత్రికలు ఆనందిస్తాయి. ఎందుకంటే పత్రికలు నడపలేక, మూత పెట్టలేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటికీ పారదర్శకత అనే వారు తమ బ్యాలన్స్ షీట్ ను కూడా బయట పెడితే ఓహో..ఇదా ఆదాయ మార్గం అని తెలుసుకుంటారు. ప్రభావితం అవుతారు.
ఇక రెండో విషయం.
మొత్తానికి ఎలాగో అలా పత్రికను మూడేళ్లు నడిపేసారు. ప్రభుత్వం నుంచి 300 కోట్ల ఆదాయం లేకపోయినా సమర్థవంతంగా పత్రికను నడిపారు. ఒకవేళ ఆంధ్ర జ్యోతి అనుకూల ప్రభుత్వం వుండి వుంటే ఆ మూడు వందల కోట్లు వచ్చి వుండేవి. అప్పుడు అవి జస్ట్ లాభంగా మారి వుండేవి. ఎందుకంటే ఈ మూడు వందల కోట్లతో సంబంధం లేకుండానే పత్రికను సమర్థవంతంగా నడపగలరు కదా?
అంటే ఆంధ్రజ్యోతి అనుకూల ప్రభుత్వం వున్నదానికీ లేని దానికి తేడా 300 కోట్లు లాభం అన్నమాట.