తాతల కాలంనాటి ముఖ్యమంత్రి

కేంద్రంలో బీజేపీ పరిపాలన చూస్తుంటే మన దేశం ముందుకు వెళుతున్నదో, వెనక్కి పోతున్నదో అర్ధం కావడంలేదు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న ఆలోచనలు అలా ఉన్నాయి మరి. ధరలు పెంచి సామాన్యుల నడ్డి…

కేంద్రంలో బీజేపీ పరిపాలన చూస్తుంటే మన దేశం ముందుకు వెళుతున్నదో, వెనక్కి పోతున్నదో అర్ధం కావడంలేదు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న ఆలోచనలు అలా ఉన్నాయి మరి. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం హిందీ భాషా వివాదంతో దేశాన్ని రణరంగంగా మారుస్తోంది. హిందీని దేశ ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారని దక్షిణాది రాష్ట్రాలు, మరికొన్ని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. దక్షిణాదిలో ఒక్క ఏపీ మినహా మిగతా రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. భాష విషయంలో కర్ణాటక, తమిళనాడు చెలరేగిపోతాయనే సంగతి అందరికీ తెలిసిందే. 

ఒకప్పుడు తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం భారీ స్థాయిలో జరిగిన సంగతి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండదు. కేంద్ర విద్యా సంస్థల్లో హిందీ మీడియం అనేది దేశాన్ని పాత రాతి యుగంలోకి తీసుకుపోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి. దేశంలోని యువతరమంతా ఇంగ్లిష్ లో సాంకేతిక విద్యను ఒడిసికొట్టుకుంటూ విదేశాలకు దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర విద్యా సంస్థల్లో హిందీ మీడియాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం మొండి పట్టు పట్టడం విమర్శలకు గురవుతోంది. దీన్ని ఆసరా చేసుకొని బీజేపీ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొద్దిగా ఓవరాక్షన్ చేస్తున్నారు కూడా. వీరిని చూస్తుంటే తాతలనాటి ముఖ్యమంత్రులనిపిస్తోంది.  ఇలాంటివారిలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముందున్నారా అనిపిస్తోంది.

హాస్పిటల్స్ లో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మందుల చీటీ రాసేటప్పుడు మొదట పై భాగంలో శ్రీహరి అని రాసి, ఆ తర్వాత మందుల పేర్లు, వివరాలు రాయాలని పేర్కొన్నారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఈ విధానాన్ని అమలుపరచాలని చెప్పారు. ఇప్పటి తరానికి తెలియదుగానీ పాత తరంలో చాలా కుటుంబాల్లో పెద్దలు, పిల్లలు కూడా ఉత్తరాలు రాసేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు, నోట్సులు రాసేటప్పుడు పైన శ్రీ రామా అనో , శ్రీ రామా నీవే కలవు అని రాసేవారు. అలా రాస్తే మంచిదని, శుభం కలుగుతుందనే అభిప్రాయం కావొచ్చు. 

శివరాజ్ సింగ్ చెప్పింది అలాగే ఉంది. ఆయన చెప్పినట్లు చేస్తే  పిల్లల్లో హిందీ పట్ల అభిమానం పెరుగుతుందట. ఇంగ్లిష్‌ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైద్యులు రాసే మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌కు సంబంధించి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఒక కొత్త భాష్యం చెప్పారు. మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ను వైద్యులు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో ఎందుకు రాయకూడదని ప్రశ్నించారు. క్రోసిన్‌ మందు రాయాలనుకున్నప్పుడు హిందీలో క్రోసిన్‌ అని రాస్తే వచ్చే సమస్య ఏముంటుందని అన్నారు.

ఇక నుంచైనా వైద్యులు హిందీలోనే మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. తాను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదని, అయితే జాతీయ భాష అయిన హిందీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అసలు దేశంలో జాతీయ భాష లేదనే సంగతి ఈ ముఖ్యమంత్రికి తెలిసిఉండదు. వెర్రి వేయి విధాలు అంటే ఇదే కావొచ్చు.