టీడీపీని ర‌క్షించుకునే దారేది?

విశాఖ‌లో రాజ‌ధాని విష‌య‌మై ఉత్త‌రాంధ్ర‌లో సెంటిమెంట్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి టీడీపీనే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. ఉత్త‌రాంధ్ర‌కు అమ‌రావ‌తి నుంచి పాద‌యాత్ర మొద‌లు పెట్టించిన పాపానికి టీడీపీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఈ…

విశాఖ‌లో రాజ‌ధాని విష‌య‌మై ఉత్త‌రాంధ్ర‌లో సెంటిమెంట్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి టీడీపీనే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. ఉత్త‌రాంధ్ర‌కు అమ‌రావ‌తి నుంచి పాద‌యాత్ర మొద‌లు పెట్టించిన పాపానికి టీడీపీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో  ‘వైసీపీ నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం’ నినాదంతో విశాఖ‌లో టీడీపీ రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించింది.

వైసీపీ నుంచి ఉత్తరాంధ్ర‌ను కాపాడుకునే సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. టీడీపీని ఎలా ర‌క్షించుకోవాలో ఆ పార్టీ నాయ‌కులు సీరియ‌స్‌గా దృష్టి పెడితే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే ఉత్త‌రాంధ్ర ప్ర‌జానీకం ఎంత అమాయ‌కులో, కోపం వ‌స్తే వారిని నిలువ‌రించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది విప్ల‌వాల పురిటి గ‌డ్డ‌. త‌మ అమాయ‌క‌త్వాన్ని అడ్డు పెట్టుకుని, అభివృద్ధికి పాత‌రేస్తున్నార‌నే ఆవేద‌న ఇప్పుడిప్పుడే వాళ్ల‌లో క‌లుగుతోంది.

అమ‌రావ‌తి పాద‌యాత్ర పుణ్య‌మా అని వారి క‌ళ్ల‌లో కారం చ‌ల్లుతున్న‌ట్టుగా వుంది. రౌండ్‌టేబుల్ స‌మావేశంలో టీడీపీ నేత‌లు లేవ‌నెత్తిన అంశాలు ఆ పార్టీ డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెడుతున్నాయి. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ మాట మార్చార‌ని టీడీపీ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ మాట మార్చ‌డం వ‌ల్ల ఉత్త‌రాంధ్ర‌కు లాభ‌మే త‌ప్ప‌, న‌ష్టం లేదు క‌దా? అని ఆ ప్రాంత పౌర స‌మాజం ఆలోచిస్తోంది.

జ‌గ‌న్ మాట మార్చ‌డం వ‌ల్ల అమ‌రావ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ల‌కే త‌ప్ప‌, మిగిలిన వాళ్ల‌కు కాదు క‌దా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వీటికి టీడీపీ స‌మాధానం చెప్పాల్సి వుంటుంది. జ‌గ‌న్ నెత్తికెత్తుకున్న మూడు రాజ‌ధానుల‌కు జ‌నం నుంచి మ‌ద్ద‌తు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… మెజార్టీ స‌మాజానికి లాభం క‌ల‌గ‌డ‌మే. జ‌గ‌న్ మాట మార్చ‌డం వ‌ల్ల కేవ‌లం 29 గ్రామాల‌కు మాత్ర‌మే న‌ష్టం క‌ల‌గడం. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్రను ఎవ‌రి చెర నుంచి కాపాడాల‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

విశాఖ‌ను రాజ‌ధానిగా వ‌ద్ద‌నే టీడీపీ నుంచా?  లేక వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర అభివృద్ధి కోసం ఆ మ‌హాన‌గ‌రంలో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని ఉండాల‌ని ప‌ట్టుప‌ట్టిన వైసీపీ నుంచా? జ‌నంలో చైత‌న్యం లేద‌ని టీడీపీ త‌క్కువ అంచ‌నా వేస్తూ… పొంత‌న‌లేని నినాదాల‌తో ముందుకెళ్లి త‌ల‌బొప్పి క‌ట్టించుకోవాల‌ని త‌పిస్తోంద‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.