విశాఖలో జనసేనాని పవన్‌కల్యాణ్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణమైన మంత్రులు విడదల రజనీ, ఆర్కే రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాహనాలపై విమానాశ్రయం దగ్గర జనసేన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వారి కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు పాల్పడ్డ వారిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖను కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇదే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా ప్రకటిస్తే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తాను అడ్డుపడనని హామీ ఇచ్చారు. పెళ్లి చేసుకోడానికి అమ్మాయి, అలాగే నటించడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి విశాఖ అవసరమైందని, రాజధాని మాత్రం ఎందుకొద్దని మంత్రి రోజా నిలదీసిన విషయాన్ని పవన్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లారు.
తనపై విమర్శలకు సమాధానంగా పవన్‌కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పొంతన లేకుండా మాట్లాడ్డం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు కూడా విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోచ్చని సూచించారు. బహుశా తనలా మూడు పెళ్లిళ్లు కాలేదనే జెలసీ వైసీపీ నేతల్లో కనిపిస్తోందని అర్థం చేసుకోవాల్సి వుంటుందని సెటైర్ విసిరారు.
బొంబాయిలో తాను నటన నేర్చుకున్నానని, అక్కడ రాజధాని పెడతారా? అని నిలదీశారు. వైవాహిత జీవితం కలిసి రాకపోవడం వల్లే మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, అలాగని ప్రతిచోట రాజధాని పెడతారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని అనవసరంగా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆరోపించారు. వారు లేకుండా జనవాణి నిర్వహించాలా? వద్దా? అనేది కాసేపట్లో సమావేశమై లీగల్ సెల్ టీమ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.