కొన్ని నెలల కిందట వచ్చిన 'భీమ్లా నాయక్' కు పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి రేటింగులు దక్కాయి. అనుకూల రివ్యూలే లభించాయి. మరి ఒక స్టార్ హీరో సినిమాకు అంత పాజిటివ్ బజ్ వచ్చాకా అది సాధించే కలెక్షన్లు అత్యంత భారీ స్థాయిలో ఉండాలి.
రివ్యూలు, రేటింగులు అంతా అనుకూలంగా ఉన్నాయంటే.. కలెక్షన్ల రికార్డులు కూడా సృష్టించాలి. అయితే అందుకు భిన్నంగా భీమ్లా నాయక్ ముక్కిమూలిగి బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు నిర్దారించాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూ సానుకూల రివ్యూలు, రేటింగులే వచ్చాయి. సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపించింది. అయితే ట్రేడ్ లో మాత్రం.. ఆ సినిమా భారీ లాభాలు పండించే అవకాశాలు తక్కువే అనే మాట వినిపిస్తూ ఉంది. సర్వత్రా సానుకూల స్పందనే వచ్చినా… కలెక్షన్ల విషయంలో మాత్రం గాడ్ ఫాదర్ ఇబ్బందినే పడుతున్నాడనే మాట వినిపించింది!
మరి .. మెగా బ్రదర్స్ సినిమాలు పాజిటివ్ స్పందననే పొందినా.. ఎందుకు కలెక్షన్ల విషయంలో అద్భుతాలు జరగడం లేదు, ఈ సినిమాలు సరికొత్త రికార్డులను సృష్టించడం మాటెలా ఉన్నా… కనీస స్థాయి వసూళ్లను అందుకోవడానికి కూడా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఈ హీరోల రేంజ్ ఇంతేనా? సానుకూల స్పందన వచ్చినా.. భారీ వసూళ్లు ఎందుకు సాధ్యం కావడం లేదంటే! ఇదంతా రీమేక్ ల ఫలితం కూడా అనుకోవచ్చు. ఎన్ని సొబగులు అద్దినా.. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాలు రీమేక్ లే. ఎంత తలపండిన రచయితలు, దర్శకులు పని చేసినా.. రీమేక్ అనే మాటను అయితే విస్మరింపజేయలేరు.
అందులోనూ అయ్యప్పన్ కోషియుం రీమేక్ కు తెలుగులో చేసిన మార్పులు అంత సానుకూలతను ఇవ్వలేదు. గాడ్ ఫాదర్ కోసం కూడా పలు మార్పులు చేశారు. ఇలా ఎన్ని చేసినా.. ఒరిజినల్స్ ప్రభావాన్ని ఈ సినిమాలు అధిగమించలేకపోయాయి. పోలికలు వద్దంటూ హీరోలు, దర్శకులు, వీరాభిమానులు ఎంత చెప్పినా.. సగటు ప్రేక్షకులు మాత్రం పోలికతోనే చూస్తారు. అందులోనూ అటు అయ్యప్పన్, ఇటు లూసీఫర్ రెండూ తెలుగు ప్రేక్షకులకు ఓటీటీల ద్వారా విపరీతంగా చేరువైన సినిమాలు. వాటి రీమేక్ లే అనవసరం.
ఇలాంటి అనవసర ప్రయత్నాలు ఎంత మెరుగ్గా చేసినా.. అంతిమ ఫలితం మాత్రం సో..సో..గానే ఉంది. మరి రీమేక్ ల విషయంలో మెగా బ్రదర్స్ కు ప్రేక్షకులు వార్నింగ్ బెల్స్ కొట్టారు. అయితే ఆ హీరోల చేతిలో మాత్రం తదుపరి కూడా రీమేక్ లే ఉండటం గమనార్హం!