విశాఖే పరిపాలనా రాజధాని, ఇందులో రెండో మాట లేవు. ఎవరికీ డౌట్లు అంతకంటే అక్కరలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిండు సభలో కుండబద్దలు కొట్టారు. విశాఖ సహా మూడు రాజధానులకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం.
దీంతో మూడు రాజధానుల కధ అటకెక్కిందని సంబరపడుతున్న వర్గాలకు ఇపుడు కాండు జెల్ల తగిలినట్లైంది. అంతే కాదు, ఈ బిల్లు శానసంగా మారే ప్రక్రియలో ఉందని, తొందరలోనే అది జరిగితీరుతుందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడం విశేషం. అంటే శాసనమండలిలో వచ్చే ఏడాది నాటికి వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ కూడా బిల్లుని నెగ్గించుకుని శాసనంగా తీసుకువస్తామని జగన్ సర్కార్ కచ్చితంగా చెప్పినట్లైంది.
అదే విధంగా కర్నూలుకు న్యాయ రాజధాని వస్తుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరో మారు జగన్ గవర్నర్ నోటి ద్వారా స్పష్టం చేసినట్లైంది. ఇక అసెంబ్లీకి ఈ రోజు వెళ్తూ అమరావతి రైతుల కోసం ఒక్కటే రాజధాని ఉండేలా చూస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబుకు గవర్నర్ ప్రసంగంలోనే జవాబు దొరికినట్లు భావించాలేమో.
అదే విధంగా ఒంటిచేత్తో మూడు రాజధానులు ఆపేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీలోని టీడీపీ మాజీ తమ్ముళ్ళకు కూడా గవర్నర్ ప్రసంగంలోని ఈ మాటలు షాక్ ఇవ్వకతప్పదేమో. మొత్తం మీద చూసుకుంటే గవర్నర్ ప్రసంగంలో అన్ని విషయాలు ఎలా ఉన్నా మూడు రాజధానుల కల తొందరలో సాకారం అవుతుందని చెప్పడం హైలెట్ గా భావించాల్సిందే.