ప‌వ‌న్‌కు ప‌బ్లిసిటీ…బాబు అసంతృప్తి!

కార‌ణాలేవైనా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎల్లో మీడియా విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ ఇస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌మ ఆరాధ్య నాయ‌కుడు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తాడ‌నే న‌మ్మ‌కం, విశ్వాసంతోనే జ‌న‌సేనానికి ఎల్లో మీడియా జాకీ వేసి లేపుతోంద‌న్న…

కార‌ణాలేవైనా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎల్లో మీడియా విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ ఇస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌మ ఆరాధ్య నాయ‌కుడు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తాడ‌నే న‌మ్మ‌కం, విశ్వాసంతోనే జ‌న‌సేనానికి ఎల్లో మీడియా జాకీ వేసి లేపుతోంద‌న్న అభిప్రాయాలు లేక‌పోలేదు.

మ‌రోవైపు బీజేపీని కాద‌ని త‌మ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ఇస్తాడ‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కు అన‌వ‌స‌ర‌మైన ప్రాధాన్యం ఇస్తూ, తామే నాయ‌కుడిగా త‌యారు చేస్తున్నామ‌న్న అనుమానం , భ‌యం చంద్ర‌బాబులో వుంది. అస‌లు ప‌వ‌న్ మ‌న‌సులో ఏముందో తెలియ‌క‌, పొత్తు విష‌య‌మై తేల‌కుండానే ప‌వ‌న్‌కు ప‌బ్లిసిటీ ఇవ్వ‌డం రాజ‌కీయంగా శ్రేయ‌స్క‌రం కాద‌ని చంద్ర‌బాబు అంటున్న‌ట్టు తెలిసింది. ఇది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయంగా లాభిస్తుంద‌ని, త‌మ‌కొచ్చే ప్ర‌యోజ‌నం ఏంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది.

విశాఖ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌నలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. ఈ సంద‌ర్భంగా కొంద‌రు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై టీడీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన శ్రేణుల అరెస్ట్‌పై బీజేపీ సీరియ‌స్‌గా స్పందించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అండ‌గా వుంటామ‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించారు. జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేయ‌డం అన్యాయ‌మ‌న్నారు.

విశాఖ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన జ‌న‌వాణికి మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌న్నారు. మ‌రోవైపు మంత్రులు విడ‌ద‌ల ర‌జ‌నీ, రోజా, జోగి రమేశ్ త‌దిత‌ర వైసీపీ ముఖ్య నేత‌ల కార్ల‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడిని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ విశాఖ ప‌ర్య‌ట‌న ముగిసిన వెంట‌నే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై వేట మొద‌లు కానుంది. వారికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంత వ‌ర‌కు అండ‌గా వుంటారో చూడాలి.