ఒకవైపు పక్క దేశాల్లోని హిందువులను, సిక్ లను రక్షిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గట్టిగా చెబుతుంటుంది. ఇందుకోసం బిల్లులను చేసి మరీ సై అంటోంది. ఈ అంశంలోని రాజకీయం సంగతలా ఉంటే, అఫ్గాన్ లోని కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్న కొంతమంది హిందువులు, సిక్ ల స్పందనను తెలుసుకుంటే, ఈ అంశంలో ఆలోచించాల్సింది చాలానే ఉందనే క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం అఫ్గాన్ లో పరిస్థితి ఎలా ఉందో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అక్కడ నుంచి ఎలాగోలా బయటపడితే చాలనే ప్రజల ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా అర్థం అవుతున్నాయి. ప్రత్యేకించి ఈ పరిస్థితుల్లో మైనారిటీలు అయితే అస్సలు బతికి బట్టకట్టే ఏ మేరకు అనేది ప్రశ్నార్థకం. స్థానిక ముస్లింలే మధ్యయుగం నాటి తాలిబన్ కట్టుబాట్లకు తట్టుకుని నిలిచే పరిస్థితి లేదు. అలాంటిది హిందూ, సిక్ అంటే వారి కథేమిటో క్లారిటీ వస్తుంది.
ఇలాంటి నేపథ్యంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక గురుద్వారాలో తలదాచుకున్న 70 నుంచి 80 మంది హిందూ, సిక్ లు ఇండియా నుంచి వస్తున్న ఆహ్వానాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదుట. వారిని అక్కడ నుంచి తరలించడానికి ఇప్పటి వరకూ భారత అధికారులు రెండు ప్రయత్నాలు చేసినా, వారి నుంచి సానుకూల స్పందన లేదట. ఈ విషయాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అనే సంస్థ ధ్రువీకరిస్తూ ఉంది. వారు ఇండియాకు వెళ్లే అవకాశం ఉన్న ఫ్లైట్ లను కావాలని మిస్ అవుతున్నారని ఆ సంస్థ చెబుతోంది!
వారి చూపు అమెరికా లేదా కెనడా వైపు ఉందని.. ఆ దేశాల వైపు వెళ్లే అవకాశం కోసం వారు అక్కడే ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఒక గురుద్వారాలో తలదాచుకుని అమెరికా లేదా కెనడా వెళ్లే విమానాల కోసం, అవకాశం కోసం ఎదురుచూపుల్లో ఉన్నారట.
ఇండియా వెళ్లే అవకాశం వచ్చినా ఎందుకు వెళ్లడం లేదు? అంటే.. అక్కడకు వెళితే ఏముంటుంది, నిరుద్యోగం, అలా వెళ్లిన వారిలో కొందరు తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవడం, లేదా మరో దేశానికి వలస వెళ్లిపోవడం అంటున్నారట ఈ అఫ్గాన్ సిక్, హిందూలు! అవకాశం కల్పించినా వీరు ఇండియా వెళ్లే విమానాలు ఎక్కకపోవడం, అమెరికా- కెనడాల వైపు చూస్తూ ఉన్నారని ఇలా తేటతెల్లం అవుతోంది.
అఫ్గాన్ లో ఎంత కల్లోల పరిస్థితులు ఉన్నా.. వీరు ఇటు వైపు కదలకపోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం! అయితే దాదాపు వంద మంది లోపు అఫ్గాన్ సిక్కులు మాత్రం ఇది వరకే ఇండియా చేరుకున్నారు.