ఎమ్బీయస్‍: పోంజీ చిరంజీవి

మర్నాడు ఆ విషయం పేపర్లో వచ్చేసరికి పోంజీ దగ్గర డిపాజిట్ చేయడానికి వచ్చినవారితో నాలుగు వీధులు నిండిపోయాయి. ముందుగా తనది తీసుకోవాలంటే, తనది తీసుకోవాలని టెల్లర్‌తో పేచీ పెట్టుకోవడంతో పోంజీ తనకు పోలీసు రక్షణ…

మర్నాడు ఆ విషయం పేపర్లో వచ్చేసరికి పోంజీ దగ్గర డిపాజిట్ చేయడానికి వచ్చినవారితో నాలుగు వీధులు నిండిపోయాయి. ముందుగా తనది తీసుకోవాలంటే, తనది తీసుకోవాలని టెల్లర్‌తో పేచీ పెట్టుకోవడంతో పోంజీ తనకు పోలీసు రక్షణ కావాలని కోరాడు. ఆరుగురు పోలీసులను పంపారు. మధ్యాహ్నాని కల్లా మరో ఆరుగుర్ని పంపారు. వచ్చిన వారిలో డబ్బు తీసుకోవడానికి వచ్చినవాళ్లూ ఉన్నారు. కొందరు 45 రోజులు పూర్తి కాకపోయినా వస్తే, పోంజీ వాళ్ల మొహాలు చూసి ‘‘పాపం మంచివాడులా వున్నాడు, ఇచ్చేయండి.’’ అనేవాడు. వాళ్లు అతనికి చేతులెత్తి దణ్ణం పెట్టేవారు. ప్రజలు దైవంగా కొలిచే యిలాటివాడికి వ్యతిరేకంగా వార్తలు రాయడానికి పేపర్లు దడిశాయి. లోతుగా విచారణ జరపడానికి ప్రభుత్వ నిఘా సంస్థలు జంకాయి. వారిని ఆదేశించాల్సిన రాజకీయ నాయకులు ఓట్లు పోతాయన్న భయంతో బెదిరారు.

పోంజీపై ఒక పబ్లిసిటీ ఫిల్మ్ తీయిస్తే మంచిదని బిల్ సూచించాడు. పోంజీ సరేనంటే ఓ ఫోటోగ్రాఫర్‌ను తీసుకుని వచ్చి తీయించాడు కూడా. అంతా అయిపోయి వెళ్లిపోతూ వుంటే పోంజీ బిల్‌తో ‘‘నేను ఇటలీలో వున్న మా అమ్మకు వెయ్యి డాలర్లు పంపాలి. ఎలా పంపితే మంచిదంటావ్? ట్రావెలర్ చెక్స్ బెటరా?’’ అని అడిగాడు. బిల్ అది ఓ జోక్ అనుకున్నాడు. రోజుకి పదిలక్షల డాలర్ల డిపాజిట్లు హేండిల్ చేస్తున్న వ్యక్తికి, ఇంటర్నేషనల్ మనీ సర్కిల్స్‌తో నిత్యం వ్యవహరించే వ్యక్తికి యింత చిన్న విషయం తెలియకుండా వుంటుందా అనుకున్నాడు. కానీ పోంజీ ‘నిజంగానే నాకు తెలియదు. నా తల నిండా అనేక వ్యవహారాలు తిరుగుతూంటాయి.’ అనడంతో ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఒక చెప్పులు కుట్టేవాడు పోంజీకి ఫ్రీగా చెప్పుల జత యిస్తాననడంతో పోంజీ సంబరపడిపోయి అతని షాపుకి వెళతానన్నాడు. అదీ బిల్‌ను ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద వ్యాపారస్తుడికి యీ అజ్ఞానమేమిటి? ఈ కక్కుర్తి ఏమిటి? అనుకున్నాడు.

మర్నాడు ట్రెమాంట్ అనే బాంక్‌కు ప్రెసిడెంటుగా వున్న తన మిత్రుడు స్విగ్‌ను కలిసి పోంజీ గురించి నీ అభిప్రాయం ఏమిటి? అని అడిగాడు. ‘‘వాడో చవట. వాడికి విదేశాల కనక్షనూ లేదు, మట్టిగడ్డలూ లేదు.’’ అన్నాడు. అలా ఎలా చెప్పగలవు అని అడిగితే ‘‘జనాలకు 45 రోజుల్లో 50% వడ్డీ యిచ్చేవాడు, తన సొంత డబ్బు మూడున్నర లక్షల డాలర్లని ఎక్కడ దాచుకుంటున్నా డనుకున్నావ్? నాలుగున్నర శాతం వడ్డీ యిచ్చే మా బాంకులో, మాలాటి యితర బాంకుల్లో! తనూ 50 కంటె ఎక్కువ శాతం వడ్డీ వచ్చే ఫారిన్ వ్యాపారంలో పెట్టవచ్చుగా’’ అన్నాడు. దాంతో బిల్‌కు అనుమానం బలపడింది. డిస్ట్రిక్ట్ ఎటార్నీ జనరల్ జోసెఫ్ వద్దకు వెళ్లి ‘‘నేను పోంజీని వెంటబెట్టుకుని మీ ఆఫీసుకి వస్తాను. మీ స్టాఫ్ అతని ఖాతాలను వెరిఫై చేస్తారని, అప్పటిదాకా అతను డిపాజిట్లు తీసుకోవడం ఆపాలనీ చెప్తారా?’’ అన్నాడు. ‘‘ఏం ఏదైనా గోల్‌మాల్ జరుగుతోందా?’’ అని అతను అడిగితే ‘ఆ విషయం చెప్పాల్సింది, మీ స్టాఫ్’ అనేసి వచ్చేశాడు.

మర్నాడు పోంజీతో ‘జోసెఫ్ నిన్ను పిలిపించి, ఏదో ప్రశ్నలడుగుదా మనుకుంటున్నాడని విన్నాను. మనమే వెళ్లి కలిస్తే మంచిది.’ అన్నాడు. పోంజీ ‘దానికేముంది, వెళదాం’ అంటూ లోపలకి వెళ్లి ఓ సూట్‌కేసు చేత బట్టుకుని బయలుదేరాడు. జోసెఫ్ ఆఫీసుకి రాగానే అది తెరిచి రెండు లక్షల డాలర్ల నోట్లు విరజిమ్మాడు. ‘‘చూశారా, నాకు డబ్బుకి లోటు లేదు. నేను యిదంతా సామాన్యుడి కోసం చేస్తున్నాను. వాళ్ల గురించి పట్టించుకునే వారెవరు?’’ అంటూ లెక్చరిచ్చేశాడు. జోసెఫ్ ముగ్ధుడై పోయాడు కానీ బిల్ చేసిన కనుసైగలు అర్థం చేసుకుని ‘‘మా వాళ్ల ఆడిటింగ్ అయ్యేదాకా మీరు కొత్త డిపాజిట్లు తీసుకోకండి. పాతవాటి చెల్లింపులు ఆపకండి.’’ అని ఆదేశించాడు. పోంజీ సరేనన్నాడు. బిల్ బయటకు వచ్చాక పోంజీతో ‘‘నీ ఆఫర్ వలన నీ కంపెనీపై ఏ సందేహం వున్నా తుడిచిపెట్టుకు పోతుంది. డిపాజిట్ల వర్షం కురుస్తుంది. నువ్వు త్వరలో మేయర్ అయిపోతావు కూడా.’’ అని ఉబ్బేశాడు.

ఎటార్నీ జనరల్ పోంజీ ఖాతాలు తనిఖీ చేస్తామని ప్రకటన చేయగానే, ఊళ్లో బాంబు పేలినంత పనైంది. తమ డిపాజిట్లు విత్‌డ్రా చేయడానికి మర్నాడు జనం గుంపులుగుంపులుగా చేరారు. కానీ పోంజీ తొణకలేదు. బాంకు లాకర్లో దాచి వుంచిన డబ్బంతా మూటలుమూటలుగా తన ఆఫీసుకి పంపి, జనం ఎదుటే వాటిని విప్పి, డబ్బు వెనక్కి యిచ్చేయసాగాడు. ఈ సందడంతా చూసి, కొందరు ‘పోంజీ మాటంటే మాటే! నేను డబ్బు వెనక్కి తీసుకోను. ఇక్కడే వుంచుతాను’ అని కేకలు పెట్టారు. వాళ్లని చూసి, తక్కినవాళ్లూ అనవసరంగా తీసేస్తున్నాం. ఇంకో చోట దీనిలో పదో వంతు వడ్డీ కూడా రాదు కదా అని సందేహంలో పడి వెనక్కి వెళ్లిపోయారు. ఆ కేకలు పెట్టినవారికి పోంజీ తలా పది డాలర్లు యిచ్చాడని బిల్ కనిపెట్టాడు. మధ్యాహ్నం ఆడిట్ ఆఫీసు నుంచి వచ్చినవాళ్లు దద్దమ్మలని, పోంజీ చూపిస్తున్న నోట్ల కట్టలు చూసి నోరు వెళ్లబెడుతున్నారని అర్థం చేసుకున్నాడు. అయితే ఆ నోట్ల నంబర్లు చూస్తూంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది.

ఆ తర్వాత నాలుగు రోజుల పాటు జనంలో మసలి, అవీయివీ కబుర్లు చెప్పి వాళ్లు తెచ్చిన నోట్ల నెంబర్లను నోట్ చేసుకున్నాడు. శనివారం సాయంత్రానికల్లా అతని రిసెర్చి పూర్తయింది. బోస్టన్ పోస్ట్ పబ్లిషర్ రిచర్డ్ దగ్గరకు వెళ్లి ‘‘పోంజీ దివాలా తీశాడని నిరూపిస్తూ ఆర్టికల్ రాస్తే సోమవారం నాటి పేపర్లో వేస్తారా?’’ అని అడిగాడు. కొత్త డిపాజిటర్ల డబ్బునే పాతవాళ్లకు యిస్తున్నాడనీ, ఇప్పటికిప్పుడు వడ్డీ లేకుండా ఒట్టి అసలు మాత్రమే చెల్లించాలంటే పోంజీ దగ్గర 20 లక్షల డాలర్లు వుండాలని, అది అసంభవమని వాదించాడు. కాస్సేపటికి పబ్లిషర్ కన్విన్స్ అయ్యాడు. ‘ఈ కథనానికి 5 వేల డాలర్లిస్తాను, రేపు మధ్యాహ్నానికల్లా తయారు చేసి పట్టుకుని వస్తే మా కంపెనీ లాయర్లు పరీక్షించి ఓకే అంటే, సోమవారం వేస్తాను.’’ అన్నాడు. ఫైనల్ కథనం చూశాక పబ్లిషర్ వెయ్యి డాలర్లు అదనంగా యిచ్చాడు. ఆగస్టు 2 సంచికలో అది ప్రచురించబడింది.

పోంజీ అది చూస్తూనే పొద్దున్నే తను ప్రెసిడెంటుగా వున్న హానోవర్ బాంకుకి వెళ్లి, సేఫ్ తెరిచి దానిలో వున్న 20 లక్షల డాలర్లు తీసేసుకున్నాడు. దానిలో ఐఓయు (నేను మీకు బాకీ వున్నాను, త్వరలో తీర్చేస్తాను) అని ఓ కాగితంపై రాసి సంతకం పెట్టి సేఫ్‌లో పెట్టాడు. ఆ డబ్బుతో కారులో న్యూయార్క్ చేరి, ఛార్లెస్ బియాంచీ పేరుతో హోటల్లో దిగి, అక్కణ్నుంచే వివిధ నగరాల్లో జూదం ఆడడానికి కూర్చున్నాడు. జూదంతో ఆ డబ్బును ఐదు రెట్లు చేసి, ఆ 20 లక్షలూ బాంక్ మొహాన్న పడేసి, తక్కిన 50తో డిపాజిట్లు చెల్లించేసి, మిగిలినదానితో జీవితాంతం హాయిగా బతుకుదామనుకున్నాడు. హోటల్ నుంచి దూరదూర ప్రాంతాల బుకీలకు ఫోన్ చేసి దేశమంతా బెట్టింగులు వేశాడు. మూడు రోజులయ్యేసరికి ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. తిరిగి వచ్చాడు. 40 లక్షల డాలర్ల విలువైన డిపాజిట్లు మెచ్యూర్ కావడానికి యింకా నెల్లాళ్ల టైముంది. ఈ లోపున మెచ్యూరైన డిపాజిట్లన్నిటికి వడ్డీ లేకుండా అసలు తిరిగి యిచ్చేయమన్నాడు పోంజీ. దాంతో జనం చల్లారారు.

ఇక్కడి పరిస్థితి యిలా వుండగా అక్కడ మాంట్రియల్‌లో హెర్బర్ట్‌, పోంజీ ఫోటో పట్టుకుని వాడవాడలా తిరుగుతున్నాడు. ధనికుల నుంచి అలగా జనం దాకా ఎవర్నీ వదలటం లేదు. ఓ రోజు ఓ షిప్ ఏజంటు ‘‘ఇతన్ని చూసినట్లుంది కానీ మూతి దగ్గర తేడాగా వుంది.’’ అన్నాడు. మర్నాడు ఆ ఫోటోకి మీసం దిద్దించి హెర్బర్ట్ చూపించాడు. అది చూస్తూనే అతను ‘‘ఓ, యితను ఛార్లెంస్ బియాంచీ కదా! ఎప్పుడో 13 ఏళ్ల క్రితం కదా, గుర్తుపట్టడం కష్టమైంది.’’ అంటూ అతనూ, జరోసీ కలిసి చేసిన మోసం, జైలుకి వెళ్లిన వైనం అన్నీ చెప్పేశాడు. పోలీసు రికార్డులు చూస్తే నిజమేనని తేలింది. ఈ విషయం ఎడ్వర్డ్‌కి చెప్పగానే జైల్లోంచి బయటకు వచ్చాక అమెరికా వచ్చి వుంటాడని గెస్ చేసి, అమెరికా రికార్డులు వెతికిస్తే అట్లాంటా జైల్లో వున్న సంగతి బయటపడింది. ఇవన్నీ పేపర్లో వచ్చేసరికి పోంజీ జీవితం మారిపోయింది. ప్రభుత్వశాఖలన్నీ చురుగ్గా కదిలాయి. పోంజీ భవనాన్ని, కారునీ, డిపాజిట్లను అన్నిటినీ ఎటాచ్ చేశారు. హానోవర్ బాంక్ అతన్ని బోర్డులోంచి తీసేసింది. ఆడిటర్లు 9 రోజుల పాటు కూర్చుని అతని ఆస్తిపాస్తుల చిఠ్ఠా తయారుచేశారు.

పోంజీ దగ్గరకు కోటిన్నర డాలర్ల డబ్బు వచ్చింది. అంతా వెనక్కి యిచ్చేయగా, ఇంకా 50 లక్షల డాలర్లు బకాయి పడ్డాడు. అతని ఆస్తులన్నీ తనఖాలో వున్నాయి కాబట్టి సెక్యూరిటీగా పనికి రావు. పోంజీ జైలు కెళ్లాల్సి వచ్చింది. 1934 ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు. అతని భార్య అతన్ని కలవడానికి వచ్చింది. అతను బకాయి పడిన డిపాజిటర్లు తన్నడానికి వచ్చారు. పోలీసులు వచ్చి రక్షించారు. ఇంతలో ప్రభుత్వానికి గుర్తుకు వచ్చింది, యితను ఇటాలియన్ దేశస్తుడే తప్ప అమెరికన్ పౌరసత్వం తీసుకోలేదు కదాని. దేశం నుంచి బహిష్కరించారు. ఓడ బయలుదేరబోయే ముందు తనతో మాట్లాడడానికి వచ్చి మీడియాతో అతను ‘‘నేను ఇటలీలో మళ్లీ నా జీవితాన్ని ప్రారంభించబోతున్నాను.’’ అన్నాడు. ‘’51 ఏళ్ల వయసులో ఏ పెట్టుబడీ లేకుండా ఏం చేయగలరు?’’ అన్నాడు ఓ విలేకరి. ‘‘చూస్తూండండి.’’ అన్నాడితను.

రోమ్‌లో దిగగానే చాలా చవకగా యిళ్లు అద్దెకు దొరికే ప్రాంతంలో ఫ్లాట్ తీసుకుని రెండు పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. ఒకటి ‘‘ద రైజ్ ఆఫ్ ఛార్లెస్ పోంజీ’’, రెండోది ‘‘బోస్టన్ మెర్రీగోరౌండ్’’. రెండో దానిలో బోస్టన్‌లో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న వారి గుట్టుమట్లు రాయసాగాడు. అతను ధనికుడిగా హై సర్కిల్స్‌లో తిరిగినపుడు పోగేసిన సమాచారాన్ని దానిలో రాస్తూ, ఆ యా వ్యక్తులకు ‘ఇదిగో యిలా రాయబోతున్నాను’ అంటూ ఆ చాప్టర్లు ముందే పంపేవాడు. వాళ్లు నా పేరు తీసేయ్ అంటూ డబ్బు పంపేవారు. అలా రెండు నెలల్లో 5 వేల డాలర్లు సంపాదించాడు. అయితే అతని భార్య రోజ్, భర్త ఐదేళ్లకు మించి జైల్లో వున్నాడన్న కారణం చూపించి, విడాకులు కోరింది. పోంజీ యిచ్చేశాడు కానీ అది అతని అహాన్ని దెబ్బ తీసింది. తాగుబోతై పోయాడు. రాయడం మానేశాడు, బ్లాక్‌మెయిల్ మానేశాడు. రోజంతా తాగడమే! ఈ పరిస్థితుల్లో అప్పటి ఇటలీ నియంత ముస్సోలినీ మనిషి వచ్చి పిలుచుకుని వెళ్లాడు.

పోంజీ ఇటలీకి తిరిగి వచ్చేటప్పటికే ముస్సోలినీ వెలిగిపోతున్నాడు. పోంజీ అతని అభిమానిగా మారాడు, ఉత్తరాలు రాశాడు. ముస్సోలినీ ఇథియోపియా జయించినప్పుడు అక్కడి విదేశీ మీడియా కన్సల్టెంట్‌గా వెళతానని ఆఫర్ చేశాడు. ముస్సోలినీ అతన్ని రప్పించి, అరగంట సేపు మాట్లాడాడు. ఇథియోపియా నియామకం గురించి కాదు, అమెరికన్లను ఎలా బోల్తా కొట్టించావో అది చెప్పు చాలు అన్నాడు. ఇప్పుడు లాటిన్ ఎయిర్‌లైన్స్ అని ప్రభుత్వరంగంలో విమానయాన సంస్థ పెట్టాడు. దాని బ్రెజిల్ బ్రాంచ్‌లో బిజినెస్ మేనేజర్‌గా ఉద్యోగం ఆఫర్ చేశాడు.

పోంజీ దశ తిరిగింది. 60 ఏళ్ల వయసులో బ్రెజిల్‌లో పెద్ద ఎపార్ట్‌మెంట్‌లో యిద్దరు ఉంపుడుగత్తెలతో, న్యూయార్క్ నుంచి తెప్పించిన సూట్లతో దర్జాగా బతికాడు. ఇంతలో రెండవ ప్రపంచయుద్ధంలో ముస్సోలినీ ఓడిపోయి పతనమయ్యాడు. పోంజీ ఉద్యోగం పోయింది. మళ్లీ తాగడం మొదలెట్టాడు. తీవ్రంగా గుండెపోటు, ఆపై పక్షవాతం వచ్చి ఒకవైపంతా చచ్చుబడిపోయింది. ఒక కన్ను కనిపించకుండా పోయింది. అనాథ శరణాలయానికి తరలించారు. అక్కడ 1949లో 67వ ఏట బికారిగా మరణించాడు.

ఎప్పుడో వందేళ్ల క్రితం నాటి పోంజీ గురించి యిప్పుడెందుకు చెప్పుకోవడం అంటారా? పోంజీ చిరంజీవి. ఏటేటా కొత్త పోంజీలు పుట్టుకుని వస్తూనే వున్నారు. ప్రజలు వాళ్ల మాయలో పడుతూనే వున్నారు. నెలకు మూడు రూపాయల వడ్డీ యిస్తాం, మీ డబ్బు మా దగ్గర పెట్టండి అని వాళ్లు ప్రకటిస్తే మనకు అనుమానం రావాలి, నాకు మూడు రూపాయలివ్వాలంటే వాడికి నాలుగు రూపాయల ఆదాయం రావాలి కదా, ఏ బిజినెస్ చేస్తే వాడికి ఆ రేటు కిట్టుబాటవుతుంది? అని. అదేమీ ఆలోచించరు. ‘అదంతా మనకు అనవసరం. వాడు యిస్తానంటున్నాడు. అది చాలు.’ అంటూ కష్టపడి పోగేసుకున్నది వాళ్ల చేతిలో పోస్తారు. బంధుమిత్రులను పోగేసుకుని వచ్చి వాళ్లనీ చేర్పిస్తారు. కొత్తవాళ్లను దోచి పాతవాళ్లకు యివ్వడమే దీనిలో సూత్రం. కొత్తవాళ్లు ఆగిపోతే పాతవాళ్ల నెత్తికి చేతులే.

ఈ వ్యాపారం సాగుతున్నపుడు ప్రభుత్వ సంస్థలు గుడ్లప్పగించి చూస్తూ వుంటాయి. 15% వడ్డీ యివ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకుంది అని ఓ ప్రయివేటు బ్యాంకు హోర్డింగులు పెట్టినపుడు ఆర్‌బిఐ వెంటనే అదేమీ లేదంటూ అని చర్య తీసుకోదు. మార్గదర్శి వంటి నాన్ బాంకింగ్ ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు సేకరిస్తూ వుంటే అది తప్పని ప్రకటించదు. ఉండవల్లి లాటి వాళ్లు ఆ అంశం లేవనెత్తితే ఎంత అల్లరైందో చూశాం. ఆఫ్టరాల్ ఎంపీ మమ్మల్ని అంటాడా అని వాళ్లు విరుచుకుపడ్డారు. డిపాజిట్లు వెనక్కి యివ్వాల్సి వస్తే మీ కంపెనీ మూతపడుతుంది జాగ్రత్త అని ఉండవల్లి అంటే ఎంత కండకావరం, అలా సేకరించవచ్చని మాకు రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి (ఆయన పేరు ఎప్పటికీ బయటకు రాలేదు) చెవిలో చెప్పాడు అని మండిపడ్డారు. 

ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా, మధ్యతరగతి వాళ్లకు మేలు చేస్తే కన్ను కుట్టిందా అని డిపాజిటర్లు ఉండవల్లిని తిట్టారు. ఎవరెవరు డిపాజిట్ చేశారో వివరాలు చెప్పండి అని ప్రభుత్వం అడిగితే కంపెనీవారు పొడి అక్షరాల పేర్లు చూపించారు. పోంజీ కథ విన్నాక యిదంతా ఫెమిలియర్‌గా అనిపించటం లేదూ! ఎటొచ్చీ పోంజీ ఖర్చు పెట్టేశాడు. మార్గదర్శి వేరే చోట యిన్వెస్ట్ చేసింది. అయినా అలవికాని స్థాయిలో డిపాజిట్లు సేకరించడం చేత తిరిగి యివ్వడానికి ఈనాడు షేర్లు అమ్ముకోవలసి వచ్చింది.

మార్గదర్శి కథ కూడా పాతదే. కొత్తగా పోంజీ ఎందుకు గుర్తుకు వచ్చాడంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో 82వ ఏట మరణించిన బెర్నార్డ్ మాడాఫ్ కారణంగా! ఈ న్యూయార్క్ ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్వయిజర్ బ్రహ్మాండమైన లాభాలిస్తానంటూ 19 బిలియన్ డాలర్ల స్కాము చేశాడు. పోంజీ స్కీముల్లో యిదే యిప్పటిదాకా అతి పెద్దది. అతనికి 150 ఏళ్ల జైలుశిక్ష పడింది. పోంజీ కాలంలో నియంత్రించే వ్యవస్థలు అంత బలంగా వుండేవి కావు. ఇతను యీ ఆధునిక యుగంలో కూడా మోసం చేయగలిగాడు, అదీ 15 ఏళ్లపాటు! పోంజీలాగ యితను చిన్న వ్యక్తి కాదు. 1990, 1991, 1993లో అతను నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌కు చైర్మన్! మీకు 65 బిలియన్ డాలర్లు వస్తాయని నమ్మబలికి యీ 19 బిలియన్ డాలర్ల ఇన్వెస్టర్లను దగా చేశాడు. చివరకు ఆస్తులు తెగనమ్మి 14.4 బిలియన్ డాలర్లు వసూలు చేసి వెనక్కి యిచ్చారు. మోసపోయిన వాళ్లలో స్పీల్‌బర్గ్ ఫౌండేషన్‌తో సహా చాలా పెద్ద తలకాయలున్నాయి. 2009 మార్చిలో అతనే తను అనేక నేరాలు చేశానని ఒప్పేసుకున్నాడు. ఎకానమీ తిరోగమనంలో వుంది, అది పుంజుకుంటుందనే ఆశతో గాలిమేడలు కట్టాను అని చెప్పుకున్నాడు.

మాడాఫ్ మరణవార్త తర్వాత కూడా వ్యాసం రాద్దామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఇంతలో తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆంధ్ర ప్రభుత్వం రూ.667 కోట్ల ప్రజాధనం వెచ్చిస్తోందన్న వార్త వచ్చింది. వెంటనే రాస్తున్నాను. ఈ అగ్రిగోల్డ్ కూడా పోంజీ పిరమిడ్ స్కీము లాటిదే కదా! వాళ్లకు యింత ఆస్తులున్నాయి, అన్ని భూములున్నాయి అంటూ ఏజంట్లు ఉబ్బేసి డిపాజిట్లు సేకరించారు. తామూ పెట్టుబడి పెట్టారు. అలవి మీరి కంపెనీ నిధులు సేకరించింది, ఫైనల్‌గా మూతపడింది. ఆ స్థలాల విలువ పడిపోయింది. ఇప్పుడవి అమ్మితే డిపాజిట్లు తిరిగి యివ్వడానికి సరిపోతుందా? నాకు డౌటే! ఇలాటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ భారం నెత్తిన వేసుకుని నిజాయితీగా పన్నులు కట్టినవాళ్ల డబ్బును కంపెనీ తరఫున చెల్లిస్తోంది. 

ఇది సమంజసమా? ఆ కంపెనీల్లో డిపాజిట్ చేయండని ప్రభుత్వమేమైనా చెప్పిందా? నిజానికి ప్రభుత్వానికి కమిట్‌మెంట్ అంటూ ఏమైనా వుందా అంటే అమరావతికై భూములిచ్చిన రైతుల పట్ల వుంది. ఇక్కడేదో కడతామని వాగ్దానం చేసినది వాళ్లకు. వాళ్ల విషయంలో దగా చేసి, దురాశతో ఒక ప్రయివేటు కంపెనీలో డిపాజిట్ చేసినవాళ్లకు పన్ను చెల్లింపుదారుడి డబ్బును వెచ్చించడంలో న్యాయం వుందా? అంతకంటె అగ్రిగోల్డ్ దారిలో ఉన్న మరో మేరీగోల్డ్, రోల్డ్‌గోల్డ్ కంపెనీల గురించి ఇన్వెస్టర్లను హెచ్చరించడం మంచిది కాదూ! (ఫోటోలు – పోంజీ, భార్య రోజ్‌తో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

[email protected]