జగన్ ప్రభుత్వంపై దాదాపు రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ పదే పదే చేస్తున్న ఆరోపణల్లో ఒకటి దళితులపై దాడులు! జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా దళితులపై దాడులు తీవ్రంగా పెరిగాయని టీడీపీ అనునిత్యం ఆరోపిస్తూ ఉంది. అందుకు ఉదాహరణగా.. ముఖ్యంగా పేర్కొనేది నర్సీపట్నం మత్తు డాక్టర్ ఉదంతం. అక్కడ నుంచినే టీడీపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. రెండేళ్లుగా దాన్ని వదలడం లేదు.
ఇటీవల రమ్య హత్యోదంతంలో కూడా కులం కోణాన్నే టీడీపీ హైలెట్ చేయడానికి శతథా ప్రయత్నించింది. ప్రేమోన్మాదం నేపథ్యంలో జరిగిన ఆ దురష్టకరమైన సంఘటనను టీడీపీ దళితులపై కొనసాగుతున్న దాడులుగా అభివర్ణించింది. బాధితురాలు దళితురాలు అయిన నేపథ్యంలో టీడీపీ ఆ ఘటనను దళితులపై దాడులుగా నిర్వచనం ఇచ్చింది. అయితే ఈ ఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించడం కూడా టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.
నిందితుడిని పోలీసులు వేగంగా అరెస్టు చేశారు. ఏ కేసులో అయినా ఇదే సత్వర న్యాయం. అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ ముఖ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించారు. పరిహారాన్ని ప్రకటించారు. నిందితుడిని ఏ ఎన్ కౌంటరో చేసేయలేదు కానీ, న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఇక ఇదే అంశాన్ని ఏపీలో కొనసాగుతున్న దళితులపై దాడులు అంటూ.. టీడీపీ ప్రతినిధులు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసి ఫిర్యాదు చేశారు.
ఏపీకి వచ్చిన ఎస్సీ కమిషన్ ప్రతినిధులను టీడీపీ దళిత నేతలు వర్లరామయ్య తదితరులు కలిశారు. ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ వారు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఎస్సీ కమిషన్ సభ్యులు ఈ తరహాలో స్పందించలేదు. రమ్య హత్యఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించడాన్ని కమిషన్ సభ్యులు అభినందించారు.
కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. జగన్ ప్రభుత్వంపై వారికి ఏమీ రాగాపేక్షలు ఉండవు. టీడీపీ వాదన నిజమే అయితే, కమిషన్ ఆ విషయంలో కూడా స్పందించడానికి అవకాశం ఉంది. ఇక రమ్య కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. నిందితుడికి శిక్ష వేయించాలని కోరింది. బాధితులది దురదృష్టం. అయితే టీడీపీ మాత్రం ఈ అంశాన్ని రాజకీయంగా బాగా వాడుకోవాలని చూసింది.
రెండేళ్లుగా తాము వినిపిస్తున్న ఒక అసంబద్ధమైన వాదనకు ఈ కేసును ఒక రుజువుగా మార్చుకోవాలని చూసింది. అయితే ఎస్సీ కమిషన్ సభ్యులు టీడీపీ వాదనకు వత్తాసు పలకలేదు. మరి ఇప్పుడైన ప్రతిపక్షంగా తాము నడుస్తున్న రాంగ్ రూట్ ఏమిటో అర్థమవుతోందా?