లాక్ డౌన్, తదనంతర పరిణామాలతో ప్రధాని మోడీ తల బాగానే బొప్పి కట్టింది. విచిత్రం ఏంటంటే.. లాక్ డౌన్ తర్వాత కంటే అన్ లాక్ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. లాక్ డౌన్ లో వారానికోసారి జనం ముందుకొచ్చిన ప్రధాని, కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ఈ దశలో మాత్రం మొహం చాటేశారు. తప్పంతా కేంద్రంపైనే పెట్టుకోవడానికి మోడీ సర్కారు ఇష్టపడటంలేదు. అందుకే రాష్ట్రాల భుజంపై తుపాకీ ఎక్కుపెట్టి గురి చూస్తోంది.
ఇప్పటికే తమిళనాడుకి సంకేతాలు అందాయి. దీంతో పళనిస్వామి సర్కారు చెన్నైతో సహా మరో మూడు జిల్లాల్లో ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే లాక్ డౌన్ మొదలయ్యేది ఈనెల 19తో కాబట్టి.. ఈ 3రోజులు అత్యవసర ప్రయాణాలు చేయడం, నిత్యావసరాలు సమకూర్చుకోవడం, మెడికల్ నీడ్స్ తెచ్చుకోవడం.. అన్నీ ముగించేయాలని ప్రజలను హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా అన్ లాక్ ఆదేశాలు వెలువడ్డాక.. ఒక రాష్ట్రం సొంతంగా లాక్ డౌన్ విధించడం ఇదే తొలిసారి. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు పయనించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలో మోడీ ఆ దిశగా సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారన్నమాట.
కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సెల్ఫ్ లాక్ డౌన్ పాటించాలని చెప్పబోతున్నారట. అంటే ఈసారి ఆంక్షలు విధించడం, ఎత్తేయడం అన్నీ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటాయి. ఒకరకంగా.. మా జోలికి రావద్దు, మా నుంచి సహాయం ఆశించొద్దు.. అనే విధంగా మోడీ సర్కారు రాష్ట్రాలకు స్పష్టం చేయబోతోంది.
వలస కూలీల వెతలపై ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాలపై నింద పడలేదు, కారణం కేవలం మోడీ అనే పరిస్థితి కనిపించింది. ఇలాంటి అపవాదులన్నీ మనకెందుకు అనుకుంటున్న మోడీ.. రాష్ట్రాలపైనే నెపం పెట్టేయబోతున్నారు. దేశవ్యాప్తంగా రెండో దఫా లాక్ డౌన్ పై పుకార్లు షికార్లు చేస్తున్న వేళ.. రాష్ట్రాలపైనే కరోనా నియంత్రణ బాధ్యత పెట్టేశారు ప్రధాని. తమిళనాడు బాటలో ఇంకెన్ని రాష్ట్రాలు నడుస్తాయో చూడాలి.