మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి గాయం ఎలా ఉందో తెలియదు కానీ…ఆంధ్రజ్యోతిలో ఆయన అనారోగ్యానికి సంబంధించిన వార్తలు చదువుతుంటే మాత్రం ఆర్‌కే తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది.
ఈఎస్ఐలో చోటు చేసుకున్న భారీ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌కు ముందు రోజే అచ్చెన్నా యుడు పైల్స్‌కు ఆపరేషన్ చేయించుకున్న విషయం ఏసీబీ అధికారులకు తెలియదు.
ప్రస్తుతం రిమాండ్‌లో భాగంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడిపై సానుభూతితో పాటు జగన్ సర్కార్‌పై ప్రజల్లో ఆగ్రహం కలిగించాలనే ఆలోచనలు కావచ్చు…గోరింతను కొండంతలు చేసి చూపించేందుకు ఆంధ్రజ్యోతి నానా తంటాలు పడుతోంది.
అచ్చెన్న అరెస్ట్ బీసీలపై దాడిగా చిత్రీకరించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. స్వయాన బీసీ సంఘాలే అచ్చెన్న అరెస్ట్‌ను కులానికి ముడిపెట్టొద్దంటూ ప్రకటనలు ఇవ్వడంతో మరో సాకును వెతుక్కునే పనిలో టీడీపీ, ఎల్లో మీడియా పడ్డాయి.
ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడి అనారోగ్యాన్ని అస్త్రంగా చేసుకుని జగన్ సర్కార్‌పై ఎక్కు పెట్టేందుకు ఏదో క్రియేట్ చేయాలని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చేస్తున్న ప్రయత్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారు.
ఒకప్పుడు రష్యా, చైనాలలో వర్షం పడుతుంటే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పట్టేవారని ప్రత్యర్థులు సెటైర్లు వేసేవారు. మంత్రి అచ్చెన్నాయుడి విషయంలో ఆంధ్రజ్యోతి యజమాని ఆర్‌కే బాధ కూడా అట్లే ఉంది. ఆయనకు నొప్పి ఉందో లేదో తెలియదు కానీ…ఆర్‌కే మాత్రం అలమటిస్తున్నట్టుంది.
రెండు రోజులుగా ఆంధ్రజ్యోతిలో వస్తున్ వార్తలను గమనిద్దాం. సోమవారం దినపత్రిక మొదటి పేజీలో “ఆగని రక్తస్రావం” శీర్షికతో ఓ ఇండికేషన్ ఇచ్చి…లోపలి పేజీలో వార్త క్యారీ చేశారు. లోపలి పేజీలో సింగిల్ కాలం వార్త ఎంత బలహీనంగా ఉందో…చదివితే అర్థమవుతుంది.
“గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఆయన రిమాండ్‌లో ఉన్నందున సమాచారాన్ని బయటికి ఇవ్వలేమని వైద్య వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. కొద్దిగా రక్తస్రావం జరుగుతున్నప్పటికీ వార్డు మార్చి ప్రత్యేక వైద్యులతో చికిత్స అందిస్తున్నారు”… కొద్దిగా రక్తస్రావానికి కూడా ఆగని రక్తస్రావం అంటూ ఆంధ్రజ్యోతి ఓవర్ యాక్షన్ చేయడం ఆ పత్రికకే చెల్లింది.
పోనీ ఆ మరుసటి రోజైనా అచ్చెన్న విషయంలో రూట్ మార్చిందా అంటే…అబ్బే లేనేలేదు. అచ్చెన్న గాయం మానినా ఆంధ్రజ్యోతి మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదంటోంది. మంగళవారం అంటే ఈ రోజు మొదటి పేజీలో ఏం రాశారో తెలుసుకోవాల్సిందే.
“తిరగబెట్టిన అచ్చెన్న గాయం” అనే శీర్షికతో వార్త. దాని ఉప శీర్షికలుగా “ఇన్ఫెక్షన్…ఎంతకీ ఆగని రక్తస్రావం” అంటూ ముందు రోజు వార్తకి కొనసాగింపుగా ఇచ్చినట్టుగానే ఉంది. ఇక లోపలి పేజీలో కథనం క్యారీ చేశారు. దాని కథేంటో కూడా చూద్దాం.
“రిమాండ్‌లో భాగంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆపరేషన్ గాయం తిరగబెట్టినట్టు సమాచారం. ఇన్ఫెక్షన్ కావడంతో రక్తస్రావం ఆగడం లేదని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, పైల్స్ ఆపరేషన్ వలన కలిగిన పుండు నుంచి కారుతున్న రక్తం అదుపులోకి రావడం లేదు. ఆయనకు బీపీ, షుగర్ ఉండటం, దానికి ఇప్పుడు ఒత్తిడి కూడా తోడవడం సమస్యను మరింత పెంచింది. ఇలానే ఉంటే పుండు తగ్గడానికి మరో రెండు వారాల పైగానే పట్టవచ్చని సమాచారం”…అని ఆంధ్రజ్యోతి కరుణ రసం పొంగి పొర్లింది. అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగితే ఆర్‌కే నొప్పితో విలలాడుతూ కన్నీటిపర్యంతమైన భావన ఈ కథనాన్ని చదివిన పాఠకులకు కలుగుతుంది.
అచ్చెన్నాయుడి అనారోగ్యం గురించి టీడీపీ భగవద్గీత పత్రిక ఈనాడులో ఈ రోజు ఏం రాసిందో తెలుసుకుంటే మంచిది. పదండి ఆ కథనం దగ్గరికి పోదాం.
“గుంటూరు సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు సోమవారం వైద్యులు పరీక్షలు చేయించారు. ఆయనకు ఆదివారం తలనొప్పి రావడంతో సోమవారం న్యూరాలజీ వైద్యులు పరీక్షించారు. గతంలో తాను సైనసైటీస్, మైగ్రేన్‌తో బాధపడే వాడినని చెప్పగా సీటీ స్కాన్ తీశారు. అచ్చెన్నాయుడి గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పడుతుందని సూపరింటెండెంట్ సుధాకర్ విలేకరులకు తెలిపారు. నొప్పి తగ్గలేదని చెప్పడంతో యాంటీ బయాటిక్స్ వాడించాలని వైద్యులు యోచిస్తున్నారు”….అని వాస్తవ పరిస్థితి ఏంటో కళ్లకు కట్టినట్టు రాసుకొచ్చారు.
రెండు మూడు రోజుల్లో అచ్చెన్న గాయం తగ్గిపోతుందని మీడియాకు సూపరింటెండెంట్ సుధాకర్ చెబుతుంటే…ఆర్‌కే మాత్రం , అబ్బే అదంతా పచ్చి అబద్ధం, ఇంకా మరో రెండు వారాల పైగానే పట్టవచ్చని గగ్గోలు పెడుతున్నాడు. అచ్చెన్నకు రక్తస్రావం సంగతేమో కానీ, ఏ ఆపరేషన్ చేయించుకోకుండానే ఆర్‌కేకు రక్తస్రావం అవుతున్నట్టుంది. ఆ నొప్పి భరించలేక అమ్మా, అబ్బాకు బదులు బాబు, లోకేశ్, అచ్చెన్నా అంటూ మూలుగుతున్నాడని విశ్వసనీయ సమాచారం. ఆ అరుపులు, ఆర్తనాధాలు ఆయన పత్రికలో ప్రతిబింబిస్తున్నాయి
సొదుం