తెలుగు ఇండస్ట్రీని ఒకటీ రెండు కులాలు, కొన్ని కుటుంబాలు శాసిస్తూ ఉంటే.. బాలీవుడ్ ను బంధుప్రీతి, ఎలైట్ క్లబ్ లోని కుటుంబాల పిల్లలు శాసిస్తున్నారనే వాదన ఇప్పటిది ఏమీ కాదు. బాలీవుడ్ లో బంధుప్రీతి పతాక స్థాయికి చేరిందని, ఖాన్ లు -కపూర్ లు- కరణ్ జొహార్ ఇలాంటి వాళ్లే బాలీవుడ్ లో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో డిసైడ్ చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి.
ప్రత్యేకించి కరణ్ జొహార్ లాంటి వాళ్లు కేవలం సినిమా వాళ్ల వారసులకు, కపూర్ ఇంటి పేరుతో వచ్చే వారికే ఛాన్స్ లు ఇస్తారనే అభిప్రాయాలు ప్రేక్షకుల్లో కూడా బలంగా ఏర్పడ్డాయి. ఇక ఖాన్ లకూ తిరుగులేదక్కడ. కపూర్, ఖాన్ వంటి ఇంటిపేర్లు బాలీవుడ్ లో చలామణికి సులభతరమైన మార్గాలు. ఈ విషయంలో బాలీవుడ్ వాళ్లే కొన్ని సినిమాల్లో సెటైర్లు వేశారు. కపూర్ ఇంటి పేరే బాలీవుడ్ లో స్టార్ ను చేసేస్తుందంటూ వ్యంగ్య డైలాగులు కొన్ని సినిమాల్లో ఉన్నాయి.
ఇక అవార్డుల ఫంక్షన్లు, అవార్డులు..ఇవన్నీ కూడా కొందరికి సంబంధించినవే అని ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్లను అక్కడ వివక్షతో చూస్తారని.. వారిని బుల్లీయింగ్ చేస్తారని కూడా ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అలా వివక్షకు గురి అయిన నటుడే అని కొందరు బాలీవుడ్ సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సుశాంత్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. కరణ్ జొహార్, అలియా భట్ వంటి వారు పెట్టిన ట్వీట్లపై కొందరు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వీళ్లు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, సుశాంత్ బతికి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు పట్టించుకోలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ తో సహా పలు బ్యానర్లు సుశాంత్ కు అవకాశాలు ఎప్పుడూ ఇవ్వలేదని, అప్రకటిత నిషేధాన్ని అమలు చేశాయని ఫ్యాన్స్ అంటున్నారు. బతికునప్పుడు జాలి చూపని ఇలాంటి వాళ్లు ఇప్పుడు సానుభూతి వచనాలతో డ్రామాలు ఆడుతున్నారంటూ సుశాంత్ అభిమానులు బాలీవుడ్ స్టార్లను సోషల్ మీడియాలో ఏకేస్తూ ఉన్నారు.