రంగులు మార్చడం చంద్రబాబుకు కొత్తకాదు. ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్క అంశాన్ని తీసుకుంటే బాబు ఎన్ని రంగులు మార్చారో చిన్న పిల్లాడికి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఒక్క అంశంలోనే కాదు.. కీలకమైన ఎన్నో అంశాల్లో అప్పటికప్పుడు రంగులు మార్చేయడం బాబుకు బట్టర్ తో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ రంగుల గురించి కాదు. బాబు ఈసారి నిజంగానే రంగు మార్చబోతున్నారు.
నిత్యం పసుపు రంగు చొక్కాలో కనిపించే చంద్రబాబు ఈసారి నల్ల రంగులోకి మారబోతున్నారు. రేపట్నుంచి ప్రారంభంకాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు నలుపు రంగు చొక్కాలో హాజరవ్వాలని నిర్ణయించారు బాబు. అంతా ఇలానే రావాలని తన ఎమ్మెల్యేలకు కూడా సూచించారు. తమ పార్టీ నేతల్ని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇలా రావాలని టీడీపీ నిర్ణయించింది. బాబు ఇలా నల్లరంగు పులుముకోవడం ఇది రెండోసారి.
గత ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు బీజేపీకి విడాకులిచ్చారు బాబు. ఆ వెంటనే “నల్ల” రాజకీయాలకు తెరదీశారు. ధర్మపోరాట దీక్షలంటూ నల్లచొక్కాలతో హడావుడి చేసే ప్రయత్నం చేశారు. అదే చొక్కాతో అసెంబ్లీలో కూడా కనిపించి “రక్తం పొంగిపోతావుంది” అంటూ ఫన్నీ డైలాగులు చెప్పారు. అయితే అప్పట్లో బాబు ఎంత హడావుడి చేసినా, నాటకాన్ని రక్తికట్టించాలని చూసినా ప్రజలు అవేవీ నమ్మలేదు. అప్పటికే బాబు నటవిశ్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. అరచేతిలో అమరావతి చూపించి ఐదేళ్లు పబ్బం గడుపుకున్న బాబు “రాజకీయచాతుర్యాన్ని” ప్రజలు గుర్తించారు. అందుకే అతి తక్కువ సీట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.
ఇంత జరిగినా బాబుకు బుద్ధిరాలేదు. ప్రతిపక్షంలో ఉంటూ మరోసారి నల్లచొక్కాల రాజకీయాలకు తెరతీయాలని చూస్తున్నారు. తమ పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని, కిడ్నాప్ చేశారని అసెంబ్లీ వేదికగా రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎప్పట్లానే ఈసారి కూడా చంద్రబాబు నల్లచొక్కా రాజకీయాల్ని ప్రజలు లైట్ తీసుకోవడం గ్యారెంటీ.