చంద్రబాబు ఎప్పుడు అధికారులతో సమావేశం పెట్టినా గణాంకాలు దగ్గర పెట్టుకుని మాట్లాడేవారు. సంతృప్త స్థాయి, అసంతృప్త స్థాయి అంటూ ప్రజల అభిప్రాయాలను బేరీజు వేసేవారు. ఈ లెక్కలు చూసుకునే ప్రభుత్వంపై ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారనుకుని ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అలాంటి లెక్కలే ప్రస్తుత సీఎం జగన్ కి కూడా అలవాటు చేస్తున్నారు అధికారులు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ తొలిసారి లెక్కలు వల్లె వేస్తూ మాట్లాడారు.
స్పందన కార్యక్రమంపై వచ్చిన వినతుల పరిష్కారం అతి త్వరగా జరుగుతోందని దీనిపై 90శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అర్జీదారుల్లో అసంతృప్తి స్థాయి సగటున 9.5శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఈ మాటలు వింటుంటే.. జగన్ ని కూడా అధికారులు మాయమాటలు చెప్పి బోల్తా కొట్టించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన ఉందనే మాట వాస్తవం. గత ప్రభుత్వంలో కూడా ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు గ్రీవెన్స్ డేతో కిటకిటలాడేవి. అయితే ఆ ఫిర్యాదులపై స్పందన చాలాతక్కువ. చాలావరకు చెత్తబుట్టలో పడేసేవారు.
కానీ జగన్ హయాంలో మాత్రం వచ్చిన ప్రతి ఫిర్యాదుకీ ఓ నెంబర్ కేటాయించి, రసీదు ఇచ్చి, విచారణ స్టేటస్ ను కూడా నోట్ చేస్తున్నారు. పోనీ అలా చేసినా కూడా సమస్యలు పరిష్కారం కావడంలేదని చెప్పేంత అమాయకులు కారు అధికారులు. ఎప్పటికప్పుడు సీఎం స్పందనపై రిపోర్ట్ లు అడుగుతున్నారు కాబట్టి పక్కాగా లెక్కలు రాస్తుంటారు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలను కూడా తప్పుబట్టలేం. వారు కూడా కిందిస్థాయి అధికారులపైనే ఆధారపడతారు. వారు తమ కింది సిబ్బందిని పురమాయిస్తారు. ఇక్కడే లెక్క తేడా వస్తుంది.
సీఎం చెప్పినట్టు అర్జీదారుల్లో 90శాతం మంది సంతృప్తిగా ఉంటారని చెప్పలేం. ప్రతివారం వచ్చిన 100 అర్జీల్లో 90 పరిష్కారం అయిపోతే అక్కడ ఇక సమస్యలేం ఉంటాయి. జిల్లాల్లో పరిస్థితి గమనిస్తే.. గ్రీవెన్స్ డేకి అయినా, పేరుమార్చుకున్న స్పందనకి అయినా.. వచ్చినవాళ్లే మళ్లీ మళ్లీ వస్తుంటారు. ఎమ్మార్వో ఆఫీస్ లో ఓ అర్జీ ఇస్తారు, సేఫ్ సైడ్ కలెక్టరేట్ లో మరొకటి పడేస్తారు, లా అండ్ ఆర్డర్ లింక్ ఉంటే.. ఎస్పీ ఆఫీస్ లో ఇంకో కాపీ ఇస్తారు. సో ఇక్కడ సమస్య ఒకటే, అర్జీలు 3. ఇలాంటి సందర్భాల్లో అధికారులిచ్చే లెక్కల్ని నమ్మలేం.
పోనీ నిజాయితీగా సమస్యలతో వచ్చేవారి అర్జీలను పరిశీలించినా.. అవన్నీ ప్రభుత్వ విధాన నిర్ణయాలతో ముడిపడి ఉన్నవే. అంటే.. స్పందన కార్యక్రమాలకు వచ్చే అర్జీలను పరిష్కరిస్తూ, వాటి లెక్కలతో సంతృప్తి పడితే కచ్చితంగా చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేసినట్టవుతుంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితులు సమీక్షిస్తేనే వీటిపై ముఖ్యమంత్రికి ఓ అవగాహన వస్తుంది. అధికారులిచ్చే సమాచారంతో అంతా బాగుంది అనుకుంటే మాత్రం జగన్ కూడా పప్పులో కాలేసినట్టే. ఇలానే కొన్నాళ్లు జరిగితే అది “స్పందన” స్ఫూర్తికే విఘాతంగా మారే ప్రమాదం ఉంది.