అనంతపురం జిల్లా ఒకప్పుడు జేసీ బ్రదర్స్ కంచుకోట. ఎవరైనా అడ్డొస్తే నాగుపాములా బుసకొడతారు నోరేసుకుని మీదపడిపోతారు, కుదరకపోతే కొట్లాటకు కూడా పోతారు. అందుకే ఆ ఏరియాలో ఎవరూ వారి జోలికెళ్లరు. పార్టీ అద్యక్షుడు చంద్రబాబుని పక్కనపెట్టుకుని మరీ ఆయన దేనికీ పనికిరాడంటూ తిట్టిపోసే స్టైల్ జేసీ దివాకర్ రెడ్డిది. నోరు తెరిస్తే.. అరేయ్ ఒరేయ్. నా– అనే బూతుమాటలు మాట్లాడే స్టైల్ ప్రభాకర్ రెడ్డిది.
అలాంటిది గత ఎన్నికల్లో సీఎం జగన్ దెబ్బకి.. బ్రదర్స్ అండ్ సన్స్ అడ్రస్ లేకుండా పోయారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్ తో బ్రదర్స్ డీలా పడ్డారు. జైల్లో ప్రభాకర్ రెడ్డి కూలబడిన వీడియో చూస్తే ఇలా అయిపోయాడేంటా అని శత్రువులు సైతం జాలి చూపిస్తారు. ఇక దివాకర్ రెడ్డి కూడా రోజుల వ్యవధిలో పూర్తిగా డల్లయిపోయారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే వీరి కుటుంబాలను ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి నారా లోకేష్ మంగళగిరి నుంచి బయలుదేరడమే విచిత్రం.
రాజకీయ విమర్శలకు లోకేష్ బహుదూరం.. తెలివి తక్కువ విమర్శలు చేయడానిటి ట్విట్టర్ వేదికగా చేసుకుంటారు కానీ.. జనసామాన్యంలో ప్రత్యర్థులపై సవాళ్లు విసరడం ఆయన వల్ల కాదు. అలాంటి లోకేష్.. ఎందుకో ఈసారి ధైర్యం చేసుకున్నారు. అది కూడా అనంతపురం జేసీ అడ్డాలోకి వచ్చి జగన్ పై సవాల్ విసిరారు. మా నాయకులు, కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోను ఖబడ్దార్.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానంటూ మొహానికి మాస్క్ కట్టుకుని కళ్లు ఉరిమారు.
చినబాబు ప్రతాపం చూడలేక దివాకర్ రెడ్డి కూడా వెనక్కు వాలిపోయి ఏంటి నా ఖర్మ అనుకున్నారు. జగన్ దెబ్బకి నాగుపాము లాంటి జేసీ బ్రదర్సే ఏమీ చేయలేక చేతులు పిసుక్కుంటున్నారు. అలాంటిది నాగుపాము పుట్టలోకి వచ్చి వానపాము లాంటి లోకేష్ జగన్ పై సవాల్ విసరడం కామెడీ కాక మరేంటి?
చినబాబు సవాల్ విసరడమే పెద్ద వింత అనుకుంటే.. అది కూడా జేసీ ఇలాకాలోకి వచ్చి.. ఆయనకు మద్దతుగా జగన్ పై రెచ్చిపోవడం మరింత విడ్డూరం. మొత్తమ్మీద రామ్మోహన్ నాయుడు ఎపిసోడ్ తో చినబాబులో కదలిక వచ్చిందనే విషయం టీడీపీ నేతలకి కూడా అర్థమవుతోంది. లేకపోతే ఇంకా హైదరాబాద్ క్వారంటైన్లోనే ఉండేవారు.
మొత్తమ్మీద లాక్ డౌన్ లో ఆంక్షలు సడలించడంతో లోకేష్ కూడా బయటకొచ్చి తన కామెడీకి పదునుపెట్టినట్టుంది ఈ వ్యవహారం చూస్తుంటే.