ప్రజారాజ్యం స్థాపించారు. ఏపీ రాజకీయాల్ని శాసించాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో గంపగుత్తగా పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి పదవిని అనుభవించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను కూడా అనధికారికంగా వీడారు.
ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే పరిమితమైన చిరంజీవి.. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పొలిటికల్ గా సిద్ధమౌతారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ, బీజేపీకి దగ్గరైంది కాబట్టి.. ఈ రెండు పార్టీలు కలిసి చిరంజీవిని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రంగంలోకి దించుతాయంటూ కథనాలు వస్తున్నాయి. వీటిపై జనసేన పార్టీ సభ్యుడు నాగబాబు స్పందించారు.
“అన్నయ్య ఎప్పుడైతే రెగ్యులర్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారో ఆరోజే రాజకీయాలకు దూరమైపోయారు. ఆయన కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. జనసేనతో కూడా చిరంజీవికి సంబంధం లేదు. జనసేన పార్టీ ఫౌండర్ కల్యాణ్ కు, అందులో సభ్యుడినైన నాకు ఆయన అన్నయ్య మాత్రమే. అంతకుమించి మరే సంబంధం లేదు. నిజంగా ఆయనకు రావాలని ఉంటే జనసేనలోకే వస్తారు.”
ఇలా చిరంజీవి ఎంట్రీపై స్పందిస్తూనే.. వస్తే జనసేనలోకి మాత్రమే వస్తారంటూ నాగబాబు ఫీలర్ వదిలారు. దీంతో చల్లారాల్సిన ఊహాగానాలు కాస్తా ఇంకాస్త వేడెక్కాయి. ఈమధ్య వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ న్యూస్ మేకర్ గా మారిన నాగబాబు.. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీపై కూడా కావాలనే అలా స్పందించారంటూ జనసైనికులు లైట్ తీసుకున్నారు.
అయితే చిరంజీవి జనసేనలోకి వస్తే.. ఆ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందనే విషయం అటు పవన్ కు, ఇటు నాగబాబుకు, మొత్తంగా ఏపీ ప్రజానీకానికి తెలియంది కాదు. అందుకే చిరంజీవిపై ఎప్పుడూ రియాక్ట్ అవ్వరు పవన్ కల్యాణ్. వీలైనంత మేరకు ఆ టాపిక్ ను సైడ్ చేయడానికే చూస్తారు. ఇలాంటి టైమ్ లో నాగబాబు మరోసారి కెలికి జనసైనికులకు ఆగ్రహం తెప్పించారు.