కరోనా భయంతో ప్రపంచం ఒణికి పోతోంది. సినిమా సెలబ్రెటీలూ అందుకు అతీతం ఏమీ కాదు. షూటింగులకు అనుమతులు ఇచ్చినా, ఇప్పటి వరకూ బడాస్టార్ సినిమా ఒక్కటీ మొదలవ్వలేదు. మరో నెల రోజుల వరకూ ఆ ఛాన్సులు కూడా లేవు. స్టార్ హీరోలంతా ఇప్పటికే 'షూటింగులకు రాలేం' అని నిర్మాతలకు మొహం మీదే చెప్పేశారు.
మహేష్ బాబు కూడా అంతే. తన కొత్త సినిమా `సర్కారు వారి పాట` షూటింగ్ మొదలవ్వడానికి రెడీగా ఉంది. కానీ.. మహేష్ మాత్రం ఆ మూడ్ లో లేడు. 'నేను జనవరి వరకూ సెట్లోకి రాలేను. ఈలోగా నేను లేని సీన్లన్నీ తీసుకోండి' అని దర్శక నిర్మాతలకు చెప్పేశాడట మహేష్. నిజానికి ఆగస్టు నుంచి మహేష్ సెట్లోకి అడుగుపెడతారని అంతా భావించారు. ఈలోగా షూటింగ్ మొదలెట్టి, చిన్నా చితకా సీన్లన్నీ పూర్తి చేద్దామని భావించారు.
తీరా చూస్తే మహేష్ ఇప్పుడు జనవరి అంటున్నాడు. మహేష్ కోసం ఎదురు చూస్తూ కూర్చోలేక, మహేష్ లేకుండా సినిమా మొదలెట్టలేక.. మల్లగుల్లాలు పడుతున్నారు దర్శక నిర్మాతలు. నవంబరు, డిసెంబరులలో షూటింగ్ మొదలెడితే, మహేష్ ఎలాగూ జనవరిలో వస్తాడు కాబట్టి.. షూటింగ్ ఊపందుకుంటుంది.
అన్నట్లు మహేష్ బాబు సినిమాలే కాదు, మిగిలిన హీరోల సినిమాలు కూడా జూలై రెండో వారం దాటే వరకు మొదలయ్యే అవకాశాలు ఏవీ లేవని బోగట్టా. అరవైలు దాటినవారికి అనుమతి లేదు. బాలయ్య, నాగ్, వెంకీ, చిరు ఇలా సీనియర్లు అంతా అరవైలు దాటేసారు కదా? ఇక యంగ్ బ్యాచ్ కూడా ఏమంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది.