ఇంత ఊగిసలాట ఎందుకు పవన్?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత చాలా గొంతులు లేచాయి, చాలా కలరింగ్ ఇచ్చాయి. జగన్ పై అక్కసున్నోళ్లంతా బీసీల పేరుచెప్పి వెళ్లగక్కారు. బీజేపీ నేతలు అరెస్ట్ లను స్వాగతిస్తున్నామంటూనే టీడీపీ హయాంలో జరిగిన…

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత చాలా గొంతులు లేచాయి, చాలా కలరింగ్ ఇచ్చాయి. జగన్ పై అక్కసున్నోళ్లంతా బీసీల పేరుచెప్పి వెళ్లగక్కారు. బీజేపీ నేతలు అరెస్ట్ లను స్వాగతిస్తున్నామంటూనే టీడీపీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం తలోరకంగా స్పందించాయి. ఒక్క జనసేన మాత్రమే కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్నచందంగా సందిగ్ధంలో పడింది.

అచ్చెన్నదొక్కటే కాదు అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాలంటూ జనసేన పార్టీ తరపున ప్రకటన వెలువడ్డా.. దానిపై నాదెండ్ల సంతకం మాత్రమే ఉంది. శ్రద్ధాంజలి స్టేట్ మెంట్లపై కూడా సంతకం పెట్టి పంపించే పవన్ కల్యాణ్ కి అచ్చెన్న అరెస్ట్ ఆనలేదా లేక.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకున్నారా? జనసేన ఇచ్చిన స్టేట్ మెంట్ ని పవన్ కల్యాణ్ మాటల్లాగా ఏబీఎన్ బైటకు వదిలితే.. అబ్బెబ్బే అది పవన్ వాయిస్ కాదు, నాదెండ్ల ఇచ్చిన ప్రకటన అని సర్దిచెప్పుకున్నారు జనసేన నేతలు.

అంటే పవన్ ప్రకటన మరోలా ఉంటుందా? మరిన్నిరోజులైనా ఆయనెందుకు స్పందించలేదు. పోనీ ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నారా అంటే అదీ లేదు.. నిన్నటికి నిన్న ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చిపడేశారు. మరి అచ్చెన్న, జేసీ అరెస్ట్ ల విషయంలో ఎందుకు స్పందించలేదు. పవన్ స్పందిస్తే ఏదో జరిగిపోతుందని కాదు, కానీ రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ లు బైటపడినప్పుడైనా జనసేన పార్టీ అధినేతగా ఆయనకు స్పందించాల్సిన బాధ్యత ఉంది.

పోనీ టీడీపీ నాయకులని విమర్శించడం ఇష్టంలేదు అనుకుంటే.. వారికి మద్దతుగా అయినా నిలవాలి కదా. లేదు టీడీపీదే తప్పు అనుకుంటే.. ఆ తర్వాత జరిగిన బీసీ రాజకీయ కుట్రపై కూడా పవన్ నోరు విప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు, అవినీతి అరెస్టుల్లో కులాల ప్రస్తావన ఎందుకంటూ కడిగిపారేసి ఉండాల్సింది. కానీ పవన్ కి చంద్రబాబు అంటే నోరు పెగలదు.

బీజేపీతో కలసి నడుస్తున్నా.. బాబుపై తన విశ్వాసాన్ని పవన్ ఇలా ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. అదే జగన్ పై నోరు చేసుకోమంటే మాత్రం “జగన్ రెడ్డీ” అంటూ పొలికేక పెడతారు. కనీసం అన్న నాగబాబైనా తన నిర్ణయాలను నిర్భయంగా చెబుతున్నారు, అరెస్టులను సమర్థిస్తూ.. టీడీపీ నీఛ రాజకీయాలను ఎండగడుతున్నారు. పవన్ కి ఆపాటి ధైర్యం కూడా లేకపోయింది. పాతికేళ్ల భవిష్యత్ రాజకీయాలంటూ జనసైనికుల్ని మభ్యపెడుతున్న పవన్.. ఇలాంటి ఊగిసలాటతో ఉండడం మంచిది కాదు. 

ఈ బురద బీసీలందరికీ అంటిస్తునాడు

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?