బుచ్చ‌య్య చౌద‌రి అడుగులు ఎటు వైపు?

త‌న‌కు ఆత్మ‌గౌర‌వ‌మే ముఖ్య‌మ‌ని, గౌర‌వం లేని చోట ఉండ‌డం ఎందుకంటూ ఊగిపోయిన రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చ‌ల్ల‌బ‌డ్డారా? అధిష్టానంపై చేసిన ఘాటు విమ‌ర్శ‌ల ఫ‌లితం ఏంటి?  ఆయ‌న మౌనంగా ఉండ‌డంతో…

త‌న‌కు ఆత్మ‌గౌర‌వ‌మే ముఖ్య‌మ‌ని, గౌర‌వం లేని చోట ఉండ‌డం ఎందుకంటూ ఊగిపోయిన రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చ‌ల్ల‌బ‌డ్డారా? అధిష్టానంపై చేసిన ఘాటు విమ‌ర్శ‌ల ఫ‌లితం ఏంటి?  ఆయ‌న మౌనంగా ఉండ‌డంతో చౌద‌రి ఆత్మ గౌర‌వం అట‌కెక్కిన‌ట్టేనా? ఇప్పుడీ చ‌ర్చ న‌డుస్తోంది. 

పార్టీని న‌డిపించ‌డంలో లోపాలున్నాయ‌ని, త‌న అభిప్రాయాలను ప‌రిగ‌ణలోకి తీసుకోక‌పోతే త్వ‌ర‌లో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని గోరంట్ల హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 25న ఆయ‌న పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే రాజ‌మండ్రి టీడీపీ వ్య‌వ‌హారాల‌ను గ‌మ‌నిస్తే …గోరంట్ల అయోమ‌యంలో ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

గోరంట్ల వ్య‌వ‌హారం రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంద‌న్న విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకుని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ధిక్క‌ర‌ణ స్వ‌రం వినిపించాల్సింద‌ని, అలా కాకుండా ఆవేశంలో ఏదో మాట్లాడి, ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గితే మాత్రం గోరంట్ల‌తో పాటు ఆయ‌న వ‌ర్గీయుల‌కు న‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

నిజంగా పార్టీ శ్రేయ‌స్సు, భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని లోపాల‌పై గ‌ళం విప్పాన‌ని గోరంట్ల భావిస్తుంటే, అవి ప‌రిష్కారం అయ్యే వర‌కూ త‌న పోరాటాన్ని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీడీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

ఒక వైపు తాను ఫోన్ చేస్తే క‌నీసం చంద్ర‌బాబు కాక‌పోయినా, యువ‌కుడైన లోకేశ్ అటెండ్ చేసే ప‌రిస్థితి లేద‌ని, ఇది త‌న‌ను అవ‌మానించ‌డ‌మే అని ఆయ‌న బ‌హిరంగంగా త‌న గోడు వెళ్ల‌బోసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వారి ఆత్మ గౌర‌వం నినాదంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించార‌ని, ఆయ‌న స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌న‌కు ఆత్మాభిమాన‌మే ముఖ్య‌మ‌ని కుండ‌బద్ద‌లు కొట్టారు. అంతా నిజ‌మే కాబోలు అనుకున్నారు.

రోజులు గ‌డిచే కొద్ది గోరంట్ల చిందులు, ఆవేశం తాటాకు మంట‌లాంటిద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయ చ‌ర‌మాంకంలో ఉన్న గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి…. ఆత్మ‌గౌర‌వం, టీడీపీ భ‌విష్య‌త్ కోసం త‌న మ‌న‌సు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటేనే విలువ ఉంటుంద‌ని చెప్పేవాళ్లు లేక‌పోలేదు. చివ‌రికి గోరంట్ల త‌న పోరాటానికి అర్థ‌వంత‌మైన ముగింపు ఇస్తారా? లేక త‌న‌కు ప‌ద‌వే ముఖ్య‌మ‌ని అధిష్టానానికి లొంగిపోతారా?… ఇప్పుడీ ప్ర‌శ్న‌ల‌కు గోరంట్ల స‌మాధానాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.