చెయిన్ స్కీము అనండి, పిరమిడ్ స్కీము అనండి, ఏ పేరు పెట్టినా యీ పోంజీ స్కీముల్లో ప్రధాన సూత్రమేమిటంటే – మీరు ఓ కంపెనీలో కొంత డబ్బు డిపాజిట్ చేస్తారు, దాని మీద వడ్డీ రావడంతో బాటు ఇతరులను కూడా చేర్పిస్తే వారి డిపాజిట్ల మీద కమిషన్ వస్తుంది. అలా మీకు సైడ్ యిన్కమ్ కూడా వస్తుంది. కొత్తవాళ్లు చేరే కొద్దీ మీకు లాభాలే లాభాలు! వినడానికి అద్భుతంగా వుండే యీ స్కీము వందేళ్ల క్రితం ఛార్లెస్ పోంజీ అనే అతని మెదడులో పుట్టింది. అందుకని అతని పేరు మీదే పోంజీ స్కీములుగా వ్యవహరిస్తారు. ఇప్పటికీ అవి వర్ధిల్లుతూనే వున్నాయి. వీటిలో గమ్మత్తేమిటంటే కొత్త డిపాజిటర్ల నుంచి వచ్చే డబ్బుతోనే పాత డిపాజిటర్లకు వడ్డీ చెల్లిస్తారు. కంపెనీ తన నిధుల్లోంచి యిచ్చేదేమీ వుండదు. వలలో కొత్త చేపలు పడడం ఆగిపోతే కంపెనీ ఒడ్డున పడిన చేపలా గిలగిలలాడి చస్తుంది. ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు కాబట్టి పోంజీ కథే చెప్పేస్తాను.
1919 జూన్. అమెరికాలోని బోస్టన్‌లో జెపి పూల్ అనే ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ కంపెనీలో రెండేళ్లగా గుమాస్తాగా వున్న 36 ఏళ్ల పోంజీ స్పెయిన్ నుంచి వచ్చిన ఒక కవరు తెరిచాడు. దానిలో కస్టమర్ ఒకతను పోస్టల్ రిప్లయి కూపన్ పెట్టాడు. అంటే కంపెనీ జవాబు రాసి ఆ కూపన్ జతపరిస్తే యిక వేరే స్టాంపులు పెట్టనక్కర లేదన్నమాట. దాన్ని జాగ్రత్తగా పరిశీలించగా పోంజీకి ఒక విషయం తట్టింది. ఆ కూపన్‌కి ఆ కస్టమర్ స్పెయిన్‌లో ఖర్చు పెట్టినది అమెరికాలో ఒక సెంటుకి సమానం. అయితే దాన్ని యిక్కడ అమెరికాలో పోస్ట్ ఆఫీసులో కానీ బాంకులో కానీ యిస్తే 5 సెంట్లు యిస్తారు. మారకపు విలువలో వున్న తేడా వలన ఆ లాభం వస్తుంది. అనేక సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ పోస్టల్ వ్యవస్థలో యీ పద్ధతి వుంది. అవేళ రాత్రే పోంజీ అన్ని దేశాలలో వున్న కరెన్సీ విలువలు లెక్క వేసి చూశాడు. ఏ దేశపు కరెన్సీ విలువ తక్కువగా వుందో ఆ దేశంలో స్టాంపులు కొనిపించి, వాటిని అమెరికా రప్పించుకుని, అమ్ముకుంటే నాలుగైదు రెట్లు లాభం వస్తుంది. కాస్త పెట్టుబడి పెడితే చాలు, అతి తక్కువ కాలంలో ఏ రిస్కూ లేకుండా బోల్డంత డబ్బు వచ్చిపడుతుంది.
ఈ ఆలోచనలతో ఆలస్యంగా పడుకోవడం వలన మర్నాడు ఆఫీసుకి లేటుగా వెళ్లాడు. అతని బాస్ ఆలస్యంగా వచ్చావని మందలిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి యింటికి వచ్చేశాడు. ఆ సంగతి విని అతని భార్య రోజ్ కంగారు పడింది. పోంజీలాగానే ఆమె కూడా ఇటాలియన్ జాతికి చెందినది. కొన్నేళ్ల క్రితం యితను ఎక్కణ్నుంచో వచ్చి తారసిల్లితే ప్రేమలో పడింది. తండ్రి యిష్టానికి వ్యతిరేకంగా పెళ్లాడింది. పెళ్లయ్యాక పోంజీ తన మావగారి హోల్‌సేల్ ఫ్రూట్ బిజినెస్ చూస్తానన్నాడు. 9 నెలల్లో దాని అంతు చూశాడు. 34 ఏళ్ల వయసులో యీ ఉద్యోగంలో వారానికి 16 డాలర్ల జీతానికి చేరాడు. ఇప్పుడు అదీ మానేశాడు. భార్యకు ధైర్యం చెప్పి మాడ్రిడ్‌లో వున్న తన స్నేహితుడికి 5 డాలర్లు పంపి వాటికి సరిపడా పోస్టల్ రిప్లయి కూపన్లు పంపమన్నాడు.
అవి పట్టుకుని తన స్నేహితులిద్దరి దగ్గరకి వెళ్లాడు. ‘‘మీ యిద్దరూ తలా 50 డాలర్లూ యిస్తే మూణ్నెళ్లల్లో 75 డాలర్లు చేసి వెనక్కి యిస్తా.’’ అన్నాడు. అలా ఎలా అని వాళ్లడిగితే యీ 5 డాలర్ల కూపన్లు చూపించి, చూశారా, దీని విలువ 25 డాలర్లు అన్నాడు. తన స్కీము గురించి చెప్పి, యూరోప్ అంతా నాకు ఏజంట్లున్నారు అని కోశాడు. వాళ్లిద్దరూ అప్పటిదాకా చెరో 50 డాలర్లు యిచ్చి రసీదు పుచ్చుకున్నారు. వాళ్లకు చెల్లించే సమయం వచ్చేలోపునే పోంజీ మరొకతన్ని పట్టుకుని వీళ్లకి యివ్వాల్సింది యిచ్చేశాడు. దెబ్బకి ముగ్ధులై పోయిన వీళ్లిద్దరూ ‘మాకు ప్రస్తుతానికి డబ్బక్కరలేదు, ఇంటికి పట్టుకెళితే ఖర్చయిపోతుంది. దీన్ని పెట్టుబడిగా తీసుకుని, యింకో మూణ్నెళ్లలో మరో పాతిక డాలర్లు పెంచి ఇయ్యి’ అని బతిమాలారు. అంతేకాదు, ‘పోంజీ ఒక లాభసాటి వ్యాపారాన్ని కనిపెట్టాడు. వచ్చిన లాభంలో కొంత మనకు యిస్తున్నాడు’ అని తమ స్నేహితులకు కూడా చెప్పి వాళ్ల చేతా యిన్వెస్టు చేయించారు.
అంతే యింకో నెల దాటేసరికి పోంజీ తన యింటి ముందు ‘ఛార్లెస్ పోంజీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఇన్వెస్ట్మెంట్స్’ అనే బోర్డు తగిలించాడు. అతనుండే నార్త్ ఎండ్ ఏరియాలో ఇటలీ నుంచి వలస వచ్చినవాళ్లు ఎక్కువగా వుంటారు. సాటి ఇటాలియన్ అనే నమ్మకంతో, 50% వడ్డీ యిస్తున్నాడన్న ఆశతో అంతా యిన్వెస్ట్ చేయడానికి ఎగబడ్డారు. పోంజీ ఎవర్నీ కాదనలేదు. అందరికీ సమయానికి చెల్లింపులు చేసేవాడు. కొందరు వడ్డీ మాత్రం తీసుకుని అసలు మళ్లీ డిపాజిట్‌గా పెట్టేవారు. కొందరు వడ్డీతో సహా మళ్లీ డిపాజిట్ చేసేవారు. అతి కొద్ది మంది మాత్రమే రెండూ వెనక్కి తీసుకునేవారు. ఫలానా విధంగా చేస్తే మంచిదని పోంజీ వాళ్లకు చెప్పేవాడు కాదు. మీరు యిస్తే బాగు, యివ్వకపోయినా మహబాగు అనే ధోరణే కనబరిచేవాడు. ఒక్కోప్పుడు నలుగురైదుగురు కస్టమర్లు గదిలో వుండగా కొందరితో ‘‘వద్దు, డిపాజిట్ తీసుకోను. క్రిస్మస్ వస్తోంది. మీకు ఖర్చులకు అవసరం పడుతుంది.’’ అనేవాడు. దానితో అతని యిమేజి మరింత పెరిగింది.
1919 డిసెంబరు కల్లా పోంజీ ఊళ్లో ఒక ఆఫీసు తెరిచాడు. ‘ఫారిన్ ఎక్స్ఛేంజ్ కంపెనీ, ప్రెసిడెంటు ఛార్లెస్ పోంజీ’ అని బోర్డు పెట్టాడు. తన డిపాజిటర్లందర్నీ అక్కడికే వచ్చి డబ్బు తీసుకోమన్నాడు. తెరిచిన నాలుగు రోజుల్లో 750 డాలర్లు వెనక్కి యిచ్చాడు. ఈ సందడంతా చూసి, అక్కడున్న వాళ్లూ వచ్చారు. పాతవాళ్లలో సగం మంది, కొత్తవాళ్లూ కలిసి యీ నాలుగు రోజుల్లో 1200 డాలర్లు డిపాజిట్ చేశారు. అవేళ పోంజీ ఒక సిల్క్ డ్రెసింగ్ గౌన్ కొని భార్యకు బహుమతిగా యిచ్చాడు. ఆమె మురిసిపోయింది. 1920 జనవరిలో ఒక ఇటాలియన్ పనివాడు పది డాలర్లు డిపాజిట్ చేయడానికి వచ్చినపుడు పోంజీకి ఒక ఐడియా వచ్చింది. ‘‘నీ కూలి పని కట్టిపెట్టి నా కంపెనీ కోసం పని చేస్తావా?’’ అని అడిగాడు. ‘‘నువ్వు నీకు తెలిసున్నవాళ్లకి చెప్పి మా కంపెనీలో డిపాజిట్లు వేయించు. 10% కమిషన్ యిస్తా.’’ అన్నాడు. వారం తిరిగేసరికి ఆ కూలివాడు బోల్డు డిపాజిట్లు వేయించడమే కాక, కొత్త డిపాజిటర్లను పోగేయడానికి ఓ అసిస్టెంటుని పెట్టుకున్నాడు.
ఇక పోంజీ తన దగ్గరకు వచ్చిన చిన్నాచితకా డిపాజిటర్లందరికీ యీ ఆఫర్ యిచ్చాడు. మార్చి నెల వచ్చేసరికి అతని ఏజంట్లు బోస్టన్ నలుమూలలా వ్యాపించేశారు. పోర్టులో కూలీలు, బార్లలో సర్వర్లు, బార్బర్లు, లిఫ్ట్ బాయ్స్, ఫ్రెంచ్-కెనడియన్ పనివాళ్లు.. యిలా అన్ని రకాల జాతుల కూలీనాలీ పోంజీ కంపెనీకి డిపాజిటర్లగా మారిపోయారు. ఈ పిరమిడ్ పెద్దదవుతూ పోయింది. పని పెరిగిపోవడంతో పోంజీ భార్య రోజ్ తన పనిమనిషి ఉద్యోగం మానేసి, భర్త దగ్గర సెక్రటరీగా చేరింది. డిపాజిట్ మెచ్యూరిటీ తేదీకి రెండు రోజుల ముందు డిపాజిటర్లకు వచ్చి డబ్బు తీసుకుపొమ్మనమని ఓ పోస్ట్‌కార్డ్ రాసి పడేసేది. పోంజీ నమ్మకస్తులైన ఓ యిద్దరు ఇటాలియన్ స్నేహితులను టెల్లర్లగా పెట్టుకున్నాడు. ఒకరు డబ్బు తీసుకునేవారు, మరొకరు చెల్లించేవారు. పోంజీ రసీదులు రాసి యిస్తూండేవాడు. ఓ రిజిస్టర్లో డిపాజిటర్ అడ్రసు, పేమెంటు యివ్వాల్సిన తేదీ మాత్రం రాసుకుని ఓ బీరువాలో పెట్టేవాడు. రోజుకి 3 వేల డాలర్ల డిపాజిట్లు వచ్చేవి. అన్నీ 1 డాలరు, 5 డాలరు నోట్లే! 6 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి దానిలో డిపాజిట్ చేసేవాడు.
ఏప్రిల్ వచ్చేసరికి 6గురు గుమాస్తాలు కావలసి వచ్చారు. మరో ఆఫీసు తెరిచి, పేమెంట్ల కోసం వచ్చేవారిని అక్కడికి వెళ్లి చెక్కులు తీసుకోమనేవారు. పోంజీ దగ్గర డిపాజిట్ చేయడానికి చాలామంది హెచ్చువడ్డీలకు అప్పులు తీసుకునేవారు కూడా. దానితో వడ్డీవ్యాపారస్తులూ బాగుపడ్డారు. కంపెనీ పెట్టిన ఏడాది కల్లా పోంజీ 30 వేల డాలర్లు పెట్టి ఒక పెద్ద బంగళా కొనేశాడు. రోజ్‌ను తీసుకెళ్లి హఠాత్తుగా చూపించేసరికి ఆమె నిజంగానే మూర్ఛపోయింది. కొన్ని రోజుల తర్వాత 12 వేల డాలర్లతో లిమోజాన్ కొని చూపిస్తే కళ్లు తిరిగాయంది. మరో కొన్ని రోజులకు లక్షా ఆరువేల వేల డాలర్లు పెట్టి ఆ యింటి యింటీరియర్స్ చేయించినప్పుడు పోంజీ భార్యకు ముందుగానే చెప్పి కళ్లు తిరక్కుండా జాగ్రత్తపడ్డాడు.
దీని తర్వాత హానోవర్ అనే బాంకింగ్ కంపెనీలో అతను మెజారిటీ షేర్లు కొనేశాడు. డైరక్టర్ల మీటింగుకి అతన్ని పిలిచి ‘ఏమిటీ మీ ఉద్దేశం’ అని అడిగితే ‘ఈ బాంకుకి ప్రెసిడెంటు కావాలని..’ అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. వాళ్లు మొహామొహాలు చూసుకున్నారు కానీ అతనికున్న షేర్లు బట్టి ప్రెసిడెంటు చేయక తప్పలేదు. అతను రోజూ పొద్దున్నే అందరి కంటె ముందుగా బాంకుకి వెళ్లి కూర్చునేవాడు, సాయంత్రం అందరి కంటె చివర్న వదిలేవాడు. మధ్యలో బయటకు వెళ్లి తన కంపెనీ చూసుకునేవాడు. బాంకు కొన్న నెల లోపునే అతను గతంలో పనిచేసిన పూల్ బ్రోకరేజి కంపెనీలో మెజారిటీ షేర్లు కొనేశాడు. మర్నాడే ఆఫీసుకి వెళ్లి ఏడాది క్రితం తనని ఉద్యోగం లోంచి తీసేసిన మాజీ బాస్ ఉద్యోగం పీకేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు కానీ బోస్టన్ ఫైనాన్షియల్ సర్కిల్లో పెద్ద తలకాయలు పోంజీ గురించి పట్టించుకోలేదు.
ఓ రోజు ఏడు బాంకుల ప్రెసిడెంట్లు ఓ హోటల్లో సమావేశమై ‘ఈ పోంజీ 50% వడ్డీ యివ్వగలిగే ఏ బిజినెస్ చేస్తున్నాడు? ఏమైనా అడిగితే పోస్టల్ రిప్లయి కూపన్లలో సంపాదిస్తున్నానంటాడు. నిజంగా అది అంత గొప్ప బిజినెస్సా?’ అని చర్చించారు. ‘అతనేం చేస్తున్నాడో తెలియదు కానీ, మా కస్టమర్లు తమ ఖాతాల్లోంచి డిపాజిట్లు తీసేసి అతని దగ్గర వేస్తున్నారు’ అని వాపోయారు చాలామంది. ‘తన బ్యాంకుని మాత్రం చాలా బాగా నడుపుతున్నాడు. లోన్లు యిచ్చేటప్పుడు సెక్యూరిటీగా చూపించే ఆస్తుల విలువ హెచ్చుగా చూపిస్తే యిట్టే పట్టేస్తున్నాడు.’ అని మరొకతను అన్నాడు. ‘అతని ఆఫీసున్న వీధిలోనే బోస్టన్ పోస్ట్ పత్రికాఫీసు వుంది. వీళ్ల కస్టమర్ల కారణంగా ట్రాఫిక్ పెరిగి వాళ్ల సిబ్బంది యిబ్బంది పడుతున్నారు కూడా. అయినా వాళ్లు యీ కంపెనీ పుట్టుపూర్వోత్తరాల గురించి పట్టించుకుని కథనాలు రాయటం లేదు’ అని విసుక్కున్నారు అందరూ కలిసి. ‘బోస్టన్ పోస్ట్‌లో ఎడ్వర్డ్ డన్ అని సిటీ ఎడిటర్ నాకు తెలుసు. అతన్ని ఓ చూపు చూడమంటాను.’ అన్నాడు ఒకతను.
అతని అభ్యర్థన మేరకు ఎడ్వర్డ్ మర్నాడు తన అసిస్టెంటుని పిలిచి పోస్టల్ రిప్లయి బిజినెస్ టర్నోవరెంతో కనుక్కోమన్నాడు. అతను కనుక్కుని వచ్చి ‘‘ఏడాదికి 75 వేల డాలర్ల విలువైన కూపన్లు ముద్రిస్తారు. 1919లో 58,560 డాలర్ల కూపన్లు అమ్ముడుపోయాయి.’’ అని చెప్పాడు. ఎడ్వర్డ్ మతిపోయింది. పోంజీ మొత్తం కూపన్లన్నీ కొనేశాడనుకున్నా, అతని కంపెనీ టర్నోవర్‌కి, యీ అంకెలకు పొసగటం లేదు. ఎక్కడో ఏదో మాయ వుంది అనుకుని యీ మధ్యదాకా పోంజీ నివాసముంటూ వచ్చిన నార్త్ ఎండ్ ఏరియాలో టోనీ అనే పరిచితుడికి ఫోన్ చేసి ‘‘ఈ పోంజీ కంపెనీలో నువ్వేమైనా ఇన్వెస్ట్ చేశావా?’’ అని అడిగాడు. ‘‘చేయలేదు. ఛస్తే చేయను కూడా.’’ అన్నాడతను. ఏం అంటే ‘‘అతను కెనడాలో ఏదో చట్టవిరుద్ధమైన పని చేశాడని అనుకుంటూ వుంటారు.’’ అన్నాడు. అమ్మయ్య, ఏదో లీడ్ దొరికిందనుకుంటూ ఎడ్వర్డ్ తన రిపోర్టర్లందరినీ పిలిచి ‘‘కెనడాలో ఛార్లెస్ పోంజీ అనే అతనిపై ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా ఏదైనా కేసు నమోదైందా అని రికార్డులు వెతికించి చెప్పండి.’’ అని పురమాయించాడు.
పోంజీ ఉత్తర ఇటలీలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. కానీ అతనికి పల్లెటూరి వాతావరణం నచ్చలేదు. 1899లో తన 17వ ఏట, న్యూయార్క్‌కు చేరాడు. ఇంగ్లీషు బాగా నేర్చుకుని రెస్టారెంట్లో వెయిటర్‌గా పనికి కుదిరాడు. కొన్నేళ్లు కష్టపడి పనిచేశాక యిలాగే నిజాయితీగా వుంటే డబ్బులు రాలవని అనుకుని, మోసాలు చేయడానికి కెనడా అనువైన ప్రదేశమని విని 1907లో మాంట్రియల్‌కు పయనమయ్యాడు. అక్కడ జరోసీ అనే ఒక ఇటాలియన్ ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపేవాడు. స్థానికంగా వున్న ఇటాలియన్ కూలీలంతా అతన్ని నమ్మేవారు. అతని దగ్గర యితను తన పేరు ఛార్లెస్ బియాంచీ అని చెప్పుకుని గుమాస్తాగా చేరాడు. ఎవరైనా ఇటలీలోని మీ కుటుంబాలకు డబ్బు పంపాలంటే నాకివ్వండి అనేవాడు జరోసీ. ఇచ్చిన డబ్బుకి వడ్డీ మీకిచ్చేస్తాను, అసలు మీ కుటుంబాలకు పంపుతాను అనేవాడు. వాళ్లు అలాగే యిచ్చేవారు. జరోసీ వీళ్లకు వడ్డీ మాత్రం యిచ్చి, అనేక సందర్భాల్లో అసలు మింగేసేవాడు, సగమే పంపేవాడు. విషయం తెలిసిన బియాంచీ నోరెత్తకుండా అతనికి కొంత పడేసేవాడు. అతను కొత్త క్లయింట్లను పట్టుకుని వచ్చి అప్పగించేవాడు.
కొంతకాలానికి కూలీల కుటుంబీకులు ఫిర్యాదులు చేయసాగారు. దాంతో ఇటాలియన్ కూలీలందరూ జరోసీ కంపెనీ మీద పడ్డారు. అతను మెక్సికో పారిపోయి, అక్కడ అంతర్ధానమై పోయాడు. ఇక్కడ బియాంచీ దొరికిపోయాడు. నేరంలో పాలుపంచుకున్నందుకు కెనడా పోలీసులు కేసు పెట్టి మూడేళ్లు జైల్లో పెట్టారు. బయటకు వచ్చేసరికి 28 ఏళ్లు. మళ్లీ అమెరికా వెళితే మంచిదనుకున్నాడు. అక్కడకు వెళ్లి డబ్బు సంపాదన కోసం కొంతమందిని అక్రమంగా సరిహద్దులు దాటించబోయాడు. అమెరికన్ పోలీసులు పట్టుకుని అట్లాంటా జైల్లో మూడేళ్లు ఉండాల్సి వచ్చింది. బయటకు వచ్చాక, మీసం తీసేసి, రూపం కొద్దిగా మార్చుకుని ఛార్లెస్ పోంజీ పేరుతో రోజ్‌ను ప్రేమలో పడేసి, జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాడు. అందుకే అతని కెనడా నేరం గురించి కర్ణాకర్ణిగా వినడమే తప్ప, ఎవరికీ వివరాలు తెలియవు.
కెనడాలో వేరే పేరుతో ఖైదు కావడం చేత ఎడ్వర్డ్ రిపోర్టర్లు అతని గురించి వివరాలు సేకరించలేక పోయారు. వాళ్ల గురించి ఆగకుండా ఎడ్వర్డ్ తన పబ్లిషర్‌ను ఒప్పించి పోంజీ కంపెనీ గురించి 1920 జులై 17 నుంచి కథనాలు వేయడం మొదలుపెట్టాడు. మొదటి వ్యాసంలో మూణ్నెళ్లలో 50% వడ్డీ యిచ్చే కంపెనీ, కేవలం పోస్టల్ కూపన్ల ద్వారానే విపరీతమైన లాభాలు గడిస్తున్న కంపెనీ అని హెడింగ్ పెట్టి పోంజీ కంపెనీ గురించి రాశాడు. తర్వాతి రోజు పోస్టల్ కూపన్ల ద్వారా అంత సంపాదించడం సాధ్యమా అనే ప్రశ్న లేవనెత్తాడు. ఈ విధంగా హెచ్చరించి డిపాజిటర్లను కాపాడుతున్నానని ఎడ్వర్డ్ అనుకున్నాడు కానీ ప్రజలు అలా అనుకోలేదు. పత్రికాఫీసు ముందు గుంపులుగుంపులుగా చేరి తిట్ట నారంభించారు. చిత్రంగా వుందా!? ప్రజలలాగే వుంటారు.
1990లలో విజయవాడలో ఒక కంపెనీ వెలిసింది. కొంత డబ్బు డిపాజిట్ చేస్తే మూడు నెలల్లో దానికి రెట్టింపు విలువైన వస్తువులు యిస్తానని ప్రకటించింది. కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు వగైరావి తయారు చేసే కంపెనీలతో తమకు ఒప్పందాలున్నాయని, హోల్‌సేల్‌లో కొంటాం కాబట్టి తమకు తక్కువ ధరకు వస్తాయని చెప్పుకున్నారు. గృహిణులు ఎగబడ్డారు. రద్దీ కంట్రోలు చేయడం పోలీసులకు అసాధ్యమైంది. దీనిలో ఏదో మోసం వుంది అని హెచ్చరిస్తూ పోలీసులు కరపత్రాలు పంచారు. ప్రజలు వినలేదు. చెప్పిన ప్రకారమే యిస్తున్నారు కదా, మాకు లాభం కలిగితే మీకేం కడుపునొప్పి అని పోలీసులను తిట్టిపోశారు. ఆర్నెల్లు గడిచాక ఒక శుభముహూర్తాన కంపెనీవాడు బోర్డు తిప్పేశాడు. అప్పటిదాకా దక్కినవాళ్లకు దక్కింది. తక్కినవాళ్లు లబోదిబో మన్నారు. కంపెనీ వాడితో కుమ్మక్కయ్యారని పోలీసులను తిట్టిపోశారు. అంతా కలిసే డ్రామాలాడారని వాపోయారు తప్ప తమ అత్యాశే యింత దూరం తెచ్చిందని అనుకోలేదు.
తమ కథనాలు ప్రచురించాక ఎడ్వర్డ్ తన రిపోర్టరును పోంజీ దగ్గరకు పంపాడు. అతన్ని చూస్తూనే పోంజీ ‘‘నా పరువు తీస్తున్నందుకు మీ పేపరు మీద దావా వేద్దామనుకుంటున్నాను.’’ అన్నాడు. ‘‘వచ్చి మా సిటీ ఎడిటరుతో మాట్లాడవచ్చుగా’’ అన్నాడతను. సరే అంటూ పోంజీ ఎడ్వర్డుని కలవడానికి వచ్చాడు. ఎడ్వర్డు అతన్ని చూస్తూనే ‘‘పోంజీ, మీ కెనడా వ్యవహారం గురించి కాస్త చెప్పండి.’’ అన్నాడు. పోంజీ కంగు తిన్నాడు. కాస్త సర్దుకుని ‘‘ఆ మాంట్రియల్ వ్యవహారమా? అదెప్పుడో ముగిసిపోయింది. దాన్ని పట్టించుకోవలసిన పని లేదు.’’ అన్నాడు. అంతే యిద్దరి మధ్య సంభాషణ ముందుకు సాగలేదు. కాస్సేపటికి పోంజీ వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోగానే ఎడ్వర్డ్ కెనడాలో ఉన్న తన రిపోర్టరు హెర్బర్ట్‌కు ఫోన్ చేసి, ‘‘కెనడాలో మిగతా వూళ్లు వదిలేయ్. మాంట్రియల్ పట్టుకో. పోంజీ ఫోటో పట్టుకుని యిల్లిల్లూ తిరుగు.’’ అని ఆదేశించాడు.
పోంజీ ఒక జడ్జిని కలిసి పేపరు మీద కేసు పెట్టాలంటే ఏం చేయాలని అడిగాడు. ఆయన ‘కేసులదాకా ఎందుకు? వాళ్లకే ఇంటర్వ్యూ యిస్తే సరిపోతుంది. ఆ పత్రికలో పని చేసి బయటకు వచ్చిన బిల్ మెక్మాస్టర్స్ అనే అతను పబ్లిసిటీ కంపెనీ నడుపుతున్నాడు. ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో అతను నీకు చెప్తాడు. అలా చెప్తే సరి.’’ అన్నాడు. మెక్మాస్టర్స్ని పిలిపించాడు. అతను ఎడ్వర్డ్‌తో మాట్లాడి వెంటనే ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు. ఆ యింటర్వ్యూలో పోంజీ ‘‘పోస్టల్ కూపన్లలో నేను యిన్వెస్ట్ చేసేది అతి తక్కువ. నేను ఎక్కువగా పెట్టేది వేరే వ్యాపారంలో, అదీ విదేశాల్లో! దేనిలో నా కంత లాభాలు వస్తున్నాయో ఆ రహస్యం చెప్పను. చెప్తే రాక్ఫెల్లర్ లాటి వాళ్లు దానిలో చొరబడతారు.’’ అని చెప్పాడు. దానితో పాటు ‘‘ఇప్పుడే ప్రకటిస్తున్నాను. ఇన్నాళ్లూ 90 రోజుల దాకా 50% వడ్డీ యివ్వటం లేదు కదా. ఇకపై 45 రోజులకే అంత మొత్తం యిచ్చేస్తాను. కొత్త డిపాజిట్లకే కాదు, పాత డిపాజిట్లకు కూడా!’’ అని ప్రకటించాడు. మిగతా కథ ‘‘పోంజీ చిరంజీవి’’ అనే వ్యాసంలో! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)