మణిరత్నం సినిమాలో నటించినప్పుడూ ఈ స్థాయి గుర్తింపు రాలేదు. ఇతర భాషల చిత్రాల్లో కనిపించినప్పుడూ ఈ క్రేజ్ రాలేదు! ఏ రంగంలో అయినా గట్టిగా కృషి చేసే ప్రతి మనిషీకీ ఒక టైమ్ అంటూ ఉంటుందన్నట్టుగా ఇప్పుడు అతడి టైమ్ నడుస్తూ ఉంది. పట్టిందల్లా బంగారం అవుతూ ఉంది. దశాబ్దం కిందటి నుంచినే తెలుగు వారికి పరిచయం అయినా ఇప్పుడిప్పుడు తెలుగు వాళ్లకూ క్రేజీగా మారిన ఆ హీరోనే పృథ్విరాజ్ సుకుమారన్. అటు హీరోగా సత్తా చూపించడంతో పాటు దర్శకత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుకుని.. తన తదుపరి సినిమాలపై అందరి ఆసక్తిని సంపాదించి పెట్టుకున్నాడు ఈ నట,దర్శకుడు.
మొదటి నుంచి వైవిధ్యభరితమైన సినిమాలనే చేస్తూ ఉన్నాడు పృథ్విరాజ్. అయితే అందరూ గుర్తించడం కాస్త లేటైందంతే. ఒక్క మాటలో చెప్పాలంటే మలయాళీ చిత్ర పరిశ్రమ వైవిధ్యతకు సిసలైన టార్చ్ బేరర్ గా నిలుస్తున్నాడు పృథ్విరాజ్. చాలా చిన్నది మలయాళ చిత్ర పరిశ్రమ. అయినా అక్కడి హీరోలకు దేశ వ్యాప్త గుర్తింపు. భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలను తీసే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల హీరోల కన్నా వీటితో పోలిస్తే చాలా చిన్న సినిమాలను తీసే మలయాళీ స్టార్ హీరోలకే ఇండియా వ్యాప్తంగా ఎక్కువ గుర్తింపు ఉందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. మాస్ మానియాలు, భారీ బడ్జెట్ లు, కోట్ల రూపాయల కలెక్షన్లతో తెలుగు, తమిళ హీరోలు సాధించలేనిది మలయాళీలు సునాయాసంగా సాధిస్తున్నారు. ఈ క్రమంలో పృథ్విరాజ్ సక్సెస్ స్టోరీ కూడా ప్రముఖంగా నిలుస్తూ ఉంది.
దాదాపు 15 సంవత్సరాల కిందట మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయ్యి ట్రైలర్లతో ఆసక్తిని రేపింది 'శివపురం' అనే సినిమా. థియేటర్లలో ఆ సినిమా పెద్దగా ఆడింది లేదు కానీ థ్రిల్లర్లకు ఊపు ఉన్న ఆ సమయంలో ఆ సినిమా టైటిల్ తోనే ఆకట్టుకుంది. తెలుగు వాళ్లను తొలిగా పలకరించిన పృథ్విరాజ్ సినిమా అదే! అంతకు కొన్నేళ్ల కిందట మలయాళంలో పృథ్విరాజ్ కెరీర్ ప్రారంభం అయ్యింది. ఇతడి సినీ మూలాలున్న కుటుంబమే, తండ్రి సుకుమారన్ మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్. తల్లి కూడా నటే. పృథ్విరాజ్ చిన్న వయసులోనే ఆయన తండ్రి మరణించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు పృథ్వి తెరంగేట్రం జరిగింది.
2002లో ఇతడి తొలి తొలి సినిమాలు విడుదల అయ్యాయి. ఆరంగేట్రం నుంచినే మలయాళీ చిత్ర పరిశ్రమలో పృథ్విరాజ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకదానితో మరోటి సంబంధం లేని తరహా సినిమాలను చూస్తే ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నాడు. సుకుమారన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలిస్తే, ఆయన తనయుడు హీరోగా సత్తా చూపించసాగాడు.
తెలుగులో సుమంత్ హీరోగా 'క్లాస్ మేట్స్' అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాకు మూలం అదే పేరుతో రూపొందిన ఒక మలయాళీ సినిమా. అందులో హీరో పృథ్విరాజ్. ఆ సంవత్సరంలో వచ్చిన మలయాళీ సినిమాల్లో టాప్ హిట్ గా నిలిచింది 'క్లాస్ మేట్స్'. తెలుగులో వచ్చినప్పుడు ఆ సినిమా డిజాస్టర్ కానీ, మలయాళంలో మాత్రం అప్పటి వరకూ ఉండిన కలెక్షన్స్ రికార్డ్స్ ను ఆ సినిమా సవరించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు అందులో పృథ్విరాజే హీరోగా నటించాడు. అప్పటికే ఇతడి సినిమాలు మలయాళం నుంచి తమిళ, తెలుగు భాషల్లోకి డబ్ కావడం ప్రారంభం అయ్యింది. తెలుగులో గుర్తింపు రాలేదు కానీ, తమిళులు మాత్రం గుర్తించారు. అక్కడ నుంచి తమిళ సినిమాల్లో కూడా అడపాదడపా కనిపించడం, ఇతడి సినిమాలన్నీ తమిళంలోకి డబ్ కావడం కొనసాగుతూ వచ్చింది.
ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో పోటీకి వెళ్లలేదు పృథ్విరాజ్. చిన్న చిన్న సినిమాలనే చేసుకుంటూ, యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్టులతో చాన్నాళ్ల పాటు కెరీర్ లాగించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రావన్' పృథ్విరాజ్ కెరీర్ కు తొలి భారీ సినిమా. అత్యంత భారీ అంచనాల మధ్యన వచ్చిన సినిమా అది. విక్రమ్ నటించడం, ఐశ్వర్యరాయ్ హీరోయిన్, తమిళ-హిందీ- తెలుగు భాషల సినిమా కావడంతో దానిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా తెలుగు-తమిళ వెర్షన్లలో పృథ్విరాజ్ నటించాడు. పృథ్విరాజ్ చేసిన పాత్రను హిందీ వెర్షన్ లో విక్రమ్ స్వయంగా చేశాడు. అయితే ఎంత భారీ అంచనాలతో వచ్చిందో అంత డిజాస్టర్ గా నిలిచింది ఆ సినిమా. ఏ రకంగానూ ఆకట్టుకోలేకపోవడంతో అప్పుడే సౌత్ లో స్టార్ కావాల్సిన పృథ్విరాజ్ కు ఆ గుర్తింపు దక్కలేదు.
అయితే ఆ సినిమాతో ఎంతో కొంత గుర్తింపు అయితే దక్కింది. స్టార్ కాలేకపోయినా మలయాళం నుంచి అతడి సినిమాలు తెలుగులోకి కూడా రెగ్యులర్ గా అనువాదం కావడం మొదలైంది. 2010లోనే డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించాడు ఈ హీరో. 'పోలిస్ పోలిస్' పేరుతో ఆ సినిమా రూపొందింది. శ్రీరామ్ అందులో మరో హీరో. అయితే ఆ సినిమా విడుదల వాయిదాలతో ఎవరిలోనూ ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. చివరకు ఎలాగో విడుదల అయ్యింది కానీ, తెలుగు జనాలు పట్టించుకోలేదు. ఆ తర్వాత పృథ్విరాజ్ సినిమాలు అనేకం తెలుగులోకి అనువాదం అయ్యాయి.
వాటిల్లో 'అన్వర్' అనే సినిమా కొంత మేర వార్తల్లో నిలిచింది. డబ్బింగ్ సినిమాలను విడుదల చేసే నిర్మాతలు అప్పుడప్పుడు పృథ్విరాజ్ సినిమాలను తెలుగు వైపు తీసుకొచ్చారు. అయితే వాటితో లాభం లేకపోయింది.
వరస సినిమాలతో మారిన కథ!
ఇప్పుడు ప్రపంచ సినిమా అంతా స్మార్ట్ ఫోన్ తెరపై అందుబాటులోకి వచ్చింది. ఏ భాష సినిమా అయినా బాగుందంటే ప్రేక్షకులు చూడటానికి అవకాశాలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో పృథ్విరాజ్ వంటి వాళ్ల పంట పండింది. ఇతడి మలయాళ సినిమాలు ఈ దశలోనే సూపర్ హిట్ కావడంతో ఇతర భాషల వాళ్ల కన్ను ఈ హీరో సినిమాల మీద పడింది. ఇదే సమయంలో మెగా ఫోన్ పట్టి తనలో ఒక ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడని పృథ్విరాజ్ నిరూపించుకున్నాడు.
లూసీఫర్.. పృథ్విరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా. మోహన్ లాల్ వంటి స్టార్ హీరోని పెట్టి పొలిటికల్ థ్రిల్లర్ ను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు పృథ్విరాజ్. అటు నటుడిగానూ పృథ్విరాజ్ వరస హిట్ లను నమోదు చేశాడు. లూసీఫర్ లోనూ ఒక ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆ పై అయ్యప్పనన్ కోషియం వంటి హిట్ లతో పక్క భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఇతర భాషల్లో రీమేక్ అయ్యే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే హిందీలో పలు సినిమాలు చేశాడు. అక్కడా వివిధ సినిమాల్లో పృథ్విరాజ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఒకరకంగా ఇప్పుడు పృథ్విరాజ్ కెరీర్ పీక్స్ లో ఉంది. 18 సంవత్సరాల తర్వాత సౌత్ లో స్టార్ అవుతున్నాడు. నటుడిగా తన ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. దర్శకుడిగా సత్తా చూపడానికి తదుపరి సినిమాలతో కూడా రెడీ అవుతున్నాడు. మలయాళీ వెర్షన్లో ఇతడి సినిమాలను చూసిన వారికి ఇతడి గొంతు కూడా గుర్తుండి పోతుంది. భాష అర్థం కాకపోయినా వ్యంగ్యాన్ని, ఆవేశాన్ని అందంగా వ్యక్తీకరించిన పృథ్విరాజ్ గొంతు మాత్రం ప్రేక్షకుడిపై ముద్ర వేస్తుంది. ఎందుకంటే.. పృథ్విరాజ్ సింగర్ కూడా! ప్లేబ్యాక్ సింగర్ గా పలు పాటలను కూడా పాడాడు.
-జీవన్ రెడ్డి.బి