ఒకవైపు రాష్ట్రంలో గులాబీ కండువా కప్పుకునే అలవాటు ఉన్న ప్రతి నాయకుడినీ.. టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల బరిలో మోహరించేస్తోంటే.. ఆ పార్టీ నుంచి ఓ సీనియర్ నాయకుడు నెమ్మదిగా జారుకుంటున్నారు. గులాబీ దళపతి మీద అసమ్మతితో వేగిపోతూ.. కమలతీర్థం పుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇప్పుడు ఉపఎన్నిక జరుగుతున్న మునుగోడు సీటునుంచి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలవడం.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని, ఎవరైనా వచ్చి బిజెపిలో చేరవచ్చునని, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించడం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతున్నది ఏంటంటే.. బూర ఊదితే భేరీ మోగినట్టు అవుతందా?
బూర నర్సయ్య గౌడ్ వలన బిజెపికి ఉండగల అడ్వాంటేజీ ఎంత? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఒకవైపు బీఆర్ఎస్ అంటూ.. జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తానంటూ ఊదరగొడుతున్నారు గానీ.. వాస్తవంలో ఆయన పార్టీ వారే ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్నారని బిజెపి చాటుకోవడానికి ఈ పరిణామం బాగా ఉపయోగపడుతుంది. అందుకే గులాబీనుంచి కమలంవైపు బూర మారుతున్నట్లుగా వాళ్లు చెప్పుకోవచ్చు.
మునుగోడు నియోజకవర్గంలో ఆ మేరకు బీభత్సంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలతో చిన్న మైండ్ గేమ్ ఆడవచ్చు. అంతమాత్రాన బూర నర్సయ్య గౌడ్ నిజంగానే.. కమలదళానికి లాభం చేకూర్చేంతటి బలమైన నాయకుడా? అంటే మాత్రం అవునని చెప్పలేం.
బూరకు తొలినుంచి ఎమ్మెల్యే పదవి మీదనే కన్నుంది. 2014లో కేసీఆర్ ఆయనను ఎంపీ బరిలోకి దింపారు. నెగ్గినప్పటికీ.. ఆయన ఎమ్మెల్యే పదవి మీద ఆశ వదలుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎక్కువగా ప్రయత్నించారు. భువనగిరి ఎంపీగా ఉంటూ, భువనగిరి ఎమ్మెల్యే కావాలని, కాపోతే పక్కపక్కన మరో నియోజకవర్గంనుంచి అయినా ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. కానీ అంతా సిటింగ్ స్థానాలే కావడంతో ఆయన కోరిక నెరవేరలేదు.
మునుగోడు ఉప ఎన్నిక ముంచుకురాగానే.. ఇక్కడ మళ్లీ టికెట్ కోరుకున్నారు. ఇదేమీ ఆయన సొంత నియోజకవర్గం కాదు. ఆయన విన్నపాల్ని కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో అలిగి బిజెపిలో చేరుతున్నారు. గతంలో ఎంపీగా నెగ్గినప్పుడు కూడా.. స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థులకంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న చరిత్ర కూడా బూర నర్సయ్య గౌడ్ కు ఉంది.
ఇప్పుడు బిజెపిలో చేరితే.. మునుగోడులో కేసీఆర్ మీద విరుచుకుపడుతూ ఆ పార్టీకి ఉపయోగపడితే.. వచ్చే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ సమయానికి తాను కోరుకునే భువనగిరిలోనో, ఆలేరులోనో, కమలదళానికి అంతగా ఠికానా లేని నల్గొండజిల్లాలో మరేదైనా నియోజకవర్గంలోనో ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని బూర కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మరి బూర ఊదడం ద్వారా.. బిజెపి ఏ మేరకు యుద్ధ భేరీ మోగించగలుగుతుందో చూడాలి.