చాలాకాలానికి వైసీపీ నేతల్లో కసి పట్టుదల కనిపిస్తోంది. ఒక విధంగా ఉత్తరాంధ్రా పార్టీ నేతలంతా ఒక్క త్రాటి మీదకు వచ్చి జై విశాఖ అంటున్నారు. మన రాజధాని మనకు దగ్గరగా రాజధాని అన్న మంత్రం స్మరిస్తూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆద్వర్యాన విశాఖ గర్జన జరుగుతుందని చెబుతున్నా కర్త కర్మ క్రియ అన్నీ వైసీపీయే అన్నది అందరికీ తెలిసిందే.
ఈ నెల 15న నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలయ్యే ర్యాలీ బీచ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం దాకా మూడున్నర కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ పాదయాత్రకు లక్ష మందికి పైగా జనాలు పాల్గొనేలా చూడాలని వైసీపీ గట్టిగా సంకల్పించింది. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
అంతా బాగా సాగుతోంది. సమరోత్సాహంతో వైసీపీ శ్రేణులు కదులుతున్నాయి. లక్షల మందికి పైగా ఒక్క చోట పోగై ఇదీ మా ఆకాంక్ష అని విశాఖ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ రాజధాని కోసం రణ నినాదం చేయనున్నారు. ఇది ఏపీ ఏర్పడిన తరువాత ఎన్నడూ కనని వినని నినాదం. ఎన్నో సార్లు అన్యాయమైపోయి వివక్షకు గురి అయిన విశాఖ ఒక్క పెట్టున చేసే సమర నినాదం.
విశాఖ వారికి ఏ కోరికలూ లేవు, వారికి రాజధాని అక్కరలేదు, అంతా మాకే కావాలి. వారు ముక్కు మూసుకుని కూర్చుంటారు అని విషపు రాతలు రాసేవారికి ఆ రాతలను అడ్డం పెట్టుకుని కూతలు కూసేవారికి సరైన సమాధానంగా విశాఖ గర్జన ఉండబోతోంది. ఇందులో రెండవ మాటే లేదు. నో డౌట్ అన్నట్లుగా లక్షలాదిగా జనాలు కదలి వస్తున్నారు.
అయితే ఈ ఉత్సాహాన్ని ఉద్యమాన్ని ఎవరూ నియంత్రించలేకపోయినా ఒకే ఒక్క ఇబ్బంది మాత్రం కలవరపెడుతోంది. అదే వరుణుడి ప్రతాపం. గత కొద్ది రోజులుగా విశాఖను భారీ వానలు ముంచెత్తున్నాయి. అలా వరుణుడు కనుక శనివారం ఇబ్బంది పెట్టకుండా కాసింత కరుణిస్తే మాత్రం విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.