ఆ సినిమాలకి ఇప్పుడంత సినిమా లేదు

ఒకప్పుడు ప్రతి సినిమాకి హాల్లో ప్రేక్షకారదరణ ఉండేది. 70-80 వ దశకం వరకూ అన్ని వయసుల వాళ్లూ సినిమాలకొచ్చేవారు..ఇంట్లో టీవీలుండేవి కావు కాబట్టి. ఉన్నా దూరదర్శన్లో అప్పట్లో వారానికొక పాత సినిమా వేసేవాడు తప్ప…

ఒకప్పుడు ప్రతి సినిమాకి హాల్లో ప్రేక్షకారదరణ ఉండేది. 70-80 వ దశకం వరకూ అన్ని వయసుల వాళ్లూ సినిమాలకొచ్చేవారు..ఇంట్లో టీవీలుండేవి కావు కాబట్టి. ఉన్నా దూరదర్శన్లో అప్పట్లో వారానికొక పాత సినిమా వేసేవాడు తప్ప కోరుకున్న సినిమా చూడాలంటే హాలుకెళ్లాల్సిందే. 

వేరే ప్రత్యామ్నాయాలు లేవు కనుక రీ-రిలీజులు విరివిగా ఉండేవి. ఏ పాత మాయాబజారో, మూగమనసులో, అల్లూరి సీతారామరాజో మళ్లీ రిలీజైతే 1980ల వరకు అపురూపంగా ఫీలయ్యి చూసేవాళ్లు జనం. క్రమంగా వీసీపీలొచ్చాక ఆ ఫీలింగ్ కాస్త తగ్గింది. ఇంట్లో టీవీ ఉంటే చాలు, బయట అద్దెకు వీసీయార్, వీసీపీ క్యాసెట్టు తెచ్చుకుని కోరుకున్న సినిమా చూసేయొచ్చు. ఆ తరం వారికి ఇదంతా అనుభవమే. 

ఇక ఇప్పటి విషయానికొస్తే యూట్యూబ్ పుణ్యమా అని కోరుకున్న సినిమా కోరుకున్న సమయంలో చూసే వెసులుబాటు వచ్చేసింది…అది కూడా ప్రత్యేకంగా ఏ రుసుమూ చెల్లించాలిస్న అవసరం లేకుండా. 

ఈ విప్లవం వల్ల సినిమా హాల్సుకొచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. ఎంత మిథునం లాంటి సినిమా వచ్చినా 50-60 ఏళ్లు పైబడిన ప్రేక్షకులు టీవీల్లోనే చూసారు తప్ప హాలుకొచ్చి ఆదరించలేదు. ఎవరి సౌలభ్యం వారిది..కాదనలేం. అందుకే హాలుకోసం తీసే సినిమాలు, ఇంటిపట్టునుండి చూసే వారికోసం తీసే సినిమాలు వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి పూర్తిగా వచ్చేసింది. 

అయితే హాల్లోకి సినిమా రాకపోతే హీరోలకి స్టార్డమ్ములుండవు. ఫలితంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే దమ్ములుండవు. ఏ సినిమా ఎలా ఆడిందో, హిట్టో, ఫ్లాపో చెప్పేది థియేటరొక్కటే. అందుకే “హాలుకి రండహో…” అంటూ ప్రతి పెద్దహీరో మొత్తుకుంటూ ఉంటాడు. చిన్న హీరోలు కూడా హాల్లో తమ సినిమా వచ్చి నలుగురు చూస్తేనే సంతృప్తిచెందుతారు. 

అయితే ఆ లెక్కలు పక్కన పెడితే ఇంటిపట్టునుండి చూసే ఆడియన్స్ ని కూడా కౌంట్ చేసే పద్ధతులు కొన్నున్నాయి. అవే టీవీల విషయంలో టీ.ఆర్.పీ లు. గతంలో బాహుబలి, రంగస్థలం, అతడు వంటి సినిమాలకి 18,20,21 లాంటి టీ.ఆర్.పీ అంకెలు వినపడేవి. అయితే తాజాగా వచ్చిన నాని “అంటే సుందరానికి” సినిమా జెమినీలో ప్రీమియర్ వేస్తే 1.8 రేటింగ్ వచ్చిందట. ఇది అత్యంత దయనీయం. కారణాలు పలు విధాలుగా లెక్కేయాలి. పూర్తిగా హీరో మీదే తోసేసే యవ్వారం కాదిది. 

ఈ రోజుల్లో జెమిని టీవీ ఎంత మంది చూస్తున్నారో మనకే అర్థమవుతోంది. ఈ చానల్ కి సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్ఫాం కూడా ఉంది. దానికీ ప్రైం వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ లాంటి స్థాయి లేదు. 

ఒక సినిమా తీసాక దానిని ప్రజల ముందు పెట్టాలి. అందుబాటులో ఉండాలి. ప్రజలు ఎక్కువగా ఏ ప్లాట్ ఫాం మీద ఉన్నారో దాని ద్వారా విడుదల చేయగలగాలి. లేకపోతే కష్టపడి పని చేసిన ఎవ్వరికీ సంతృప్తి ఉండదు. 

అదలా ఉంటే ఇక థియేటర్లకి రప్పించిన సినిమాలని ఒక్కసారి పరిశీలిద్దాం. 

ఈ ఓటీటీ యుగంలో హాల్లో బాగా ఆడిన సినిమాలు ఆర్.ఆర్.ఆర్, కేజీయఫ్,అఖండ, బింబిసార, కార్తికేయ, బ్రహ్మాస్త్ర, సీతారామం తదితరాలు. వీటిల్లో అన్నీ గ్రాఫిక్స్ వగైరాలతో చేసిన భారీ కథనాలే. వీటిల్లో కొన్ని కంటెంట్ పరంగా కాస్త అటు ఇటుగా ఉన్నా యువప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంటే ఏదో సాధారణ ప్రేమకథా చిత్రమో, కామెడీనో తీసేసి హాలుకొచ్చేయమంటే వచ్చేయరు. వాటిని నెమ్మదిగా ఇంట్లోనో, మొబైల్లోనో చూస్తారంతే. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అవసరమయ్యే సినిమాలకే ప్రస్తుతం వస్తున్నారు. ఈ క్లారిటీ చాలా అవసరం. ఎంత పెద్ద హీరో అయినా కథనంలో గ్రిప్ తో పాటూ కథాంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఏం తీసినా రొటీన్ కి భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. రొట్ట కొట్టుడు వ్యవహారాలు ఇక పని చేయవు. 

ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఇప్పుడు థియేటర్లో వెలుగు వెలిగే సినిమా లేదు. ఆచితూచి అడుగులు వేయాలి. హాలుకా, ఓటీటీకా అనేది అనుకుని దిగాలి.

ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా అనేది ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం అనే స్థితిలో లేదు. ఓటీటీలో ఆ గీతలు పోయాయి. విజయవాడలో కూర్చుని కొరియన్ సినిమాలు చూస్తున్నారు, వరంగల్లో ఉన్న యువకులు స్పానిష్ నార్కోస్ చూస్తున్నారు, విశాఖ ఆడియన్స్ మొబైల్లో జర్మన్ డార్క్ చూస్తున్నారు. సబ్ టైటిల్సుతో కట్టిపారేసే గుణముంటే చాలు చూసేస్తున్నారు. అలా మలయాళ సినిమాలు కూడా చూస్తున్నారు. 

కానీ తెలుగు సినిమాల్ని, సిరీస్ లని ఏ స్వీడన్లోనో, జెర్మనీలోనో ఓటీటీలకు కళ్లప్పగించి చూసే రోజులొస్తాయా? కనీసం పక్క రాష్ట్రాల్లో?! 

ఆ రోజుల్ని తీసుకొచ్చే బాధ్యత మన కథకులు, దర్శకులదే. స్టార్లు కూడా సందుల్లో థియేటర్ల కోసం పాకులాడడం తగ్గించి అంతర్జాతీయ స్టార్స్ గా వెలుగొందే దిశగా కంటెంట్ తయారు చేయించుకోవాలి. లేకపోతే నార్కోస్ లో నటించిన స్పానిష్ నటుడు వాగ్నర్ మౌరా ప్రపంచ స్టార్ ఎలా అయ్యాడు?  

చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధమే అన్నారు. అదొక శుభసూచికం. అయితే స్టాండర్డ్స్ మాత్రం ప్రపంచమంతా మనవైపు చూసేలా ఉండాలి..రాత, తీత కూడా! మిగిలిన హీరోలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. స్టార్డం లెక్కల్ని, మార్కెట్ అంకెల్ని ప్రాంతీయ స్థాయికే పరిమితం చేయకుండా రూటు మార్చి ప్రపంచాన్ని ఆక్రమించుకునే దిశగా అడుగులు వెయ్యాలి. అనుకుంటే సాధ్యమే. అనుకోవాలంతే. 

శ్రీనివాసమూర్తి