ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే.. అన్నట్టుగా.. దొంగే పోలీసుని ‘దొంగ దొంగ’ అంటూ వెంటపడినట్టుగా వక్రరాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. తమకు చేతకాని వాటి విషయంలో ఎదుటివాడిమీద పడి ఏడుస్తూ ఉంటారు. అర్థం పర్థం లేని ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇప్పుడు గుడివాడ తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కూడా చేరిపోయారు.
ఆయన ఎన్నడో చరిత్రలో వ్యవహారాలను బయటకు తవ్వితీస్తూ గతంలో నందమూరి హరికృష్ణను గుడివాడలో ఓడించింది కొడాలి నానినే కదా అని ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా.. నందమూరి కుటుంబం లోని కొందరితో కొడాలికి ఉండే అనుబంధంపై నీలినీడలు పడాలని కోరుకుంటున్నారు. అయితే ఈ రావి వెంకటేశ్వరరావు మాటలు.. అచ్చంగా ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగానే ఉన్నాయి.
1995లో మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన తర్వాత.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి నందమూరి కుటుంబానికి కూడా ఆ వెన్నుపోటు గురించి క్లారిటీ వచ్చింది. హరికృష్ణ సొంతంగా అన్న తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నారు. 1999లో ఆ పార్టీ తరఫున హరికృష్ణ గుడివాడ నియోజకవర్గంనుంచే పోటీచేశారు. అప్పట్లో కొడాలి నాని కూడా.. హరికృష్ణ కోసమే పనిచేశారు.. చంద్రబాబుతో అనుబంధం లేదు. కానీ అప్పట్లో హరికృష్ణకు గుడివాడలో 11వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. నాలుగోస్థానంలో నిలిచారు. అప్పట్లో హరికృష్ణ గంట గుర్తుమీద పోటీచేశారు.
ఆ ఎన్నికనే ప్రస్తావిస్తూ హరికృష్ణను కొడాలినాని వెన్నుపోటు పొడిచారని, తన నియోజకవర్గంలో పోటీచేయడాన్ని జీర్ణించుకోలేదని, ఆ వెన్నుపోటు నాయకుడు ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆరోపణలు చేస్తున్నారు.
కానీ 1999 నాటి చరిత్రలోకి వెళ్లిచూస్తే అసలు సంగతి తెలుస్తుంది.. అప్పట్లో తెలుగుదేశం తరఫున పోటీచేసి గెలిచిన రావి హరగోపాల్.. మరెవ్వరో కాదు… ఈ ఆరోపణలు చేస్తున్న రావి వెంకటేశ్వరరావుకు స్వయానా అన్నయ్య. ఎన్టీఆర్ అనుచరుడిగా తెలుగుదేశం రాజకీయాల్లోకి వచ్చి ఆరోజు వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు రావి శోభనాద్రి చౌదరికి పెద్దకొడుకు.
చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత.. జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమాని అయిన శోభనాద్రి చౌదరి తప్పుకుంటే.. ఆయన పెద్దకొడుకు టీడీపీ తరఫున పోటీచేశారు. కానీ హరగోపాల్ ఎమ్మెల్యేగా గెలిచినా.. ప్రమాణస్వీకారానికి ముందే రోడ్డుప్రమాదంలో మరణించారు. ఆ ఉపఎన్నికలో.. ఆయన తమ్ముడు.. ఇప్పుడు అర్థం పర్థంలేని ఆరోపణలు చేస్తున్న రావి వెంకటేశ్వరరావు జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఈ చరిత్ర తెలిస్తే అప్పట్లో హరికృష్ణను ఓడించింది ఈ రావి వెంకటేశ్వరరావు మరియు ఆయన సోదరులే అనే సంగతి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ.. కొడాలినాని వెన్నుపోటు పొడిచాడని.. ఆయన కొత్తపాట పాడడం.. పైన చెప్పుకున్న సామెతకు నిదర్శనం.