గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా భారత్ రాష్ట్ర సమితి పేరుతో చేస్తున్న హడావుడి గురించిన వార్త కాదు ఇది. ఏదో మోడీ మీద విరుచుకుపడడం తప్ప.. మోడీ కోటలను కూల్చే టార్గెట్లను ఫిక్స్ చేసుకునే దాకా ఇంకా కేసీఆర్ రాజకీయం అడుగులు వేయనేలేదు.
అయితే ఈ కథనం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురించి. త్వరలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్న గుజరాత్ అసెంబ్లీని దక్కించుకోవడానికి చాన్నాళ్లుగా విపరీతంగా కష్టపడుతున్న కేజ్రీవాల్.. ఈ ఏడాదిలోనే ఎన్నికలు ముగిసేలా ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదల అయిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి ఇంకా సీరియస్ గా పట్టించుకుంటున్నట్టు లేదు. చూడబోతే ఆయన, ఇలాంటి చిన్న చిన్న గడీలకంటె.. ప్రధాని మోడీ కంచుకోట మీదనే కన్నేసినట్టుగా ఉంది.
గుజరాత్ ప్రభుత్వానికి పదవీకాలం వచ్చేఏడాది ఫిబ్రవరిలో పూర్తవుతుంది. 2017లో జరిగినట్లే.. ఈ ఏడాది కూడా డిసెంబరులోనే ఎన్నికలు జరగవచ్చునని అనుకుంటున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలంో జనవరిలోనే పూర్తవుతుంది. ఆ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నెలలోనే నామినేషన్ల పర్వం మొత్తం పూర్తవుతుంది. నవంబరు 12 ఎన్నికలు కూడా జరుగుతాయి.
పరిస్థితులు ఇలా ఉండగా.. గుజరాత్ లోని నరేంద్రమోడీ కంచుకోటను బద్ధలు కొట్టడానికి చాలా చాలా పరిశ్రమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్ గురించి ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే.. ఆల్రెడీ మరో పదిరోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుండగా.. ఆ రాష్ట్రంలో ఆప్ పెద్దగా చప్పుడు చేయడం లేదు. పార్టీ నాయకులు మాత్రం.. హిమాచల్ లో మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీచేస్తామని, ఓటర్ల తీర్పు తమవైపే ఉంటుందని, తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు. కేజ్రీ కాన్సంట్రేషన్ ఒక్కటీ లేదక్కడ.
చూడబోతే.. 68 ఎమ్మెల్యే సీట్లున్న హిమాచల్ కంటె, 182 ఎమ్మెల్యే సీట్లున్న గుజరాత్ లో అమీతుమీ తేల్చుకోవాలని కేజ్రీవాల్ తలపోస్తున్నట్టుగా ఉంది. పైగా గుజరాత్ లో మోడీ సామ్రాజ్యాన్ని బీటలుకొడితే.. పార్లమెంటుసార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో ఏర్పడే ప్రత్యామ్నాయ కూటముల్లో జాతీయ స్థాయి నాయకుడిగా తన రేటింగ్ పెరుగుతుందనే కోరిక కూడా ఆయనకు ఉండొచ్చు. అందుకే గుజరాత్ మీద పెడుతున్న శ్రద్ధ.. హిమాచల్ మీద అంతగా పెట్టడం లేదు.
అదే సమమయంలో హిమాచల్ లో ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన సర్వేను కూడా గమనించాలి. వీరి సర్వేప్రకారం.. మళ్లీ బిజెపినే అధికారంలోకి వస్తుంది. కాకపోతే వారి ఓట్ షేర్ కాస్త తగ్గుతుంది. 68 స్థానాల్లో ఆప్ కు ఒక్క సీటు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఇలా ఉండగా, కేజ్రీవాల్ లాగానే ఆయన పార్టీ నాయకుడు దుర్గేశ్ పాఠక్ కూడా.. హిమాచల్ లో అధికారం దక్కించుకోబోయేది మేమేనంటూ చాలా ఘనంగా ప్రచారం చేస్తుండడం విశేషం.