మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 పేరుతో చేసిన ఇంటర్వ్యూ ఆహా ఓటీపీ ప్లాట్ ఫారం వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి ‘చంద్రబాబు నాయుడు తన జీవితంలో అత్యంత కీలకమైన అనేక రహస్యాలను బయటపెట్టేయబోతున్నారు’ అని చూసిన వాళ్ళందరూ అనుకునే లాగా.. ‘ఆహా’ కష్టపడి ఒక టీజర్ ను కూడా రూపొందించింది. ఆ టీజర్ మిలియన్లలో వ్యూస్ సాధించింది. మురిసిపోయిన ‘ఆహా’ యాజమాన్యం చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ద్వారా తమకు లక్షల సంఖ్యలో కొత్త సబ్స్క్రైబర్లు వచ్చేస్తారని సంబరపడే ఉంటుంది.
‘ఆహా’లో ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ఇంటర్వ్యూకు అదే క్రేజ్ కొనసాగి ఉంటే.. బహుశా వాళ్ల బిజినెస్ ఆశలు నెరవేరి ఉండేవేమో. కానీ ఈనాడు దినపత్రిక ‘ఆహా’ వారి వ్యాపార ప్రయోజనాలకు మంచి దెబ్బే కొట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఉండే కీలక భాగం సారాంశం మొత్తం అక్షరం పొల్లుపోకుండా.. తమ పత్రికలో సగం పేజీకి పైగా ప్రచురించేసింది. ఆ కీలక భాగం కోసమే ఇంటర్వ్యూ చూడాలని ముచ్చటపడేవాళ్లు ఎవరైనా ఉంటే గనుక.. కేవలం దానికోసమే చూసే వాళ్ళు ఉంటారని ‘ఆహా’ ఆశపడి ఉంటే గనుక.. ఆ ఆశలకు ఇక్కడితో గండిపడినట్లే.
చంద్రబాబు నాయుడు జీవితం మీద రకరకాల సందర్భాల్లో, రకరకాలుగా అనేక అనేక ఇంటర్వ్యూలు వీడియో రూపంలో వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. కొత్తగా బాలకృష్ణ ఇంటర్వ్యూలో బయటకు వచ్చే అద్భుతమైన సంగతులు ఏమీ ఉండవు.
కాకపోతే 1995 ఎన్టీ రామారావు వెన్నుపోటు ఎపిసోడ్‌లో ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేస్తున్న నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రధారి కనుక ఈ ఇద్దరి సంభాషణలో కొత్త రహస్యాలు వెలికి వస్తాయి అని ఎవరైనా అనుకోని ఉండవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అంత తేలికగా దొరికే రకం కాదు. ఆరోజు తాను పొడిచిన వెన్నుపోటు ‘మహత్కార్యం’ అని ‘ఆహా’ వేదికగా నందమూరి బాలకృష్ణ తో కూడా చెప్పించారు. అంతేతప్ప ఈ ఇంటర్వ్యూలో కొత్త సంగతి లేదు.
1995 ఎపిసోడ్ గురించి బాబు చెప్పే సీక్రెట్స్ తెలుసుకోవాలని ముచ్చటపడే వాళ్ళు ఎవ్వరూ ‘ఆహా’ చూసే అవసరమే లేకుండా ఈనాడు స్టోరీ రాసేసింది. ఆయన చెప్పే మిగిలిన పోచికోలు కబుర్లు మీద ఎవ్వరికీ ఆసక్తి కూడా ఉండదు. ఆ ఇంటర్వ్యూ కార్యక్రమానికి తామేదో ప్రచారం కల్పిస్తున్నాం అనే ముసుగు కింద ‘ఈనాడు’ భలే పని చేసింది. ఇందులో ఏమీ హిడెన్ ఎజెండా లేకుండా ఉంటుందా?