ఏపీలో తీవ్ర దుమారం రేపిన బీటెక్ దళిత విద్యార్థిని రమ్య హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్యానంతరం ఏపీ ప్రభుత్వం స్పందన భేష్ అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ ప్రశంసించింది. ఈ హత్యోందంతాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని టీడీపీ వేసిన ఎత్తులు చిత్తు అయ్యాయి. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగి, వాస్తవాలేంటో ఏపీ ప్రజానీకానికి చాటి చెప్పింది.
జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్డర్ బృందం గుంటూరులో సంఘటన స్థలాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అరుణ్ హల్డర్ మీడియాతో మాట్లాడుతూ రమ్య హత్య చాలా బాధ కలిగించిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి జీవితం అర్ధాంతరంగా ముగియడం ఆవేదన కలిగించిందన్నారు. హత్య తర్వాత చాలా తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
నిందితుడిపై త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను కోరినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆయన ప్రశంసలు కురిపించడం గమనార్హం. బాధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారాన్ని ఏపీ ప్రభుత్వం అందించిందని ఆయన గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వ దృక్పథం చాలా పాజిటివ్‌గా ఉందని ఆయన వివరించారు. దేశం మొత్తం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పరిగణన లోకి తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ కోరడం విశేషం. అలాగే ఈ ఘటనలో బాగా స్పందించిన గుంటూరు రూరల్, అర్బన్ పోలీస్ అధికారులకు రివార్డులు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని అరుణ్ హల్డర్ తెలిపారు.