నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందో కేంద్రమంత్రి నారాయణ రాణేకు తెలిసొచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు కేంద్రమంత్రి నారాయణ రాణే అరెస్ట్‌కు దారి తీశాయి. రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర వ్యాఖ్యలపై ఆయన్ను విచారిస్తుండడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్రమంత్రులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం పర్యటించారు.
ఈ సందర్భంగా సీఎం ఠాక్రేపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఠాక్రే ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందో కూడా తెలియక పోవడం సిగ్గుచేటు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రసంగం మధ్యలో ఠాక్రే వెనక్కి తిరిగి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’ అని రాణే దురుసు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కేంద్రమంత్రి మానసిక స్థితి సరిగా లేదంటూ శివసేన నేతలు ఆయనపై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని వెంటనే అరెస్టు చేసేందుకు నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నాసిక్ పోలీసుల బృందం రత్నగిరి వెళ్లి కేంద్రమంత్రిని అరెస్ట్ చేశాయి. కేంద్రమంత్రి రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాణేపై కేసులను కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానంలో పిటిషన్ చేశారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అత్యవసరంగా విచారించాలని కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంఘర్షణ నెలకుంది. బీజేపీ, శివసేన కార్యకర్తలు పరస్పరం నిరసనకు దిగడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెంప పగలకొట్టడం సంతగేమో గానీ, కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసి బీజేపీకి మహారాష్ట్ర సర్కార్ సవాల్ విసిరింది.