తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు వెళ్తారా? వెళ్లరా? అనేది చర్చనీయాంశంగా మారింది. అది కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో మూడు రోజులు మాత్రమే సభను సమావేశ పరిచి, సమావేశాలను ముగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ సమావేశాలకు హాజరు కావడం, కాకపోవడం అనే అంశాల గురించి స్పందించారు.
60 సంవత్సరాల వయసు పై బడిన ఎమ్మెల్యేల గురించి తమ్మినేని సీతారాం స్పందించారు. ఆ వయసు పై బడిన ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం పూర్తిగా వారి ఇష్టమని ఆయన అన్నారు. కరోనా భయాలు ఉంటే ఆ వయసు దాటిన ఎమ్మెల్యేలు సభకు రానక్కర్లేదని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఆ వయసు దాటిన వ్యక్తులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందనే వైద్య విశ్లేషణల నేపథ్యంలో ఆ వయసు దాటిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఆ వ్యాఖ్య చేశారనుకోవాలి.
ఇలాంటి క్రమంలో 70 యేళ్ల వయసు దాటిన చంద్రబాబు నాయుడు సభకు హాజరవుతారా? అనేది సమావేశాలు ప్రారంభం అయ్యాకా తేలే అంశం కావొచ్చు. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన కుటుంబం అక్కడే ఉంటోంది. ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వెళ్లి, వెంటనే మళ్లీ హైదరాబాద్ కు చేరుకుంటున్నట్టున్నారు! ఈ క్రమంలో ఆయన ఇళ్లు దాటడానికి అంత సిద్ధంగా లేరేమో అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలను కూడా స్కిప్ చేస్తారా? అలా చేస్తే పొలిటికల్ గా ఆయన ఉనికి ఇక తగ్గుముఖం పట్టినట్టు కాదా?