‘మాఫియా’ మాయలో మెగాస్టార్?

టాలీవుడ్ మాఫియా..ఈ పదం కనిపెట్టింది వాడుకలోకి తెచ్చింది టాలీవుడ్ జనాలే తప్ప వేరెవరూ కాదు. టాలీవుడ్ లో థియేటర్లు ఎక్కువగా గుప్పిట్లో పెట్టుకున్న కొందరిని ఉద్దేశించి, అది సరిపడని మరి కొందరు కనిపెట్టిన పదమే…

టాలీవుడ్ మాఫియా..ఈ పదం కనిపెట్టింది వాడుకలోకి తెచ్చింది టాలీవుడ్ జనాలే తప్ప వేరెవరూ కాదు. టాలీవుడ్ లో థియేటర్లు ఎక్కువగా గుప్పిట్లో పెట్టుకున్న కొందరిని ఉద్దేశించి, అది సరిపడని మరి కొందరు కనిపెట్టిన పదమే ఇది.  టాలీవుడ్ లో కొందరు జనాల పరిభాషలో 'మాఫియా' అంటే థియేటర్లను, ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకున్న కొందరు. చాలా మంది చాలా సార్లు ఈ 'మాఫియా' పదం వాడుతూ రచ్చకెక్కి విమర్శలు చేసారు. కానీ సాధించింది ఏమీ లేదు. అది వేరే సంగతి. ప్రస్తుతం టాలీవుడ్ కు కొత్త నాయకుడిగా అవతరించే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో చిరకాలం టాప్ హీరోగా వుంటూ వచ్చారు. ఇప్పుడు నిజానికి హాయిగా చేసుకుంటే ఒకటో, రెండో సినిమాలు చేసుకుంటూ, మిగిలిన టైమ్ ను విశ్రాంతిగా గడిపేయవచ్చు. కానీ ఆయన అలా అనుకోవడం లేదు.

టాలీవుడ్ కు లీడర్ గా వుండాలని, టాలీవుడ్ సమస్యలకు పరిష్కారం సాధించాలని, టాలీవుడ్ ను ఒక తాటిపైకి తేవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని, అందరినీ కలుపుకుని పోవాలని ఆయన అనుకోవడం దగ్గరే తేడా వస్తోంది. ఇలా కలుపుకు పోవడం కోసం మళ్లీ ఆయన చుట్టూ మళ్లీ 'ఆ జనాలే' మూగుతున్నారని, మెగాస్టార్ ను, మళ్లీ వారు తమకు అనుకూలమైన దారిలోకి మళ్లీస్తూ, తాము అనుకున్న ప్లాన్ లనే అమలు జరిగేలా చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలే కాదు, విమర్శలు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి కేవలం ఓ సినిమా హీరో మాత్రమే కాదు. ఆయనకు రెండు రాష్ట్రాల్లో ఓ నాయకుడిగా ఇంతో అంతో గుర్తింపు వుంది. ప్రజారాజ్యం పెట్టి, ఆయన విఫలమై వుండొచ్చు అంత మాత్రం చేత ఆయనకు ఆంధ్రలోని ఓ వర్గంలో వున్న ఫాలోయింగ్ ను కొట్టిపారేయాల్సింది కాదు. పైగా ఆయనకు ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రభుత్వాల్లో ఇంతో అంతో మాట పలుకుబడి వుంది. కానీ అలా అని ఇప్పుడు దాన్ని ఆయన ఇండస్ట్రీ కోసం ఉపయోగించాలని ఏమీ లేదు. ఆయన సినిమాలో, ఆయన పనులో వుంటే చేసుకోవచ్చు.

కానీ చిరంజీవి అలా అనుకోవడం లేదు. తనను ఇంత వాడిని చేసిన ఇండస్ట్రీకి ఏదైనా చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీ పెద్ద అనే హోదాను అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. నిజానికి అందువల్ల ఇండస్ట్రీకి వచ్చిన నష్టం లేదు. ఎవరో ఒకరు పెద్దరికం అందిపుచ్చు కోవాల్సిందే.  కానీ అలా అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీకి ఉపయోగపడితే ఇంకా మంచిది.

సిసిసి తో ప్రారంభం

కరోనా నేపధ్యంలో ఇండస్ట్రీ కార్మికుల కోసం సిసిసి ని ప్రారంభించారు. ఈ ఐడియాకు అందరూ సహకరించారు. ఈ కార్యక్రమం మంచి సక్సెస్ అయింది. ఇండస్ట్రీలోని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం లో చిరంజీవి విజయం సాధించారు. ఆ తరవాత లాక్ డౌన్ అనంతర వ్యవహారాలు భుజానకెత్తుకున్నారు. ఇక్కడ కూడా చిన్న చిన్న విమర్శలు వున్నా చిరంజీవి విజయం సాధించారు. టాప్ లైన్ డైరక్టర్లను పిలిచి, కార్యాచరణ ప్రారంభించడం వంటివి కూడా సజావుగానే సాగాయి. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ దగ్గరకు వెళ్లివచ్చారు. షూటింగ్ లకు అనుమతి గురించి మాట్లాడారు. అంత వరకు కూడా బాగానే వుంది.

ఆంధ్రలో అడిగిన వరాలు

ఆంధ్ర సిఎమ్ జగన్ దగ్గరకు వెళ్లడంతోనే వచ్చింది సమస్య. సెక్టార్ ల వారీగా ఆయన తీసుకెళ్లాల్సిన వారిని తీసుకెళ్లారు. తప్పదు. ఎందుకంటే ఆయా సెక్టార్లకు వాళ్లే లీడింగ్ లో వున్నారు. సురేష్ బాబు (ఎగ్జిబిటర్), దిల్ రాజు (డిస్టిబ్యూటర్) సి కళ్యాణ్ (ప్రొడక్షన్). నాగార్జున (స్టూడియో) రాజమౌళి (డైరక్షన్) ఇలా వెళ్లారు. అక్కడ వరకు కూడా బాగానే వుంది.

కానీ జగన్ దగ్గరకు వెళ్లి అడిగిన వరాలు ఇండస్ట్రీకి ఏమాత్రం ఉపయోగ పడతాయి?  అన్న దగ్గరే ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ ను అడిగిన కోరికలేమిటి?

థియేటర్లకు కరెంట్ బిల్లులు కరోనా టైమ్ లో రద్దు చేయాలి.

ఫ్లెక్సీరేట్లు అమలు చేయాలి

విశాఖలో స్థలాలు

ఇవే కదా? ఇప్పుడు వీటి మీదే ఇండస్ట్రీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ పోయి పోయి, మళ్లీ థియేటర్ల మాఫియా చేతిలో ఇరుక్కున్నారని, ఇన్నేళ్లుగా ఎవరైతే ఇండస్ట్రీని తమ కంట్రోల్ లో పెట్టుకుని, థియేటర్లను తమ అదుపులో వుంచుకుని, అన్ని వ్యవహారాలను శాసిస్తున్నారో, మళ్లీ అదే బాటలోకి మెగాస్టార్ వెళ్లిపోయారని అంటున్నారు.

ఎవరికి లాభం?

ఇప్పుడు ఆంధ్రలో అడిగిన వన్నీ ఆ నలుగురు పెద్లలకే తప్ప, ఇండస్ట్రీకి ఏం లాభం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీ రేట్లు అమలు చేయడం అన్నది కేవలం అరడజను మంది పెద్ద హీరోల సినిమాలకు తప్ప మరెవరికీ ప్రయోజనం వుండదని, అదే సమయంలో థియేటర్లకు కు మాత్రమే అంతో ఇంతో లాభం అని అంటున్నారు.

కరెంటు బిల్లులు మూడు నెలలు రద్దు చేయడం మంచిదే కానీ అది కూడా థియేటర్లు పెద్ద మొత్తంలో చేతిలో వుంచుకున్నవారికే లాభం అని అంటున్నారు.

ఇక విశాఖలో స్థలాలు ఎవరికి ఇస్తారు. పలుకుబడి, స్తోమత వున్న ఈపెద్దవారికి తప్ప.

మరి ఇండస్ట్రీకి ఏమిటి లాభం? వీలయినన్ని ఎక్కువ సినిమాలు తీస్తే ఇండస్ట్రీకి లాభం.

దాసరి బాట

దర్శకుడు దాసరి ఇండస్ట్రీ పెద్దగా వున్నపుడు ఎప్పుడూ చిన్న సినిమాల గురించే తపన పడేవారు అంతే తప్ప థియేటర్ల గురించి కాదు. చిన్న సినిమాలకు సబ్సిడీలు అడిగేవారు. ఇప్పుడు అలాంటి ప్రతిపాదనలే మరిచిపోయారు.

అలాగే చిన్న సినిమాలకు ప్రత్యేకంగా నెలకు ఇన్ని రోజులు థియేటర్లు కేటాయించాలన్న ఆలోచన కూడా వినిపించకుండా చేసారు. ఇదే కనుక ఆంధ్ర ముఖ్యమంత్రిని చిన్న సినిమాలు మాత్రమే ప్రదర్శించే థియేటర్లకు ప్రత్యేక రాయతీలు అడగడం కానీ, చిన్నసినిమాలకు రాయతీలు అడగడం కానీ చేయలేదు. కేవలం థియేటర్లు చేతిలో వుంచుకున్నవారికి ఉపయోగపడే విధంగా కోరికలు కోరి వచ్చారు.

నిజంగా దాసరి వారసత్వం అందిపుచ్చుకుని, మెగస్టార్ ఇండస్ట్రీ పెద్దగా వుండాలనుకుంటే, ఈ థియేటర్ల మాఫియా మాయలో పడి, వారికి పనికి వచ్చే కోరికలు కోరి వచ్చేవారు కాదని, ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తయారయ్యేలా, ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఎక్కువ రోజులు పని జరిగేలా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాలి తప్ప, కేవలం కొంతమందికి ఉపయోగపడే వరాలు పొందడం ఏమిటన్నది ఇండస్ట్రీ జనాల ప్రశ్న

మెగాస్టార్ ఇప్పుడు చేయాల్సింది, ఇండస్ట్రీలో ఆ నలుగురు అయిదుగురికి ఉపయోగపడే డెసిషన్లు కాదు అని, వీలయినన్ని ఎక్కువ సినిమాలు నిర్మించేలా, చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు బతికేందుకు వీలు అయిన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేలా చేయాలని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.

గిల్డ్ ప్లానింగ్ వేరు

ఇదిలా వుంటే మెగాస్టార్ వెనుక ఎవరు అయితే వున్నారో, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వెనుక కూడా వీరే వున్నారు. టాలీవుడ్ లో వున్న 24 క్రాఫ్ట్ సంఘాల నిబంధనలతో గిల్డ్ నిర్మాతలకు కొన్ని సమస్యలు వున్నాయి. ఇప్పడు కరోనా నేపథ్యంలో తెలివిగా ఈ సమస్యలను అధిగమించాలని చూస్తున్నారు. పెద్ద సినిమాలు అన్నింటికీ చెన్నయ్, ముంబాయి డ్యాన్సర్లను, ఫైటర్లను తెప్పించడం కామన్.  కానీ ఎంతమందిని తెప్పిస్తే అంతమందని లోకల్ జనాలను కూడా తీసుకోవాలనే కండిషన్ వుంది. అలాగే టెక్నికల్ టీమ్ కు కూడా.

ఇది యాక్టివ్ నిర్మాతలు చాలా మందికి రుచించడం లేదు. దీన్ని ఏదో విధంగా అధిగమించాలని చూస్తున్నారు. దీనికి కరోనా టైమ్ ను వాడుకోవాలని చూస్తున్నారు. వీలయినంత మంది తక్కువ మందితో వర్క్ చేయడం అన్న పాయింట్ ను దీనికి అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని బోగట్టా.

ఇలాంటివి అన్నీ అమలు జరిగితే సహజంగా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్ ల్లో ఇబ్బందికరపరిస్థితులు వస్తాయి. అప్పుడు ఈ నెగిటివ్ అంతా మెగాస్టార్ ఖాతాలో పడేలా వుంది. ఇప్పడు సిసిసి ద్వారా 24 క్రాఫ్ట్ ల్లో మెగాస్టార్ తెచ్చుకున్న ఇమేజ్ అంతా అప్పుడు మళ్లీ వెనక్కుపోయే ప్రమాదం వంది. అలా జరగకూడదు అంటే మెగాస్టార్ తను ఏం చేయాలన్నది క్లారిటీగా వుండడం అవసరం. కేవలం తనకు నాయకత్వం అందించారు అని, ఆ నలుగురు చెప్పినట్లు ఆడుకుంటూ వెళ్లిపోతే సరిపోదు.

తెరవెనుకన అరవింద్?

కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో సమావేశాలు జరుగుతున్నాయి.  ఎందరు హేమా హేమీల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అల్లు అరవింద్ పేరు మాత్రం వినిపించడం లేదు. అలా అని ఆయన ఈ వ్యవహారాలు అన్నింటికి దూరంగా వున్నాయని అనుకుంటే పొరటాటే. మొత్తం తెరవెనుక నుంచి అన్ని సలహాలు సూచనలు ఆయన కూడా అందిస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. గిల్డ్ గ్రూపులో ఆయన ఎప్పటికప్పుడు యాక్టివ్ గా వున్నారనే తెలుస్తోంది.

దిల్ రాజు, సురేష్ బాబు, అరవింద్ లేటెస్ట్ గా ఆసియన్ సునీల్ ఇలా ఎవరు అయినా, ఇటు ప్రొడ్యూసర్లుగా, అటు డిస్ట్రిబ్యూటర్లుగా, ఇంకోపక్క ఎగ్జిబిటర్లుగా వున్నారు. అందువల్ల ప్రతి సెక్టార్ వీరి ఆధిపత్యంలో వుంది. అందువల్ల వీళ్లకు నష్టం జరిగే పని ఏదీ జరగదు. ఇంతో అంతో లాభం జరిగే పనే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో నిర్మాతలకు పనికి వచ్చేవి ఒక్కటి కూడా అడగకుండా కేవలం ఎగ్జిబిటర్లు కమ్ నిర్మాతలకు మాత్రమే ఉపయోగపడే వ్యవహారాలుచూడడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

జరగాల్సింది ఇదీ

నిర్మాతల బాధలు ముందుగా చూడాల్సి వుంది. ఏ ప్రభుత్వాన్ని అయినా కోరాల్సింది ఇదే. సబ్సిడీల గురించి మరిచిపోయారు. పాత సబ్సిడీ బకాయలు చాలా వున్నాయి. అలాగే జిఎస్టీ తగ్గించే విషయం పరిశీలించాలి. ఎఫ్ డి సి నుంచి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా లోన్లు ఇవ్వాలి. అలాగే ఆరోగ్య శ్రీ అన్నది సినిమా కార్మికులకు కూడా వర్తింపచేయమని అడగాల్సి వుంది. ఆంధ్రలో స్థలాలు ఇచ్చినపుడు హైదరాబాద్ లో జరిగిన అవకతవకలు ఏవైనా వుంటే దృష్టిలో వుంచుకోవాలి.  ఇచ్చిన వారికే ఇవ్వడం, స్థలాలు తీసుకుని కమర్షియల్ వ్యవహారం చేసుకోవడం, అలా ఖాళీగా వుంచుకోవడం లాంటివి అరికట్టాల్సి వుంది.

త్వరలో మరో డెలిగేషన్

ఇదిలా వుంటే చిన్న నిర్మాతల తరపున, మరో డెలిగేషన్ సిఎమ్ జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. ఇండస్ట్రీ వ్యవహారాలు అన్నీ జగన్ దృష్టికి తీసుకురావడానికి ఈ డెలిగేషన్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.  చిన్న సినిమాలు వీలయినంత పెరగడానికి వీలైన సలహాలు, సూచనలు, సహాయాలు ఆంధ్ర ముఖ్యమంత్రిని కోరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు జగన్ అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు అని తెలుస్తోంది. కానీ అది సాధ్యం అవుతుందా? కాదా? అన్నది తెలియదు.

మొత్తం మీద బయటకు మాట్లాడకపోయినా, టాలీవుడ్ లో జరుగుతున్న వ్యవహారాల మీద లోలోపల అసంతృప్తి మాత్రం రాజుకుంటోందన్నది మాత్రం వాస్తవం.

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?

ఈ బురద బీసీలందరికీ అంటిస్తునాడు