జగన్ దగ్గర బేరాల్లేవమ్మా..!

అచ్చెన్నాయుడు, జేసీ అరెస్ట్ ల తర్వాత.. తెలుగుదేశం పార్టీ “లొంగుబాటు” రాజకీయాలను హైలెట్ చేస్తోంది. అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబాలు జగన్ కి లొంగలేదు కాబట్టే వారిని అరెస్ట్ చేశారని అంటున్నారు చంద్రబాబు. అంతకు ముందురోజే…

అచ్చెన్నాయుడు, జేసీ అరెస్ట్ ల తర్వాత.. తెలుగుదేశం పార్టీ “లొంగుబాటు” రాజకీయాలను హైలెట్ చేస్తోంది. అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబాలు జగన్ కి లొంగలేదు కాబట్టే వారిని అరెస్ట్ చేశారని అంటున్నారు చంద్రబాబు. అంతకు ముందురోజే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడం, ఆయన గ్రానైట్ గనుల లీజు వ్యవహారాలు కాస్త లిటిగేషన్లో ఉండటం.. ఈ వాదనకు బలం చేకూర్చేదిగా ఉంది.

అయితే జగన్ ఏనాడు ఎవర్నీ లొంగదీసుకోవాలని అనుకోలేదు. ఒకవేళ జగన్ నిజంగా టీడీపీ నాయకుల్ని లొంగదీసుకోవాలనుకుంటే.. ఆ పార్టీ ఆర్థిక మూలాల మీద ఎప్పుడో దెబ్బకొట్టి ఉండేవారు. మాజీ మంత్రి నారాయణ లాంటి వాళ్లను సైలెంట్ గా తమవైపు తిప్పుకునేవారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నారాయణ, గంటా, జేసీ బ్రదర్స్ లాంటివాళ్లు జగన్ పంచన చేరేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసు. అయినా జగన్ ఒప్పుకోలేదు.

జగన్ ఊ అంటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం ముందు క్యూ కట్టడానికి చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. అంతెందుకు ప్రకటనలిస్తానంటే.. రాత్రికి రాత్రే ఏబీఎన్ జై జగన్ అనదా, బెదిరించాలనుకుంటే టీవీ-5 జగన్ వాకిట్లో నిలబడదా? కానీ అవినీతి మకిలి లేనివారిని మాత్రమే జగన్ దగ్గరకు తీస్తున్నారు. పదవుల కోసమో, అవసరాల కోసమో కాకుండా.. బేషరతుగా పార్టీలో చేరేందుకు ఇష్టపడ్డవారికే వైసీపీ కండువా కప్పుతున్నారు.

మరి చంద్రబాబు అండ్ కో చెబుతున్న లొంగుబాటు రాజకీయాల సంగతేంటో వారికే తెలియాలి. తప్పుజరిగిందన్న అనుమానం ఉంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యే (నెల్లూరు రూరల్-శ్రీధర్ రెడ్డి)ని సైతం అరెస్ట్ చేయించిన పారదర్శక రాజకీయాలు జగన్ వి. అధికార పార్టీ ఎమ్మెల్యేనే అరెస్ట్ అయిన వైసీపీ పాలనలో.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ పై ఇంత రాద్ధాంతమా?

ఇది అచ్చెన్నాయుడు కోసమో, జేసీ కుటుంబం కోసమో జరుగుతున్న పోరాటం కాదు, కేవలం చంద్రబాబు ఉనికి కోసం జరుగుతున్న ఆరాటం. టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టి, పచ్చపాత మీడియాను ముందుంచి లొంగుబాటు పేరుతో బాబు ఆడుతున్న నాటకం. అంతేతప్ప.. జగన్ దగ్గర బేరాల్లేవమ్మా.. 

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?