హైదరాబాద్లో ఉన్న స్టూడియోలే షూటింగులు లేక వెలవెలబోతున్నాయి. ఇక విశాఖలో స్టూడియోల అవసరం ఉంటుందా? అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రశ్నించారు.
బాగానే వుంది. మంచిదే. కానీ విశాఖ అభివృద్ది చెందాలని, విశాఖ కూడా హైదరాబాద్ లా ప్రపంచనగరంలా ఎదగాలని కోరుకుంటున్న లక్షలాది మందిలో ఒకడిగా అడుగుతున్నా ఈ కింది రెండు ప్రశ్నలు.
'విశాఖలో రామానాయుడు స్టూడియోకి స్థలం కేటాయించింది చంద్రబాబు. అప్పటికే ఆయనకు హైదరాబాద్ లో స్టూడియో వుంది. మరి మళ్లీ విశాఖలో ఎందుకు ఇచ్చినట్లు?'
'బాలయ్య కుటుంబానికి హైదరాబాద్ లో స్టూడియో వుంది. ఆయన విశాఖలో స్టూడియోకి ఎందుకు దరఖాస్తు చేసినట్లు?'
ఈ రెండు ప్రశ్నలు ఆర్కేనే ఎందుకు అడగడం అంటే ఆయన తెలుగుదేశం వీర మద్దతు దారు. ఆ విషయం తెలుగునాట ఎవర్ని అడిగినా యస్ అనే అంటారు. నో అనేవారు వుండరు కాక వుండరు. మరి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, తెలుగుదేశం జనాల ఆలోచనలు ఆయన భావాలతో మ్యాచ్ కావాలి కదా?
విశాఖకు స్టూడియోలు అవసరం లేదని ఆర్కే అంటున్నారు. మరి చంద్రబాబు ఎందుకు రామానాయుడికి బీచ్ రోడ్ లో విలువైన ఓ కొండ ధారాదత్తం చేసేసారు స్టూడియో కట్టుకోమని. పైగా గమ్మత్తు ఏమిటంటే, చంద్రబాబు హయాంలో ఆ కొండ తీసుకుని అలాగే వుంచారు. ఏమీ కట్టకుండా. వైఎస్ వచ్చి, ఇచ్చిన దానికి అనుగుణంగా స్టూడియో కట్టకపోతే, వెనక్కు తీసుకుంటా అని చెప్పడంతో అర్జెంట్ గా కొన్ని నిర్మాణాలు చేసారు. కానీ అక్కడ ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయా? అంటే లేదు. అదంతా వేరే సంగతి.
ఇక బాలయ్య ముచ్చట. ఆయన తనంతట తానే చెప్పారు. విశాఖలో స్టూడియో కోసం స్థలం ఇవ్వమని దరఖాస్తు చేసాను అని.
చంద్రబాబు, బాలయ్య ల లెక్క ప్రకారం విశాఖకు స్టూడియోలు అవసరమేగా? మరి ఆర్కే ఏమిటి అవసరం లేదు అంటారు?
అసలు విశాఖకు అవసరం లేదు, వ్యాపారాలు నడవడం లేదు అనే ఆర్కే ఎందుకు తన పత్రిక ఎడిషన్లు శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి ఇలా ప్రతి చోటా పెట్టారు? వ్యాపార సౌలభ్యం కోసమే కదా? అలా అని హైదరాబాద్ లో ఎడిషన్ మూసేయలేదు కదా? అయినా తాను తెలంగాణ వాడిని, నిజామాబాద్ నాది అని చెప్పే ఆర్కేకు విశాఖకు ఇది వద్దు. అది అవసరం లేదు అని చెప్పే హక్కు ఎక్కడిది. విశాఖ ఉక్కు మా హక్కు అని నినదించిన వారిలో ఆర్కేకు పూజ్యులు అయిన గౌరవనీయ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా వున్నారు. బోలెడు ఉక్కు ఫ్యాక్టరీలు వుండగా విశాఖకు కావాలని ఎందుకు ఉద్యమించారు? అక్కడ ప్రగతి కావాలనే కదా? ఇదీ అంతే విశాఖలో కూడా సినిమా ప్రగతి కావాలని.
ఇంత చిన్న లాజిక్ ఆర్కే ఎలా మిస్ అయ్యారో?