‘ఎం.ఎస్. ధోనీ’ చిత్రంలో సుశాంత్‌కి అక్క పాత్ర చేశారు ప్రముఖ నటి భూమిక. సుశాంత్ మృతి వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. సుశాంత్ అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదన్నారు. చిన్న వయసులోనే ఓ టాలెంట్ యాక్టర్ మనకు దూరం కావడం చాలా బాధాకరమన్నారు.
‘ఎం.ఎస్. ధోనీ’ చిత్రంలో సుశాంత్, తాను 9 నుంచి 10 రోజులు మాత్రమే కలసి పని చేసినట్టు భూమిక తెలిపారు. ఏ సన్నివేశం లోనైనా సుశాంత్ బాగా నటించగలడని తనకు అనిపించిందన్నారు. సెట్లో కొన్నిసార్లు మేడమ్ అని, కొన్నిసార్లు అక్కా అని పిలిచేవాడన్నారు. సెట్లో అందరితోనూ హుందాగా, గౌరవంగా ప్రవర్తించేవాడన్నారు. కాకపోతే కాస్త రిజర్డ్వ్‌గా ఉండేవాడని భూమిక తెలిపారు.
‘ఎం.ఎస్. ధోనీ’ సినిమా తర్వాత సుశాంత్‌తో తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. అతన్ని ట్విటర్లో మాత్రం ఫాలో అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగని అతను ట్విటర్లో అంత యాక్టీవ్‌గా కూడా ఉండడన్నారు. ఏడాది క్రితం అనుకుంటా.. ట్వీటర్‌కి దూరం అవుతున్నట్లు ప్రకటించిన విషయాన్ని భూమిక గుర్తు చేశారు.
సుశాంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తనకేం తెలియదన్నారు. కానీ మనందరి జీవితాల్లో ఒడిదుడుకులుంటాయన్నారు. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు బంధువులతోనో, మిత్రులతోనే మాట్లాడితే సగం భారం దించుకున్నట్టు అవుతుందన్నారు.
మన జీవితాల్లో వెలుగు చీకట్లు ఉంటాయని భూమిక తెలిపారు. అన్ని రోజులూ ఒకేలా ఉండవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనంలో పెట్టుకోవాలన్నారు. యంగ్‌స్టర్స్ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఎక్కువగా ఒంటరిగా గడపకూడదని భూమిక సలహా ఇచ్చారు. మన అనుకునే వాళ్లతో సమస్యలపై చర్చించాలన్నారు. పరిష్కార మార్గాలను ఆలోచించాలని ఆమె చెప్పుకొచ్చారు.
ఆత్మీయులు అన్నవారెవరూ లేనివాళ్లు ఏం చేయాలనే ప్రశ్న ఇటీవల తనకెదురైందని భూమిక వెల్లడించారు. ఇటీవల తన దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ‘మనసు బాగాలేనివాళ్లు దేని మీదా దృష్టి పెట్టరు. అయితే రెగ్యులర్‌గా చేసినట్లే ప్రతి రోజూ స్నానం చేయాలి. వ్యాయామం చేయాలి. ప్రార్థించాలి. రోజులో 45 నిమిషాలు ఇంట్లో కాకుండా బయట గడపాలి. అప్పుడు వాళ్ల మనసు కొంచెం తేలిక అవుతుంది’ అని.
భూమిక మనసులో గాఢ ముద్ర వేసుకున్న ఈ మాటలు ప్రతి ఒక్కరికీ సాంత్వన చేకూర్చేలా ఉన్నాయి. కష్ట సమయంలో మనసును ఎవరికి వాళ్లు ఓదార్చుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అసలు మనిషి సమస్యకు కేంద్ర బిందువు మనసు. మనసును మన అదుపులో ఉంచుకోగలిగితే ఏ సమస్యా ఉత్పన్నం కాదు.