అనిల్ రావిపూడి ఇన్ రాంగ్ రూట్‌

F3 సినిమాలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి బ‌స్ డ్రైవ‌ర్‌గా చివ‌ర్లో క‌నిపించి శుభం కార్డు వేయిస్తాడు. F4  కూడా ఉంద‌ని భ‌య‌పెడ‌తాడు. భ‌యం ఎందుకంటే F2 కామెడీతో పోల్చితే F3 కామెడీ త‌క్కువ న‌వ్వించి…

F3 సినిమాలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి బ‌స్ డ్రైవ‌ర్‌గా చివ‌ర్లో క‌నిపించి శుభం కార్డు వేయిస్తాడు. F4  కూడా ఉంద‌ని భ‌య‌పెడ‌తాడు. భ‌యం ఎందుకంటే F2 కామెడీతో పోల్చితే F3 కామెడీ త‌క్కువ న‌వ్వించి “ఏందిరా ఈ సినిమా” అని భయ‌పెట్టింది కాబ‌ట్టి. డ్రైవ‌ర్‌కి డ్రైవింగ్ తెలిస్తే చాల‌దు. రూట్ కూడా తెలియాలి. తెలియ‌క‌పోతే గూగుల్ పెట్టుకునైనా న‌డ‌పాలి. అదేం లేదు. మ‌న‌కు అన్నీ తెలుసు అనుకుంటే బ‌స్సుని తోయాల్సి వ‌స్తుంది.

హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్లాల‌నుకుంటే క‌ర్నూలు, అనంత‌పురం మీదుగా ఫోర్‌లైన్‌లో వెళితే హాయి. అట్లా కాకుండా విజ‌య‌వాడ వెళ్లి, నెల్లూరు, చెన్నై వెళ్లి అక్క‌డి నుంచి కూడా బెంగ‌ళూరు వెళ్లొచ్చు. కానీ ప్ర‌యాణికులు తుక్కుతుక్కు అయిపోతారు. F3లో న‌వ్వుతూ వుంటాం కానీ, ఆ క‌థ ఎటు పోతుందో తెలియ‌దు. పైగా ఫ్రెష్‌నెస్ లేదు. అన్నీ పాత సినిమాల సీన్స్‌.

కామెడీ రెండు ర‌కాలు, క‌థ‌లోనే క‌లిసిపోయి క్యారెక్ట‌ర్లు సృష్టించే కామెడీ, క‌థ‌తో సంబంధం లేకుండా క్యారెక్ట‌ర్ల కోసం రాసుకునే కామెడీ. వెనుక‌టికి ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు కోసం ప్ర‌త్యేక‌మైన కామెడీ ట్రాక్‌లుండేవి. క‌థ సీరియ‌స్‌గా న‌డుస్తున్న‌ప్పుడు మ‌ధ్య‌లో కొంచెం రిలీఫ్‌గా ఈ ట్రాక్‌లొచ్చేవి. NTR కథానాయ‌కుడు, దేవ‌త‌లో ప‌ద్మ‌నాభం ట్రాక్ లేక‌పోయినా సినిమాకి వ‌చ్చిన న‌ష్టం లేదు. అవి అద‌న‌పు బ‌లం త‌ప్ప‌, ట్రాక్‌ల‌తో ఆ సినిమాలు హిట్ కాలేదు. రామానాయుడు చాలా సినిమాల్లో స‌ప‌రేట్ కామెడీ ట్రాక్‌లుండేవి. అప్ప‌లాచార్య అనే రైట‌ర్ రాసేవాడు.

గుండ‌మ్మ క‌థ‌, మిస్స‌మ్మ‌, అప్పుచేసి ప‌ప్పుకూడు కూడా కామెడీలే. క‌థ బ‌లంగా వుండ‌డంతో ఇప్ప‌టికీ మ‌న‌కి గుర్తున్నాయి. ఫార్స్‌ కామెడీతో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. 1976లో రాజ‌బాబుతో ముగ్గురు మూర్ఖులు వ‌చ్చింది. ఎపిసోడ్ కామెడీతో కాసేపు న‌వ్వించినా జ‌నాల్ని థియేట‌ర్‌కి ర‌ప్పించ‌లేక‌పోయింది.

హాస్యం మందులాంటిది. డోస్ తేడా వ‌స్తే విక‌టిస్తుంది. మందుకి రెండు అర్థాలున్నాయి. ఇంకో మందు కూడా సేమ్‌. పెగ్గుల్లో తేడా వ‌స్తే హ్యాంగోవ‌ర్‌, త‌ల ప‌ట్టేస్తుంది. F3 కూడా రెండున్న‌ర గంట‌లు క‌ష్ట‌మ‌నిపించింది.

ఇంగ్లీష్‌లో కూడా ఎపిసోడ్ కామెడీ పెద్ద‌న్న‌లు లారెల్‌, హార్డీ ఉన్నారు. క‌థ‌లేని కామెడీ కావ‌డంతో వాళ్ల గురించి ఇపుడు పెద్ద‌గా ఎవ‌రికీ గుర్తు లేదు. గ్రూచోమార్క్స్ బ్ర‌ద‌ర్స్ కూడా కాలానికి నిల‌బ‌డ‌లేక‌పోయారు. నార్మ‌న్ విస్‌డ‌మ్  (ఈయ‌న న‌టించిన ఎ స్టిచ్ ఇన్ టైమ్ 1963లో వ‌చ్చింది. మున్నాభాయ్‌లో కొన్ని స‌న్నివేశాల‌కి ఈ సినిమానే మూలం) బ‌స్ట‌ర్ కీట‌న్‌లు గుర్తు లేకుండా పోయారు. చాప్లిన్ ఎందుకు గుర్తున్నాడంటే బ‌ల‌మైన క‌థ‌లో కామెడీ అంత‌ర్లీనం కాబ‌ట్టి మాడ‌ర‌న్ టైమ్స్ ఇపుడు చూసినా కొత్త‌గా అర్థ‌మ‌వుతుంది.

పాత వాళ్ల‌ని వ‌దిలేస్తే తెలుగులో 1980 త‌ర్వాత కామెడీకి అగ్ర‌స్థానం ఇచ్చింది జంధ్యాల‌. అనేక పాత్ర‌లు, మాన‌రిజంతో న‌వ్వించాడు. త‌ర్వాత అందుకుంది ఈవీవీ. ఫార్స్ కామెడీ కొన్నిసార్లు వ‌ర్కౌట్ అయ్యింది. కొన్నిసార్లు భూమరాంగ్ అయ్యింది. శీను వైట్ల ఒక రేంజ్‌లో వెళ్లి కామెడీ, యాక్ష‌న్ క‌లిసి సూప‌ర్‌హిట్స్‌ ఇచ్చాడు. త‌ర్వాత స‌క్సెస్ త‌ల‌కెక్కింది. మందు ఎక్కితే తెల్లారేస‌రికి దిగిపోతుంది. స‌క్సెస్ ఎక్కితే ఫెయిల్యూర్ వ‌చ్చే వ‌ర‌కు దిగ‌దు. త‌న‌ని తాను రిపీట్ చేసుకుని మునిగిపోయిన మంచి ద‌ర్శ‌కుడు శీను వైట్ల‌.

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మేర్ల‌పాక గాంధీ కూడా కామెడీ మీద కొంచెం ఆశ‌లు క‌ల్పించాడు. ఎక్స్‌ప్రెస్ రాజాతో ఓకే అనిపించాడు. నానితో క‌లిసి యాక్ష‌న్‌లోకి దిగి రియాక్ష‌న్ తెచ్చుకున్నాడు.

కామెడీలో మిగిలింది, కొంచెం న‌మ్మ‌ద‌గిన వాడు అనిల్ రావిపూడి. ప‌ల్స్ తెలుసు, సెన్సిబులిటి వుంది. అయితే ఆయ‌న గుర్తించాల్సింది ఏమంటే క‌థ‌లో బ‌లం వుంటేనే సినిమా బ‌తుకుతుంది. ఎపిసోడ్ కామెడీకి కాలం చెల్లింది. జ‌బ‌ర్ద‌స్త్ షో అన్నిటిని తినేసింది. జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు, ర‌చ‌యిత‌లు ఏం చేశారంటే కంటెంట్ కోసం వెతికి, పోరాడి, మ‌ధించి అన్ని రకాల ఫార్స్ కామెడీల‌తో స్కిట్స్ చేసేశారు. క‌థ అన‌వ‌స‌రం, 10 నిమిషాలు న‌వ్విస్తే చాలు కాబ‌ట్టి చాలా సార్లు స‌క్సెస్ అయ్యారు.

బ‌య‌ట ప్రేక్ష‌కులు చాలా వేగంగా మారిపోతున్నార‌ని అనిల్‌కి తెలుసో తెలియ‌దో? (చాలా మంది ద‌ర్శ‌కులు త‌మ భ‌జ‌న బృందాల మ‌ధ్య ప్ర‌త్యేకమైన ఏసీ గుహ‌ల్లో నివ‌సిస్తుంటారు). క‌థ మీద వ‌ర్క్ చేయ‌డానికి బోలెడు టైమ్ ఉన్నా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో చ‌ద్ద‌న్నంకి తిరుగ‌మోత పెట్టి పులిహోర క‌లిపి వ‌డ్డించాడు. ఫ‌స్టాఫ్‌ అంతా వెంక‌టేష్‌ రేచీక‌టి, వ‌రుణ్ న‌త్తి. వీళ్లిద్ద‌రూ త‌మ‌న్నా ఫ్యామిలీతో త‌ల‌బ‌డ‌డం. క‌థ‌లో ఏమీ లేక‌పోయినా కాసేపు న‌వ్వ‌డానికి వెంక‌టేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌ల న‌ట‌న‌. అన్నిటికీ మించి సునిల్ మ‌ళ్లీ పాత సునిల్‌గా క‌నిపించ‌డం. (సునిల్ కొంత కాలం 6 ప్యాక్ మాయ‌లో ప‌డి బ్యాక్ వెళ్లిపోయాడు. బోధి వృక్షం కింద కూచున్నాడో ఏమో జ్ఞానోద‌య‌మై త‌న అస‌లు బ‌లం తెలుసుకున్నాడు).

ఫ‌స్టాఫ్‌ అంతా ఈ గోల‌. సెకెండాఫ్ వేరే క‌థ‌. 1968లో నేనంటే నేనే (కృష్ణ ) వ‌చ్చింది. త‌మిళంలో వ‌చ్చిన నాన్ (1967) దీనికి ఆధారం. అదే జాన‌ర్‌తో చంట‌బ్బాయి ఇంకా చాలా వ‌చ్చాయి. న‌వ్వించాల‌నే త‌హ‌త‌హ‌లో ప్రేక్ష‌కుల్ని ఎద్దుతో పొడిపించాడు అనిల్‌.

F2లో కూడా సెకెండాఫ్ వీక్‌. కానీ ప్రెష్ సీన్స్ చాలా వుండ‌డం వెంక‌టేష్ ఫ్ర‌స్ట్రేష‌న్ సినిమాని గ‌ట్టెక్కించి హిట్ చేశాయి. F3 హిట్ అని ప్ర‌చారం చేసుకోవ‌చ్చు కానీ, క‌ళ్లు తెరిచి చూస్తే వాస్త‌వాలు అర్థ‌మ‌వుతాయి. వెంక‌టేష్‌కి రేచీక‌టి వుంటే కామెడీ, ద‌ర్శ‌కుడికే వుంటే?

యాక్సిలేట‌ర్‌కి, బ్రేక్‌కి తేడా తెలియ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు.

జీఆర్ మ‌హ‌ర్షి