రాజమౌళికి పిచ్చి.. రామ్ చరణ్-ఎన్టీఆర్ సెటైర్లు

రాజమౌళికి పిచ్చి పట్టింది. ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్. పైగా ఈ మాట అన్నది ఎవరితోనే తెలుసా? మరో హీరో…

రాజమౌళికి పిచ్చి పట్టింది. ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్. పైగా ఈ మాట అన్నది ఎవరితోనే తెలుసా? మరో హీరో రామ్ చరణ్. అవును.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. రాజమౌళిపై సెటైర్లు వేశారు.

ఎన్టీఆర్ మాటల్లో చెప్పాలంటే రాజమౌళికి పెర్ఫెక్షన్ అనే పిచ్చి పట్టిందంట. ఆ పిచ్చితో ఆర్టిస్టులను చంపేస్తున్నాడట. ఒక సీన్ ను పదే పదే తీస్తాడట రాజమౌళి. ఇక చాల్లే అని ఎన్టీఆర్ చెప్పినా వినిపించుకోడట. ''ఎహే.. ఇంకో టేక్'' అంటూ విసిగిస్తాడట. రాజమౌళికి పట్టిన ఆ పిచ్చి తగ్గదన్నాడు తారక్. ఎన్టీఆర్ ఈ మాటలు చెబుతుంటే.. 'అవును..నిజమే నేను కూడా పడ్డాను' అంటూ రామ్ చరణ్ ఎగదోశాడు.

జుట్టు కొంచెం పెరిగినా, గడ్డం కొంచెం తగ్గినా ఒప్పుకోడట రాజమౌళి. ''అదేంటి జుట్టు పెరిగింది, గడ్డం తగ్గింది'' అంటూ ప్రశ్నిస్తాడట. మూడేళ్ల నుంచి ఒకే సినిమా తీస్తుంటే జుట్టు, గడ్డాలు పెరగవా అంటూ రాజమౌళిపై సెటైర్లు వేశారు హీరోలిద్దరూ.

ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటపెట్టాడు రామ్ చరణ్. రాజమౌళిని అంతా జక్కన్న అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? రాజమౌళికి ఈ పేరు పెట్టింది ఎన్టీఆర్ అంట. అమరశిల్పి జక్కన్నలా సన్నివేశాలు చెక్కుతుంటాడని, అందుకే జక్కన్న అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ అంగీకరించాడు.