ఇన్నాళ్లు లేని తొందర ఇప్పుడు ఎందుకు కేసీఆర్..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఉత్సాహం వస్తే ఆగేది లేదు, ఆయనకి మూడ్ బాగోకపోతే ఎవరు చెప్పినా కదలరు. ఇప్పటి వరకూ చాలా విషయాల్లో ఇలానే ప్రవర్తించారాయన. సెకండ్ వేవ్ సమయంలో కోర్టు చీవాట్లు…

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఉత్సాహం వస్తే ఆగేది లేదు, ఆయనకి మూడ్ బాగోకపోతే ఎవరు చెప్పినా కదలరు. ఇప్పటి వరకూ చాలా విషయాల్లో ఇలానే ప్రవర్తించారాయన. సెకండ్ వేవ్ సమయంలో కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కాని లాక్ డౌన్ పెట్టేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత అన్ లాక్ తో అన్నీ ఓపెన్ చేయడంలో కేసీఆరే ముందున్నారు.

ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పుపై కేంద్ర సంస్థలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో తెలంగాణలో స్కూల్స్ తెరుస్తామంటూ హడావిడి చేస్తున్నారు కేసీఆర్..

ఎందుకీ తొందర..?

సెకండ్ వేవ్ భయం పూర్తిగా తొలగిపోకముందే జులైలోనే కేసీఆర్ స్కూల్స్ పునఃప్రారంభిస్తామన్నారు. అయితే అప్పట్లో తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు. ఆ తర్వాత కేసులు తగ్గాయంటూ విద్యాశాఖ స్కూల్స్ తెరిచేందుకు ప్రతిపాదనలు పంపింది. కానీ కేసీఆర్ ఇష్టపడలేదు. నాకు నచ్చినప్పుడే స్కూల్స్, కాలేజీలు.. ఏవైనా అన్నారు. తీరా ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలపై కేంద్ర సంస్థలు వార్నింగ్ ఇచ్చిన రోజే కేసీఆర్ స్కూల్స్ రీఓపెనింగ్ పై నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం), నీతి ఆయోగ్.. ఈ రెండూ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కేంద్రాన్ని హెచ్చరించాయి. సెప్టెంబర్, అక్టోబర్ లో భారత్ లో కొవిడ్ కేసులు గరిష్టానికి చేరుకుంటాయని వార్నింగ్ బెల్స్ మోగించాయి. ఆలోగా వీలైనంత మేర వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని, కొవిడ్ కట్టడి చర్యలు పాటించాలని చెప్పాయి. దీంతో సహజంగానే రాష్ట్రాలన్నీ ఆలోచనలో పడ్డాయి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ముందుకేనంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలంటున్నారు.

కర్నాటక, ఏపీ ఉదాహరణలతో ఏం నేర్చుకుంటారు..

అటు కర్నాటకలో స్కూల్ విద్యార్థులకు కరోనా సోకడంతో రెండు ప్రాంతాల్లో స్కూల్స్ మూసివేశారు. ఇటు ఏపీలో కూడా కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలోని స్కూల్స్ లో కరోనా కలకలం రేగడంతో తాళం వేసారు. విద్యార్థుల హాజరు తక్కువగానే ఉన్నప్పటికీ, జగన్ పై విమర్శలు తప్పలేదు. ఈ దశలో పాఠశాలలు తెరిచేందుకు సిద్ధపడుతున్న రాష్ట్రాలకు ఇదో వార్నింగ్ బెల్ అనుకోవాలి.

ఇప్పటికే పంజాబ్ లో స్కూల్స్ తెరుచుకున్నాయి. త్రిపురలో రేపటి నుంచి స్కూల్స్ మొదలవుతాయి. తమిళనాడులో సెప్టెంబర్ 1 నుంచి 9, 10 తరగతులకు స్కూల్స్ పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ తెలంగాణలో మాత్రం 1 నుంచి 10 తరగతులు, కాలేజీలకు కూడా స్కూల్స్ మొదలు పెట్టేస్తామంటున్నారు.

ఇప్పటికే స్కూల్స్ తెరిచిన రాష్ట్రాలకు మరో ఆప్షన్ లేదు, కేసులు పెరిగితే బడులకు తాళం వేయాల్సిందే. అయితే మరికొన్ని రోజులు వేచి చూసే అవకాశం ఉన్నా కూడా కేసీఆర్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. కోరి మూడో ముప్పు కొనితెచ్చుకోవడం అంటే ఇదేనేమో.