పవన్ కల్యాణ్ అప్ డేట్ కావాలంటే జనసేన ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తున్నారంతా. అయితే ఎంతమంది పవన్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను తెరుస్తున్నారు. ఆయన పర్సనల్ అకౌంట్ కి బ్లూ టిక్ కూడా ఉంది. కానీ పవన్ ఇప్పుడా అకౌంట్ ని అస్సలు వాడటం లేదు. చివరిసారిగా జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా మాత్రమే ఆయన ట్వీట్ చేశారు.
ఆ తర్వాత మార్చి 29న చివరిసారిగా జనసేన ఖాతా నుంచి వచ్చిన దాన్ని రీట్వీట్ చేసి సరిపెట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆయన పర్సనల్ ఖాతాను తెరవలేదు, అప్ డేట్స్ ఇవ్వలేదు. ఇప్పటివరకూ ఆయన హడావిడి అంతా జనసేన అధికారిక ఖాతానుంచి మాత్రమే జరుగుతోంది. విషెస్ అయినా, ప్రెస్ నోట్లు అయినా అన్నీ జనసేన ట్విట్టర్ అకౌంట్ నుంచే ఉంటున్నాయి.
అది పార్టీకి.. ఇది సినిమాలకి..
నిజానికి పవన్ కల్యాణ్ కు సంబంధించి రెండు ట్విట్టర్ ఎకౌంట్స్ ఉన్నప్పుడు గతంలో ఫ్యాన్స్ చాలా ఊహించుకున్నారు. పార్టీ ఎకౌంట్ ను పూర్తిగా రాజకీయాలకు కేటాయిస్తారని అనుకున్నారు. అదే జరిగింది. జనసేన ఎకౌంట్ ను రాజకీయాల కోసం మాత్రమే వాడుతున్నారు పవన్.
అదే సమయంలో వ్యక్తిగత ఖాతాను సినిమా అప్ డేట్స్ కోసం వాడుతారని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. సినిమా అప్ డేట్స్ సంగతి దేవుడెరుగు.. కనీసం అందులో పవన్ ఫొటోలు కూడా పడడం లేదు.
చిరు బర్త్ డే విషెస్ కి కూడా సొంత అకౌంట్ వాడలేదు..
ఇతర అధికారిక సమాచారం కోసం జనసేన అకౌంట్ ని వాడుతున్నా.. పండగలు, పబ్బాలు, పుట్టినరోజులు, జయంతుల సందర్భంగా పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత అకౌంట్ ని మాత్రమే వినియోగించేవారు. శుభాకాంక్షలు చెప్పేవారు. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడది పూర్తిగా ఆగిపోయింది.
చిరంజీవి పుట్టినరోజు ప్రెస్ నోట్ కూడా జనసేన ఖాతా నుంచే జనాల్లోకి వచ్చేసరికి పవన్ ట్విట్టర్ అకౌంట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇకపై ఆయన దాన్ని వినియోగించే అవకాశం లేదని తేలిపోయింది. ఇదే కొనసాగితే త్వరలో పవన్ ట్విట్టర్ అకౌంట్ కి ఉన్న బ్లూటిక్ పోతుంది. అప్పుడు అదో పెద్ద న్యూస్ అవడం ఖాయం.
పర్సనల్ అకౌంట్లు వద్దు..
పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఖాతాకు 4.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, జనసేన అకౌంట్ కి కేవలం 1.4మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కువమందికి విషయం చేరవేయాలంటే పవన్ తన పర్సనల్ అకౌంట్ నే వాడాల్సి ఉంటుంది. కానీ ఆయన దానికి దూరం జరిగారు. ప్రజా జీవితంలోకి వచ్చాక పర్సనల్ అకౌంట్లు వద్దు అనుకుంటున్నారు పవన్. అందుకే ఆయన తన ట్విట్టర్ అకౌంట్ కి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.
ఇకపై ఆయన ఏది చెప్పినా జనసేన వాణిగానే వినపడుతుందనమాట. సొంత అన్నయ్య పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఆయన వ్యక్తిగత ఖాతా వాడలేదంటే, తన పర్సనల్ ఎకౌంట్ కు పవన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.