– ఒన్ అండ్ ఓన్లీ రియల్ మెగాస్టార్ అల్లు అర్జున్ మాత్రమే. తక్కువ స్థాయి కలిగిన పరాన్నజీవులు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ పవన్ కల్యాణ్, అల్లు శిరీష్, రామ్ చరణ్, నిహారికతో పోలిస్తే అల్లు అర్జున్ రియల్ మెగాస్టార్. బన్నీ తప్ప మిగతావాళ్లంతా ఇప్పటికీ చిరంజీవి సక్సెస్ పైనే ఆధారపడి ఉన్నారు.
– వాళ్లను నేను పరాన్నజీవులు అని ఎందుకన్నానంటే, ఇప్పటికీ వాళ్లంతా చిరంజీవి సక్సెస్ పైనే జీవిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం అలా చేయడం లేదు. అందుకే అతడు రియల్ మెగాస్టార్.
– చిరంజీవి కొడుకు, అల్లుళ్లు, మేనల్లుళ్లు, కూతుళ్లు, అంకుల్స్ పై.. ఓ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ సాధించిన మెగా సక్సెసే అసలైన విజయం అని నేనంటాను.
– చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు అల్లు అర్జున్ వెళ్లకపోవడం అల్లు అర్జున్ తెలివితేటలకు నిదర్శనం. పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, రామ్ చరణ్ లాంటి మెగా కుటుంబ పరాన్నజీవులతో బన్నీ కలవకూడదు. అల్లు అర్జున్ ఓ సెల్ఫ్ మేడ్ స్టార్.
సందు దొరికితే మెగా కుటుంబంపై కామెంట్లు చేయడానికి సిద్ధంగా ఉండే రామ్ గోపాల్ వర్మ, ఈసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, చిరుతో అల్లు అర్జున్ కు ఉన్న సంబంధాల్ని టార్గెట్ చేశాడు. ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా, సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బందిపడేలా మెగా హీరోలందరిపై కామెంట్స్ చేశాడు. బన్నీ తప్ప మిగతా హీరోలందర్నీ చిరంజీవి స్టార్ డమ్ పై బతికే పరాన్నజీవులన్నాడు.
ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవి-బన్నీ రిలేషన్ షిప్ పై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. కుటుంబసభ్యులంతా కలిసొచ్చిన ఫంక్షన్ కు అల్లు అర్జున్ వెళ్లకపోవడాన్ని మెగాఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది హద్దులు దాటి బన్నీపై తిట్ల దండకం కూడా అందుకున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ చెత్త సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ ఎంటరై, విషయాన్ని మరింత కెలికి కంపు చేశాడు.
చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వాలా వద్దా అనేది పూర్తిగా బన్నీ వ్యక్తిగత నిర్ణయం. చిరు మామయ్యకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్.. వేడుకలకు హాజరుకాలేదనేది వాస్తవం. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బన్నీ ఇతర ఎసైన్ మెంట్స్ తో బిజీగా ఉండొచ్చు. లేదంటే ఆరోగ్యం సహకరించలేకపోవచ్చు. లేదంటే కరోనా టైమ్ లో గ్యాదరింగ్స్ కు దూరంగా ఉండాలనే ఆలోచన కావొచ్చు. అది అతడి ఇష్టం. అంతమాత్రం దానికే చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య సంబంధాలు బాగాలేవంటూ చర్చ అనవసరం.
మెగా కాంపౌండ్ లో ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని క్యాష్ చేసుకోవడానికి వర్మ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయం. పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ, ఏకంగా అతడిపై షార్ట్ ఫిలిం తీసిన వర్మ.. ఇలాంటి చిరు-బన్నీ లాంటి బర్నింగ్ ఇష్యూను వదిలేస్తాడని అనుకోవడం అవివేకం అవుతుంది. అయితే ఈ క్రమంలో మిగతా హీరోల్ని పరాన్నజీవులు అనడం, బన్నీని ఏకంగా మెగాస్టార్ ను చేయడం మాత్రం వర్మకే చెల్లింది.
గొడవలు పెట్టి తమాషా చూడడం, వివాదాలు రేపి పండగ చేసుకోవడం వర్మకు కొత్తకాదు. అది అతడి వ్యవహార శైలి. ఎన్నోసార్లు అది ప్రూవ్ అయింది కూడా. సో.. ఆయన ట్రాప్ లో పడకుండా ఉండడం అనేది ఇక్కడ పాయింట్. ఎంతమంది వలలో పడితే వర్మకు అంత ఆనందం. ఈ విషయం తెలిసి కూడా ట్రాప్ లో పడుతున్నారు మెగాభిమానులు. మరీ ముఖ్యంగా హైపర్ ఆది లాంటి కాస్త పాపులర్ మెగాభిమానులు సైతం వర్మ ట్వీట్లపై స్పందించడం విషయాన్ని మరింత పెద్దది చేస్తోంది.
“మెగా కాంపౌండ్ పై పడి ఏడుస్తూ, నిత్యం వాళ్లపై ట్వీట్లు చేస్తూ బతికేస్తున్న రామ్ గోపాల్ వర్మ అసలైన పరాన్నజీవి” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. అందులో కొంత నిజం ఉండొచ్చు. కానీ వర్మకు కావాల్సింది ఆ పబ్లిసిటీ మాత్రమే, అలాంటి కాంట్రవర్సీలే ఆయనకు ఇష్టం. కాబట్టి ఆర్జీవీ ట్రాప్ లో పడకండి, ఆనందంగా ఉండండి.