మేర్లపాక..మరీ ఇలానా?

దర్శకుడిగా మేర్లపాక గాంధీకి మంచిపేరే వుంది. మొదటి రెండు సినిమాలు పెద్ద హిట్. మూడో సినిమా పెద్దగా క్లిక్ కాకపోయినా, బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు. ఆ మధ్య తీసిన చిన్న సినిమా కూడా ఓకె…

దర్శకుడిగా మేర్లపాక గాంధీకి మంచిపేరే వుంది. మొదటి రెండు సినిమాలు పెద్ద హిట్. మూడో సినిమా పెద్దగా క్లిక్ కాకపోయినా, బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు. ఆ మధ్య తీసిన చిన్న సినిమా కూడా ఓకె ఓకె. కానీ మొదటి రెండు సినిమాల రేంజ్ లో మరో సరైన సినిమా అదించలేకపోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో హీరో నితిన్ తో అంథాదూన్ సినిమా రీమేక్ ను భుజాల మీదకు తీసుకున్నాడు. 

వేరే భాషలో పెద్దహిట్ అయిన సినిమాను, అందులోనూ ఓటిటి ప్లాట్ ఫారమ్ ల్లో మన ప్రేక్షకులు కూడా ఎక్కువగా చూసేసిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడం కాస్త కష్టం. ఎక్కువగా ఒరిజినల్ నే ఫాలో అయిపోవాల్సి వుంటుంది. అందువల్ల ఆ విషయంలో దర్శకుడిని తప్పు పట్టాల్సిన పని లేదు.

అయితే నిన్నటికి నిన్న విడుదల చేసిన అంథాదూన్ రీమేక్ అయిన మాస్ట్రో ట్రయిలర్ చూస్తే, అక్కడ కూడా కనీసం తన మార్కు అనేది వుండాలని దర్శకుడు మేర్లపాక గాంధీ అస్సలు ప్రయత్నించినట్లు కనిపించలేదు. ట్రయిలర్ కట్ లో కూడా మాతృకను యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

మాస్ట్రో ట్రయిలర్, అంథాదూన్ ట్రయిలర్ రెండూ వెంట వెంటనే చూస్తే మూడు వంతులు యాజ్ ఇట్ ఈజ్ గా సీన్ టు సీన్, డైలాగు టు డైలాగ్ అందించేసారు. మేర్లపాక లాంటి కాస్త విషయం వున్న డైరక్టర్లు కూడా ఇలా చేస్తే ఎలా అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.