cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

సర్వేరాజు మిస్సైన మిల్క్ షవర్

సర్వేరాజు మిస్సైన మిల్క్ షవర్

"సర్వేజనా సుఖినో భవంతు" అంటే అసలు అర్ధం ఎలా ఉన్నా "సర్వే" చేసుకుని స్వయంతృప్తి పొందే రాజకీయనాయకులు సుఖంగా ఉంటారనే అర్థం చెప్పలానిపిస్తుంది. 

ఒకరు కాదు, ఇద్దరు కాదు..లగడపాటి రాజగోపాల్, కె.ఎ.పాల్, చంద్రబాబు ఇలా అందరూ ఎన్నికల ముందు సర్వేరాయుళ్లైపోతారు. మాకిన్ని ఒట్లొస్తాయ్, మాకిన్ని సీట్లొస్తాయ్ అని మైకులు పగిలేలా చెప్పి మానసికానందం పొందుతారు. 

తీరా ఫలితాలప్పుడు తుస్సుమన్నాక అందరూ ఒక బృందగానం మొదలుపెడతారు.. ఈ.వి.ఎం లు టాంపరింగ్ చేసారని. 

ఈ ఎలిమెంటరీ స్కూలు పిల్లల మనస్తత్వంతోనే వీళ్లు రాజకీయాలు వెలగబెడుతుంటారు. జనం నోరెళ్లబెడుతుంటారు. 

కానీ ప్రస్తుతానికి కనుచూపు మేరలో ఎన్నికలు లేకపోయినా ఖాళీగా ఉన్న రాజుగారు ఏమీ తోచక సర్వేరాజు అవతారమెత్తారు. 

2024 ఎన్నికల్లో వైసీపికి 50 కి మించి అసంబ్లీ సీట్లు రావని సర్వే జోస్యం చెప్పారు. 

అదలా ఉంటే తాను జగన్ మోహన్ రెడ్డితో నరసాపురంలో లోక్ సభ స్థానానికి పోటీ చేస్తే 19% ఓట్ల తేడాతో తానే గెలుస్తానని సర్వే ఫలితమంటూ ఒక కాగితం ముక్కని చూపించి వెల్లడించారు. ఈ విషయాన్ని 9 లక్షల మంది నియోజకవర్గ ఓటర్స్ కి ఫోన్స్ చేసి కనిపెట్టారట. 

ఈ ప్రేలాపనలు చూస్తుంటే జాలి పడాలో, చిరాకు పడాలో, అసహ్యించుకోవాలో.. లేకపోతే "ఆపరెరాయ్..." అని "అతడు" సినిమాలో తనికెళ్ల భరణి అరిచినట్టు అరవాలో అర్థం కాదు. 

ఈ సర్వేని నమ్మేదెవరు? కనీసం రాజుగారైనా నమ్ముతారా? నిజంగా నమ్మితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి బస్తీమే సవాల్ అంటూ బై ఎలక్షన్ కి తయారైపోయి, గెలిచేసి తొడ గొట్టొచ్చు కదా? ఆ పని మాత్రం చెయ్యరు. ఎందుకంటే ఇది కేవలం కాలక్షేప వ్యాపారం అనబడే టైం పాస్ బిజినెస్..అంతా ఉత్తుత్తి సర్వే. 

ఈ రఘురామ సర్వే ని కనీసం టీడీపి నమ్మినా అత్తెసరు సంఖ్యలో ఉన్న తమ ఎమ్మెల్యేలందర్నీ రాజీనామా చెయించి ఉప ఎన్నికలకి తెర లేపొచ్చు కదా. ఆ దమ్ముందా? ఈ సర్వేని నమ్మితే ఉంటుంది.

అయినా ఇదంతా ఎందుకు..? చంద్రబాబు మళ్లీ కుప్పం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని సర్వేరాయుడు గారు చెప్తున్నారు కాబట్టి అమరావతికి జరిగిన అన్యాయానికి నిరసన అని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం నుంచి ఎన్నికకి సై అని తొడ గొట్టుచ్చు కదా? ఎలా కొడతారు? ఎన్నికల్లో నిలబడడానికి ఆయనగారి తొడకి అంత రాజకీయ బలం లేదని అందరికీ తెలుసు.  

తాము కూడా నమ్మని సర్వేని జనాల చేత నమ్మించాలనుకోవడం అతితెలివా? అతి మూర్ఖత్వమా? లేక పిచ్చి తనమా? మూడూ తలో గుప్పెడు అనుకోవాలి.  అతి తెలివితో కూడిన అతి మూర్ఖత్వం వల్ల వచ్చిన పిచ్చితనమన్నమాట. 

సరే...ఇదంతా ఒకెత్తైతే భీమవరంలో మళ్లీ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యే సీటు గెలుచుకుంటారని రఘురామరాజు చెప్పారు. 

ఎలాగూ చెప్పేది ఊహాజనితమైన కాకమ్మ కథే కాబట్టి భీమవరంలో వైసీపి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి చాన్సుందని చెప్పుంటే బాగుండేది. కనీసం ఆయనగారి ఫ్యాన్స్ అయినా ఈ రాజుగారి ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేసుండే వారు. బొత్తిగా మాస్ పల్స్ తెలియకపోవడం వల్ల మిల్క్ షవర్ ని మిస్సైపోయారు.

ప్రసాద్ రాజు దంతులూరి

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×